చైర్మన్ల ఎన్నికల్లో పెద్ద లీడర్లకూ ఝలక్

నల్గొండలో మంత్రి జగదీశ్‌, పల్లాకు చెక్

పాలమూరులో మంత్రి నిరంజన్ ప్లాన్‌ ఫ్లాప్​

రంగారెడ్డిలో సబితకు చుక్కెదురు

ఇందూరులో స్పీకర్‌ కుమారుడికి పట్టం

ఆలేరు ఎమ్మెల్యే భర్తకు ‘ఎస్’

మెదక్ ఎమ్మెల్యే భర్తకు ‘నో’

పలుచోట్ల ఊహించనోళ్లకు చాన్స్‌

హైదరాబాద్, వెలుగు: డీసీసీబీ చైర్మన్ ఎన్నికల్లో మంత్రులకు షాక్ తగిలింది. తమ అనుచరులకు చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు వారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చైర్మన్ ఎన్నికపై పార్టీ పెద్దలు ముందుగా ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్‌లో పెట్టి అబ్జర్వర్ల చేతికిచ్చారు. రాత్రికి రాత్రే జిల్లాలకు వెళ్లిన అబ్జర్వర్లు.. మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సీల్ట్ కవర్స్‌ ఓపెన్ చేశారు. అందులో ఉన్న పేర్లు చూసి కొందరు మంత్రులు కంగుతిన్నారు. తమ అనుచరులకు చైర్మన్ పదవి దక్కితే జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చని భావించిన వారికి చెక్ పడిందనే చర్చ పార్టీలో జరుగుతోంది.

నల్గొండలో జగదీశ్, పల్లాకు చెక్

నల్గొండ డీసీసీబీ చైర్మన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయంతో ఇద్దరు పెద్ద లీడర్లకు దెబ్బ పడిందనే చెప్పాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పల్లా ప్రవీణ్ రెడ్డిని డీసీసీబీ చైర్మన్​గా చేసేందుకు పల్లా ప్రయత్నించారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వానికి కేటీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న జగదీశ్ రెడ్డి ప్రవీణ్‌కు పదవి దక్కితే జిల్లాలో పల్లా వర్గం మరింత బలపడుతోందని ఆందోళన చెందినట్టు పార్టీ నేతలు చెపుతున్నారు.

జాక్‌పాట్ కొట్టిన ఆలేరు ఎమ్మెల్యే

డీసీసీబీ ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత జాక్‌పాట్ కొట్టారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆమె అసెంబ్లీ విప్‌గా ఉన్నారు. చివరి నిమిషంలో భర్త మహేందర్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది. మంత్రి జగదీశ్, ఎమ్మెల్సీ పల్లా ఆధిపత్య పోరే తమకు కలిసి వచ్చిందని ఎమ్మెల్యే అనుచరులు సంతోషపడుతున్నారు. చైర్మన్ పదవిని తమ వారికే  ఇవ్వాలని మంత్రి జగదీశ్, ఎమ్మెల్సీ పల్లా పట్టుపట్టడంతో పార్టీ పెద్దలు ఇష్టంలేకున్నా మహేందర్ రెడ్డి వైపునకు మొగ్గుచూపారని జిల్లా పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు.

సబితమ్మకు నో చెప్పి.. కేటీఆర్‌ అనుచరుడికి

రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిని తమ బంధువైన కిష్టారెడ్డికి ఇప్పించుకునేందుకు మంత్రి సబితారెడ్డి చివరి నిమిషం వరకు లాబీయింగ్ చేశారు. దీనిపై జిల్లాకు చెందిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో కేటీఆర్ అనుచరుడైన మనోహర్ రెడ్డికి చాన్స్ ఇచ్చారు.

