వాహనాల ఆర్​సీ ట్రాన్స్​ఫర్​ చేసుకోవట్లే

no-rc-transfers-of-vehicles

గ్రేటర్ హైదరాబాద్​లో వాహనదారులు తమ వాహనాన్ని అమ్మే విషయంలో చూపే శ్రద్ధను యాజమాన్య బదిలీపై పెట్టటం లేదు. నిర్లక్ష్యం కారణంగా దాదాపు పదిలక్షలకు పైగా వాహనాలు విక్రయం జరిగినప్పటికీ యాజమాన్య బదిలీ మాత్రం పెండింగ్ లో ఉండిపోయాయి. వాహనాన్ని అమ్మిన వెంటనే కొంత అడ్వాన్స్ తీసుకొని ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ ఫాంపై సంతకాలు చేసేస్తున్నారు. ఆ తర్వాత ఓనర్ షిప్ బదిలీ అయ్యిందా లేదా అన్నది పట్టించుకోవటం లేదు. ఓనర్ షిప్ మారకుండానే సిటీ రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిజానికి వాహనం అమ్మిన వెంటనే ఓనర్ షిప్ మార్పిడి జరిగితే ప్రతి వాహనం ద్వారా ఆర్టీఏకు రూ.650 నుంచి 800 వరకు ఫీజు రూపంలో వస్తుంది. కానీ సిటీలో రోజుకు వెయ్యికి పైగా పాత వాహనాలు అమ్మకాలు జరుగుతున్నప్పటికీ ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ కోసం వస్తున్న వారి సంఖ్య మాత్రం 300లకు మించటం లేదు.

అసలు యాజమానికే నష్టం..

వాహనం అమ్మిన తర్వాత కచ్చితంగా యాజమాన్య బదిలీ విషయంలో అమ్మకం సీరియస్ గా ఉండాలి. లేదంటే తానే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాహనం అమ్మిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి ఆ వాహనంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, లేక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా అది పాత ఓనర్ ఖాతాలోనే పడుతుంది. వాహనం ఎవరి పేరుపై ఉంటే వారిపైనే చర్యలు తీసుకుంటారు. ట్రాఫిక్ చలాన్లు వేసేస్తారు. ఇది తెలియని చాలా మంది వాహనాదారులు ట్రాఫిక్ చలాన్లు వచ్చినప్పుడో లేదంటే తాము అమ్మిన కారు చట్ట వ్యతిరేక కార్యాకాలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినప్పుడో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత తర్వగా వాహనాన్ని వదిలించుకోవాలన్న ఆతృతలో ముందు వాహనాన్ని అమ్మేస్తున్నారు. ఆ తర్వాత వాహనాన్ని బదిలీ చేయించుకోవాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇలా బదిలీ కానీ వాహనాలపై గ్రేటర్లో దాదాపుగా కోట్ల రూపాయలకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.

సెకండ్ హ్యాండ్ వ్యాపారులే..

వాహనాల బదిలీలు కాకపోవటానికి ప్రధాన కారణం సెకండ్ హ్యాండ్ వ్యాపారులు. వీరు వాహనాలను కొనుగోలు చేసిన వెంటనే ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ చేయించుకోవటానికి ఇష్టపడరు. అదే వాహనాన్ని ఎక్కువ రేటుకు వేరే వ్యక్తికి అమ్ముతుంటారు. అది మరో వ్యక్తికి విక్రయం జరుగుతుంది. ఇలా ఒకే వాహనం చాలా మంది చేతులు మారినప్పటికీ మొదట అమ్మిన వ్యక్తి పేరునే వాహనం రిజిస్ట్రేషన్ ఉంటుంది. పాత వాహనాలు విక్రయించే వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులు వాహనాలను కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఓనర్ షిప్ సర్టిఫికెట్ అనే అంశం ప్రస్తావనకు వస్తోంది. లేదంటే వాహనం అమ్మిన వ్యక్తి మరో కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు అతని పేరు మీద రెండో వాహనం రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ట్యాక్స్ 2 శాతం అధికంగా చెల్లించాలి. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కొంతమంది వెంటనే పాత వాహనాన్ని బదిలీ చేయించుకుంటున్నారు.

బినామీ పేర్లపై..

ఫైనాన్సియర్లు చాలా వరకు వాహనాలను బదిలీ చేయించుకోవటం లేదు. చాలా వరకు ఫైనాన్స్ కట్టని వాహనాలను జప్తు చేస్తున్నారు. ఈ వాహనాలను వేరే వాళ్లకు అమ్మటం గానీ కిరాయికి ఇవ్వటం గానీ చేస్తున్నారు. అయితే అసలు వాహనాదారుని పేరు మాత్రం మార్చుకుండానే నెట్టుకొస్తున్నారు. వాహనాన్ని బదిలీ చేయాలంటే అసలు ఓనర్ అంగీకారం అవసరం. కానీ జప్తు చేసిన వాహనాలు లేదంటే, దొంగ వాహనాలను ఓనర్ షిప్ మార్పిడి చేయకుండానే రోడ్లపై తిప్పుతున్నారు. ఇతర రాష్ట్రాల వాహనాలు చాలా వరకు హైదరాబాద్ లో తిరుగుతున్నాయి. వీటిపై ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఓనర్ షిప్ బదిలీ జరిగితే ఆర్టీఏకు ఆదాయం భారీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.

Latest Updates