సోలో లైఫే సో బెటరంట!

  • సౌత్ కొరియాలో పెరిగిపోతున్న ‘సింగిల్స్’
  • నో మ్యారేజ్.. నో డేటింగ్
  • దారుణంగా పడిపోయిన సంతానోత్పత్తి
  • 0.98కి దిగజారిన ఫర్టిలిటీ రేటు
  • గతేడాదితో పోలిస్తే 8.7 శాతం తగ్గుదల

సియోల్‘‘భద్రం బీ కేర్​ఫుల్ బ్రదరు.. భర్తగ మారకు బ్యాచిలరు.. షాదీ మాటే వద్దు గురు.. సోలో లైఫే సో బెటరు” ఓ ఫేమస్ సినిమాలోని పాట ఇది. సౌత్ కొరియాలో ఇప్పుడే చాలా మంది దీన్నే ఫాలో అవుతున్నారు. నో మ్యారేజ్, నో డేటింగ్ అంటున్నారు. దీంతో అక్కడ ఫర్టిలిటీ రేటు దారుణంగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారింది. 2018లో ఒక్కో మహిళ ఫర్టిలిటీ రేటు (సగటున ఒక మహిళలకు ఆమె జీవితకాలంలో పుట్టే పిల్లల సంఖ్య) 0.98కి తగ్గింది. అంతకుముందు ఏడాది 1.05గా నమోదైంది. అంటే 2018తో పోలిస్తే 2017లో సంతానోత్పత్తి రేటు 8.7 శాతం తగ్గింది. 1970ల్లో ప్రభుత్వం ఫర్టిలిటీ వివరాలను లెక్కించడం మొదలుపెట్టాక ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి.

ప్రపంచ దేశాల లిస్టులో అట్టడుగున..

ఫర్టిలిటీ రేటు 2 వరకు ఉంటే పాపులేషన్ స్టేబుల్​గా ఉన్నట్లు లెక్క. అంతకుమించితే జనాభా పెరుగుతున్నట్లే. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువ ఫర్టిలిటీ రేటు ఉన్న దేశాల లిస్టులో సౌత్ కొరియా తొలిస్థానంలో నిలిచింది. ఒకప్పుడు లిస్టులో ముందున్న జపాన్ కన్నా దిగజారింది. జపాన్​లో గతేడాది సంతానోత్పత్తి రేటు 1.42గా నమోదైంది. అమెరికాలో కాస్త ఎక్కువగా 1.72గా రికార్డయ్యింది. ఇక కొన్ని ఆఫ్రికా దేశాల్లో అత్యధికంగా 5 నుంచి 6 వరకు ఫర్టిలిటీ రేటు కొనసాగుతోంది. మరోవైపు సౌత్ కొరియాలో ముసలోళ్లు పెరుగుతున్నారు. 0–14 ఏళ్ల మధ్య ఉన్న వారితో పోలిస్తే 65 ఏళ్లు పైబడిన వాళ్లు భారీగా పెరిగారు. వృద్ధుల సంఖ్య 13.6 శాతానికి చేరింది.

పరిష్కార చర్యలు?

పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో సౌత్ కొరియా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పని సమయాలను తగ్గించింది. వారంలో పని గంటలను 68 నుంచి 52 గంటలకు తగ్గించింది. కాలేజీల్లో డేటింగ్, లవ్, సెక్స్ వంటి అంశాలను స్టూడెంట్స్ కు ఎడ్యుకేటర్లు చెబుతున్నారు.
కొన్నిచోట్ల స్టూడెంట్లు డేటింగ్​వెళ్లేందుకు
ప్రోత్సహిస్తున్నారు!!!

ఎందుకిలా?

వర్క్ కల్చర్​సరిగ్గా లేకపోవడం వల్ల సౌత్ కొరియన్లు.. తమ కెరియర్​ను, ఫ్యామిలీ లైఫ్​ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఓ వైపు నిరుద్యోగం పెరిగిపోవడం, జాబ్​మార్కెట్​లో కాంపిటీషన్ పెరిగిపోవడం కూడా మరో కారణం. దీంతో ఖాళీ సమయాల్లో పార్ట్​టైమ్ ఉద్యోగాలు, లేదా ప్రొఫెషన్​కోర్సులు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. లేదా అసలు పెళ్లే వద్దనుకుంటున్నారు. 2018లో 20 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మెజారిటీ జనం సింగిల్​గానే ఉన్నారు. వారిలో 51 శాతం మంది పురుషులు, 64 శాతం మంది మహిళలు.. తాము సింగిల్​గానే ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

Latest Updates