వాన మురిపెం.. వారమే

  • మళ్లీ ముఖం చాటేసిన రుతుపవనాలు
  • వారం రోజులుగా అక్కడక్కడ చిరుజల్లులే
  • మరో ఐదారు రోజులు ఇదే పరిస్థితి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో వానలు వారం రోజుల ముచ్చటగానే మారాయి. ఈనెల తొలి వారంలో కుండపోత వర్షాలు కురిసి.. అంతలోనే సైలెంట్ అయ్యాయి. రెండో వారం నుంచి వానలు పడ్తలేవు. రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే కురుస్తున్నాయి. మరో ఐదారు రోజుల దాకా ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాల్లో ఏదో ఒకటి ఏర్పడినా భారీ వానలు పడతాయని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌‌ రాజారావు పేర్కొన్నారు.

గత వారం కుమ్మేశాయి

ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వానలు పడ్డాయి. అల్పపీడనాలు, ఆవర్తనాలు ఏర్పడటంతో కురిసిన వర్షాలకు కొన్ని జిల్లాల్లో గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో 200 శాతం రెయిన్‌‌ఫాల్‌‌ పెరిగింది. అప్పటివరకు 38 శాతం లోటు ఉండగా, ఒక్క వారంలోనే సాధారణ వర్షపాతానికి చేరింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ పూర్తిగా సాధారణ వర్షపాతం రికార్డయ్యింది. తర్వాత సీన్ మారింది. ఈనెల 8వ తేదీ నుంచి 14వ తేదీ దాకా వర్షాలు తక్కువగా కురిశాయి. రోజు ఎక్కడో ఒక చోట మాత్రమే భారీ వర్షం కురిసింది. చాలా తక్కువ చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో ఈ వారంలో 44 శాతం డెఫిసిట్ ఉండగా, 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ములుగు, కుమ్రుంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఓవరాల్‌‌గా ఈ సీజన్‌‌లో 8 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది.

ఎండలు.. ఉక్కపోత

రాష్ట్రంలో వర్షాలు కురవకపోగా, ఎండలు మాత్రం దంచికొడుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రెండు నుంచి నాలుగు డిగ్రీల దాకా అధికంగా టెంపరేచర్స్‌‌ రికార్డవుతున్నాయి. ఖమ్మంలో అత్యధికంగా 34.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సాధారణం కంటే 3.2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 33.8, హైదరాబాద్‌‌లో 32.6, ఆదిలాబాద్‌‌లో 32.3, మహబూబ్‌‌నగర్‌‌లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో పగటి వేళల్లో విపరీతమైన ఉక్కపోత ఉంటోంది. రాత్రిళ్లు చలిగా ఉంటోంది.

ఆందోళనలో రైతన్న..

ఈనెల14వ తేదీ వరకు రాష్ట్రంలో 43,34,487 హెక్టార్లలో పంట సాగు చేశారు. ఇదే సమయానికి గతేడాది 35,82,334 హెక్టార్లలో సాగు చేశారు. వారం క్రితం కురిసిన భారీ వర్షాలతో ఉపశమనం లభించినా, ప్రస్తుతం వానలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూమికి పదును లభించడంలేదు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Latest Updates