మంత్రి నిరంజన్ రెడ్డి క్యాండిడేట్‌కు దక్కలే

మహబూబ్‌నగర్ జిల్లాలో డీసీసీబీ చైర్మన్ పదవిని తన అనుచరుడు ఎం.విష్ణువర్థన్ రెడ్డికి కట్టబెట్టేందుకు మంత్రి నిరంజన్ ప్రయత్నించారు. విష్ణువర్ధన్ రెడ్డికి డీసీసీబీ ఇస్తే జిల్లాపై నిరంజన్ రెడ్డి పట్టు సాధిస్తారనే భయంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యూహత్మకంగా మైనార్టీ నేత పేరును ముందుకు తెచ్చారు. తొమ్మిది  జిల్లాల్లో ఎక్కడా మైనార్టీ వర్గానికి డీసీసీబీ చైర్మన్ ఇవ్వడం లేదన్న విషయాన్ని గ్రహించిన పార్టీ పెద్దలు నిజాం పాషాను చైర్మన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కొడుక్కు ఇప్పించుకున్న ‘పోచారం’

నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కొడుకు భాస్కర్ రెడ్డికి ఇవ్వాలని మొదట్నించి కోరుతున్నారు. దీనికి మంత్రి ప్రశాంత్ రెడ్డి అడ్డుపడి తన బంధువైన రవీందర్ రెడ్డి కోసం లాబీయింగ్ చేశారని సమాచారం. కానీ మంత్రి సూచించిన వ్యక్తికి నో చెప్పిన పార్టీ పెద్దలు.. స్పీకర్ కుమారుడికే డీసీసీబీ పదవి ఇచ్చారు.

ఫలించని పద్మా దేవేందర్ రెడ్డి ప్రయత్నం

మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా తన భర్తకు అవకాశం ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కేబినెట్‌లోకి తీసుకోలేదని దానికి ప్రతిగా తన భర్తకు చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. దేవేందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి అభ్యంతరం చెప్పారని ప్రచారం జరుగుతోంది. దీంతో దేవేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా తాజా మాజీ డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న చిట్టి దేవేందర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు.

అయిష్టంగానే ఒప్పుకున్న ఎర్రబెల్లి

వరంగల్ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్ రావు ఎంపికను మంత్రి ఎర్రబెల్లి అయిష్టంగానే ఒప్పుకున్నట్టు  పార్టీ నేతలు చెపుతున్నారు. జిల్లా రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న రవీందర్ రావుకు డీసీసీబీ దక్కితే భవిష్యత్‌లో  ఆయన జిల్లా రాజకీయాల్లో యాక్టివ్‌గా మారతారని మంత్రి భావించినట్టు చెబుతున్నారు.  అయితే రవీందర్ విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉండటంతో అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తెలిసింది.

ఎంపీ నామా మాట చెల్లలె

ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పదవిని తన అనుచరుడైన తుళ్లూరు బ్రహ్మయ్యకు ఇప్పించేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రయత్నించారు. దీనిని మంత్రి అజయ్ విభేదించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే జిల్లాలో తమ కులానికి చెందిన నేతకు డీసీసీబీ చాన్స్ ఇస్తే, భవిష్యత్‌లో తనకు ఇబ్బంది అవుతుందని మంత్రి అజయ్ ఆలోచన చేసినట్టు పార్టీ నేతలు చెప్పారు. అందుకే బీసీ కులానికి చెందిన కూరాకుల నాగభూమయ్య పేరును మంత్రి తెరమీదికి తెచ్చి పార్టీ పెద్దలతో ఓకే చేయించుకున్నట్టు తెలిపారు.

ఒకేమాటపై కరీంనగర్ నేతలు

కరీంనగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొండూరి రవీందర్‌కు తిరిగి అవకాశం ఇస్తానని మంత్రి కేటీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగంగా ప్రకటించారు. దీంతో జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కేటీఆర్ మాటకు జై కొట్టారు. టెస్కాబ్ తొలి చైర్మన్ గా పనిచేసిన రవీందర్‌ను మరోసారి చైర్మన్‌గా ఎన్నికోవడం లాంఛనమే కానుంది.

For More News..

రామయ్య కల్యాణానికి కాసుల కష్టం

Latest Updates