ఆఫీసుల్లేవ్​: చెట్లకిందనే గ్రామసభలు

కుర్చీలు, టేబుళ్లకు కూడా పైసా ఇయ్యలేదు

జాడలేని హెల్త్ సబ్ సెంటర్లు, అంగన్‌‌వాడీ కేంద్రాలు

రేషన్ కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సిందే

అవే కచ్ఛా రోడ్లు, బ్రిడ్జిలు లేని వాగులు..

ఆందోళనలో మారుమూల ప్రజలు, గిరిజనులు

పెద్దపల్లి జిల్లా కమాన్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం కన్నాల పంచాయతీ పరిధిలోని తండాను ఏడాదిన్నర కింద బామ్లా నాయక్‌‌‌‌ తండాగా మార్చి పంచాయతీ హోదా కల్పించారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీని పాలకుర్తి మండల పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ తండాకు పంచాయతీ ఆఫీసు లేకపోవడంతో సర్కారు బడిలోని ఓ రూమ్‌‌ను ఆఫీసుగా మార్చారు. ఏదైనా సమావేశానికి జనం ఎక్కువ వస్తే ఇట్లా.. చెట్ల కిందనో, ఖాళీ జాగాల్నో పెట్టుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో తండాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్చినా, అక్కడి ప్రజల జీవితాల్లో ఇసుమంతైనా మార్పు తేలేకపోయింది. ‘ప్రజల వద్దకు పాలన, అన్ని సౌలత్‌‌‌‌లు కల్పించడం, అందుబాటులోనే అన్ని రకాల ప్రభుత్వ సేవలు’ అంటూ 500 , ఆపైన జనాభా ఉన్న 4,383 గూడేలు, తండాలకు టీఆర్‌‌‌‌ఎస్ సర్కారు 2018లో పంచాయతీ హోదా కల్పించింది. వీటిలో 1,777 తండాలున్నాయి. అదే ఏడాది ఆగస్టు 2 నుంచి కొత్త పంచాయతీలు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. ఇక తమ తరతరాల గోస తీరినట్లేనని అక్కడి జనం భావించారు. ప్రభుత్వ బిల్డింగ్‌‌‌‌లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న బడిలోనో, గుడిలోనో, గుడిసెలోనో, షెడ్డులోనో పంచాయతీ ఆఫీసు ఏర్పాటు చేసి బోర్డులు పెట్టుకున్నారు. ఆడో, ఈడో అడుక్కొచ్చిన కుర్చీలు వేసుకొని ఒక ఆఫీస్‌‌‌‌ రూపం తెచ్చిన్రు. రోజులు.. నెలలు.. గడిచిపోయాయి. ఇప్పటికి ఏడాదిన్నర పూర్తయింది. మొదట్లో ప్రత్యేకాఫీసర్లు, తర్వాత పాలకవర్గాలు కొలువుదీరాయి. కానీ నేటికీ అనేక గూడేలు, తండాలకు నాటి తాత్కాలిక పంచాయతీలే దిక్కయ్యాయి. చెట్ల కిందే గ్రామసభలు
జరుగుతున్నాయి.

సమస్యలే సమస్యలు..

