పాతబస్తీలో సర్కారు స్థలాలకు రక్షణ కరవు

  • అన్యాక్రాంతం అవుతున్న బండ్లగూడ భూములు
  • పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
  • సర్కారు భూములకు ఫెన్సింగ్​లు ఏవి..?
  • కబ్జాలపై ఫిర్యాదులు వస్తే నామమాత్రపు చర్యలు
  • పార్కులుగా అభివృద్ధి చేయాలని స్థానికుల డిమాండ్​

హైదరాబాద్​: వెలుగు: పాతబస్తీలో కోట్ల వ్యయం చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వ భూములకు పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు లేకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఏండ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న సర్కారు భూములపై అక్రమార్కులు కన్నేసి స్థానిక అధికారులు, రాజకీయనేతల అండదండలతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, హరితహారం నిర్వహణకు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల భవనాల నిర్మాణాలకు భూముల కొరత నెలకొంటున్నది.  ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని పరిరక్షించాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే తప్ప స్పందించలేని పరిస్థితుల్లో ఉంది.

అడ్డూ అదుపు లేని కబ్జాలు

బండ్లగూడ మండల పరిధిలోని ప్రభుత్వ భూముల కబ్జాలకు అడ్డు అదుపూలేకుండా పోయింది.  సర్వేనెంబర్​-13లోని దాదాపు 4 ఏకరాల భూమిని  కొందరు అధికారులు ఇప్పటికే  అప్పనంగా అన్యులకు అప్పగించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మహానగరంలో ఇండ్లస్థలాలకు ప్రభుత్వ భూములు ఇవ్వడంపై నిషేధం ఉన్నప్పటికీ ఆచరణలో జరుగుతునే ఉన్నాయి.  జిల్లా, మండలస్థాయి అధికారులు, న్యాయస్థానాలను  ఏమార్చి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు వీలుగా క్షేత్రస్థాయి అధికారులు వ్యవహరాశైలి ఉండడం గమనార్హం.

విస్తీర్ణం తగ్గిపోతోంది 

నగరంలో అత్యధికంగా ప్రభుత్వ భూములున్న మండలంగా బండ్లగూడ ముందు వరుసలో ఉంటుంది. చాలా వరకు ఇక్కడి సర్కారు  భూములు అన్నీ కబ్జా కోరల్లో ఉన్నాయి. కందికల్​ గ్రామం.303, 304, 305, 306 సర్వేనెంబర్ల  సంఖ్యలోని ప్రభుత్వ భూమి కూడా కబ్జా లకు  గురవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటుభూమిని  అనుకుని ఉండే ఈ భూమిపై కబ్జాదారుల కన్ను పడడంతో క్రమంగా ప్రభుత్వ భూముల  విస్తీర్ణం తగ్గుతోందని స్థానికులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితోపాటు బండ్లగూడ సర్వేనెంబర్ 103,1,103,11, నుంచి 20 వరకు ఉన్న ప్రభుత్వ భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. అందులో  కొన్ని సర్వేనెంబర్లకు సంబంధించి   కేసులు  న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. వీటిని కాపాడటానికి రెవెన్యూ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.  బండ్లగూడ ఖల్సా సర్వేనెంబర్​266,1లో ఉన్న 200 ఏకరాల భూమిని  అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలు ఇప్పటికీ  జరుగుతూనే ఉండడం విశేషం. ఇక్కడ దాదాపు 150 ఎకరాలపైనే విస్తీర్ణంలో కాలనీలు వెలిశాయి. వీటిని ఇప్పుడు తొలగించడం కష్టతరమైనప్పటికీ ఇప్పటి వరకు మిగిలి ఉన్న భూములను రక్షించుకునే ప్రయత్నాలు ఏవీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం చేపట్టకపోవడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.   బండ్లగూడ మాన్మనికుంటాలోని  భూములను ఎన్నికల సమంలో   కొందరు  కబ్జా చేసేందుకు  రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టి సరిహద్ధ రాళ్లను పాతారు. స్థానికులు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో కబ్జాదారులు వెనుకంజవేశారు.

భూమి వివరాలెక్కడా ?

హైదరాబాద్​ జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ, ఏమేరకు ఉన్నాయనే విషయాలపై గతంలో  రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్​ ఒక రిపోర్టను తెచ్చించుకుని పరిశీలించారు.  అయితే ఆ రికార్డలకు  సంబంధించి వివరాలు ప్రస్తుతం బండ్లగూడ ఎమ్మార్వో ఆఫీసులో మాయం కావడం గమనార్హం. రికార్డుల మాయం వెనుక కబ్జాదారుల హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఎమ్మార్వో ఆఫీసులో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది వ్యవహారశైలి కబ్జాదారులకు అనుకూలంగా ఉండడం వల్లే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందని మండల ప్రజలు విమర్శిస్తున్నారు.

రక్షణ చర్యలు చేపడతాం

ప్రభుత్వ భూములను రక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నాము. ప్రభుత్వ భూముల్లో క్రయ విక్రయాలు ఎప్పటికైనా చెల్లుబాటు కావు. అలాంటి వాటిని కొనుగోలు చేయరాదు.  ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేసే వారిపై  క్రిమినల్​ కేసులు నమోదుచేస్తున్నాము.  కబ్జాలు,  ఆక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే  క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని కూల్చివేస్తున్నం. సర్కారు భూములను ఆక్రమించే వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు.  జుబేదా బేగం, తహసీల్దార్​(ఇన్​చార్జి) బండ్లగూడ మండలం

Latest Updates