జీతాలివ్వడానికి పైసల్లేవ్.. 5 వేల కోట్లు ఇవ్వండి

కేంద్రానికి ఢిల్లీ సర్కార్ అభ్యర్థన
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి తక్షణ అవసరంగా తమకు రూ.5 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర సర్కార్ ను ఢిల్లీ గవర్నమెంట్ విజ్ఞప్తి చేసింది. కరోనా కారణంగా లాక్ డౌన్ టైమ్ లో ఆదాయాలు తగ్గిపోయినందున ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఖర్చులను తీర్చడానికి కేంద్రాన్ని ఈ సాయం కోరుతున్నట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ఢిల్లీ ఫైనాన్షియల్ మినిస్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న మనీశ్.. డిజాస్టర్ రిలీఫ్​ ఫండ్ కింద రాష్ట్రాలకు మంజూరు చేసిన ఫండ్ తమకు రాలేదని, అందుకోసం ఢిల్లీ సర్కార్ తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశామన్నారు.

‘ఢిల్లీ ప్రభుత్వ ఆదాయంతోపాటు ఖర్చులను రివ్యూ చేశాం. సర్కార్ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఆఫీసుల నిర్వహణ కోసం ప్రతి నెల సుమారుగా రూ.3,500 కోట్లు మాకు కావాలి. గత రెండు నెలల్లో జీఎస్టీ కలెక్షన్స్ ద్వారా రూ.500 కోట్లు సమకూరాయి. గవర్నమెంట్ దగ్గర రూ.1,735 కోట్లు ఉన్నాయి. రెండు నెలలకు కలిపి రూ.7 వేల కోట్ల అవసరం ఉంది. ఎంప్లాయీస్ శాలరీస్ ఎలా చెల్లించాలనేదే ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సమస్య. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ట్యాక్స్ కలెక్షన్ దాదాపుగా 85 శాతం కంటే దిగువగా పడిపోయింది. రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్రం విడుదల చేసిన డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఢిల్లీకి ఎలాంటి నిధులు రాలేదు’ అని మనీశ్ చెప్పారు. దేశంలోనే అత్యధిక కరోనా ఇన్ఫెక్షన్స్ లో మూడో ప్లేస్ లో ఉన్న ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,549గా ఉండగా.. మహమ్మారి కారణంగా 416 మంది చనిపోయారు.

Latest Updates