పంచాయతీ హోదాతో మారుమూల తండాలు, గూడేల దశ తిరుగుతుందని అందరూ భావించారు. సౌలత్‌‌‌‌లు వస్తయని, సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తిభిన్నంగా ఉన్నాయి. పంచాయతీ బిల్డింగ్‌‌‌‌ల నిర్మాణానికి ప్రపోజల్స్ తీసుకున్నారు తప్ప నేటికీ పైసా మంజూరుచేయలేదు. ఎక్కడా కొత్త భవనాలు నిర్మించలేదు. ఇక ఫర్నిచర్ కొనుగోలు కోసం ఎలాంటి నిధులు రాలేదు. ఇక గూడేలు, తండాల్లో ప్రజలకు పన్నుల చెల్లింపుపై అవగాహన లేదు. దీంతో కొద్దిపాటి ఆదాయం కూడా రావడం లేదు. పల్లె ప్రగతి ప్రారంభమైనప్పటి నుంచి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద జనాభా ప్రాతిపదికన కొద్దో గొప్పో నిధులు వస్తున్నా అవి మెయింటనెన్స్‌‌‌‌కే సరిపోతున్నాయని సర్పంచులు వాపోతున్నారు. ఇవి చాలవన్నట్లు అప్పులు చేయించి మరీ ట్రాక్టర్లు కొనిపించారు. చాలా తండాల్లో కిరాయికి తీసుకున్న చిన్నిచిన్న షెడ్లలో పంచాయతీ కార్యాలయాలు నడుపుతున్నారు. ఆ అద్దె కూడా కట్టలేక అనేకచోట్ల సర్కారు బడుల్లో రూమ్‌‌‌‌లనే ఆఫీసులుగా మార్చేశారు. కొందరు సర్పంచులైతే తమ ఇండ్లలోనే ఓ గదిని ప్రత్యేకంగా పంచాయతీ కోసం కేటాయించారు. ఆ ఇరుకుగదుల్లో చోటు లేక చెట్ల కింద గ్రామసభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీగా అప్​గ్రేడ్​ అయితే వస్తాయనుకున్న హెల్త్ సబ్​సెంటర్లు, అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలు రాలేదు. కనీసం రేషన్​షాపులను కూడా ఏర్పాటు చేయకపోవడంతో బియ్యం కోసం ఇదివరకటి లెక్కనే కిలోమీటర్ల దూరంలోని పాత పంచాయతీలకు వెళ్లక తప్పడం లేదు. మారుమూల ప్రాంతాల్లో అనేక పల్లెలకు సరైన రోడ్లు లేవు. కచ్ఛా రోడ్లపై వాహనాలు నడువవు. వానాకాలంలో వాగులు దాటనివ్వవు. కనీసం అంబులెన్సులూ రావు. టైమ్‌‌‌‌కు దవాఖానకు వెళ్లలేక ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పంచాయతీలుగా మారి ఏడాదిన్నర కావస్తున్నా ఈ పల్లెలపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టలేదు. రోడ్లు కాకపోవడం, వాగులపై వంతెనలో, కల్వర్టులో రాకపోవడం వల్ల తమ జీవితాల్లో ఎలాంటి మార్పు లేకుండా పోయిందని గ్రామీణులు ముఖ్యంగా గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అన్నీ ఇబ్బందులే..

మా పంచాయతీ ఏర్పడి ఏడాదిన్నర గడిచింది. సొంత భవనం లేక ఇబ్బంది పడుతున్నం.  రేషన్ సరుకుల కోసం ఆరు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. గ్రామానికి రోడ్డు వేయకపోవడంతో మండల కేంద్రానికి వెళ్లాలంటే కష్టమవుతోంది. హెల్త్ సెంటర్ లేక ఆశా వర్కర్లు,  ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. పనులు చేద్దామంటే పైసలు లేవు.

– అజ్మీర విమల, సర్పంచ్ రెడ్డిపల్లి, మహా ముత్తారం మండలం, జయశంకర్​భూపాలపల్లి జిల్లా

ఎమ్మెల్యే ఊర్లో త్రీ ఇన్వన్

ఇది ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగూడ. ఎమ్మెల్యే ఆత్రం సక్కు సొంతూరు. ఈడ సర్కారు స్కూల్‌‌ బిల్డింగ్‌‌లోనే బడి, మరోవైపు అంగన్‌‌వాడీ సెంటర్, ఇంకోవైపు గ్రామ పంచాయతీ ఆఫీస్ నడుస్తున్నాయి. దీంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారనీ, వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్​ చేయాలని జిల్లా జడ్పీ స్థాయి సంఘం సమావేశంలో ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. తన సొంతూర్లోనే పంచాయతీ బిల్డింగ్‌‌ లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Latest Updates