కోట్లు ఖర్చు చేస్తున్నా.. క్వాలిటీ ఉండట్లే

బల్దియా చేపట్టిన పనుల్లో  డొల్లతనం బయటపడింది. వందల కోట్లు వెచ్చిస్తూ  ఏడాది కాలంలో చేపట్టిన  పనుల్లో  సగం పనులు  నాసిరకమే అని తేలింది. 2018 ఏప్రిల్ 1  నుంచి 2019  మార్చి 31 వరకు  చేపట్టిన పనులను  జీహెచ్ఎంసీ  క్వాలిటీ కంట్రోల్ విభాగం పరిశీలించగా వాస్తవాలు నిగ్గుతేలాయి. పనుల్లో వాడే  సామగ్రి, పనితీరు నాసిరకమేనని స్పష్టమైంది. సిటీ లో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి, మరమ్మతుల  కోసం  జీహెచ్ఎంసీ ఏటా  సుమారు  రూ. 500 కోట్లు  వెచ్చిస్తుంది. టెండర్ల ద్వారా  కాంట్రాక్టులను అప్పగిస్తుంది.  అయితే చేపట్టిన పనుల్లో  కాంట్రాక్టర్లు నాణ్యతను మాత్రం విస్మరిస్తున్నారు. ఎలాంటి సామగ్రి  వాడుతున్నారు,  పనులు ఎలా నిర్వహిస్తున్నారనే  పర్యవేక్షణను అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో  తూతూమంత్రంగా  పనులను చేస్తున్నారు.  ఈ పనులు నాసిరకంగా ఉండటంతో  మళ్లీ కొంతకాలానికి  దెబ్బతింటున్నాయి.  స్థానిక ప్రజాప్రతినిధులు కూడా  కాంట్రాక్టర్ల నుంచి  కమీషన్లు తీసుకుంటున్నట్టు  విమర్శలు వస్తున్నాయి. అడుగడుగునా  ఎవరికి తోచిన విధంగా వాళ్లు అలసత్వం వహిస్తుండడంతో  బల్దియా ఖజానాకు గండి పడుతుంది.

50శాతం నాణ్యత లేదు…

గతేడాదిలో 10,390  వర్క్స్ చేశారు.  వీటికి సంబంధించిన  నాణ్యత ప్రమాణాలను  జీహెచ్ఎంసీ  క్వాలిటీ కంట్రోల్  వింగ్  పరిశీలించింది.  వీటిలో 50 శాతం పనులు  నాసిరకమైనవేనని స్పష్టం చేసింది.  కానీ ఈ విషయాన్ని  జీహెచ్ఎంసీ వెల్లడించకపోవడం  అనుమానాలకు తావిస్తోంది.  అధికారుల విశ్వసనీయ సమాచారం మేరకు  సగం పనులపై ఉన్నతాధికారులు అసంతృప్తి గా ఉన్నట్లు  తెలుస్తుంది. ఈ పనులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే  పనుల్ని  మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.  ఈ పనుల్లో  రోడ్లు,  కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో  పాటు  ఘన వ్యర్థాల నిర్వహణ  కూడా  అస్తవ్యస్తమేనని  తనిఖీల్లో తేలింది.  ఈ పనుల పై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  కాంట్రాక్టర్లు  నాసిరకం పనులు చేసినప్పటికీ  పదే పదే వారికే కాంట్రాక్టర్ల దక్కడంపైనా  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కోట్లు వెచ్చిస్తున్నా..

సిటీలో 9,100  కిలోమీటర్ల పొడవైన  రోడ్లు ఉన్నాయి.  కాంక్రీట్ పేవ్ మెంట్స్,  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు  నిర్మాణం,  మరమ్మతులు  ఏటా నిర్వహించాల్సి ఉంటుంది.  సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌  కోసం కోట్లు  వెచ్చిస్తున్నారు.  ఇలా వివిధ విభాగాలకు సంబంధించి  సుమారు 10  వేల సివిల్ పనుల కోసం  ఏటా  రూ.  500 కోట్లు  వెచ్చిస్తున్నారు.  కాంట్రాక్టర్లు మాత్రం  వినియోగిస్తున్న మెటీరియల్ నాసిరకంగా ఉంటోంది.  ఫలితంగా ఈ పనులు  కొన్నాళ్లకే దెబ్బతింటున్నాయి. ఇవి దెబ్బతినడంతో మళ్లీ కాంట్రాక్టర్లకు  పనులు అప్పగిస్తున్నారు.   పనులు జరుగుతున్నప్పుడు నిరంతర పర్యవేక్షణ లేకపోవడం  వల్ల  కాంట్రాక్టర్లు అందినంత నొక్కేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కాంట్రాక్టర్లు,  బాధ్యులైన డిపార్ట్‌ మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని  కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Latest Updates