కలెక్టర్​ లేక రెండు నెలలు

 పెద్దపల్లికి కొత్త కలెక్టర్​ను నియమించని సర్కారు

 ఇన్​చార్జితోనే నెట్టుకొస్తున్నరు

 ముందుకు సాగని పనులు

పెద్దపల్లి,  వెలుగు: పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్ లేక రెండు నెలలు అవుతోంది. ప్రభుత్వం రెగ్యులర్​కలెక్టర్ ను నియమించకపోవడంతో జిల్లాలో   పరిపాలన కుంటుపడుతోంది. జూన్​15న జిల్లా కలెక్టర్​అయిన సిక్తా పట్నాయక్​ను ఆదిలాబాద్​ కలెక్టర్​గా ప్రభుత్వం బదిలీ చేసింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్​గా పని చేస్తున్న భారతి హోలీ కేరికి పెద్దపల్లికి  ఇన్​చార్జీగా బాధ్యతలు అప్పగించారు.

ముందుకు సాగని పనులు

ప్రభుత్వం హరితహారం, రైతు వేదికలు,  డంపింగ్​ యార్డులు, శ్మశాన వాటికలు, విలేజీ అర్బన్​ పార్కుల నిర్మాణం లాంటి కార్యక్రమాలను ప్రాధాన్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది. ఇన్​చార్జి కలెక్టర్​ పాలనతో ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమాలు కూడా అనుకున్నంత స్పీడ్​గా సాగడం లేదు. జిల్లాలో 54 రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించగా ఇందు కోసం రూ. 11.88కోట్లు కేటాయించారు. అయితే అనుకున్నట్టు ఈ పనులు కొనసాగడం లేదు. ఒక్క రైతు వేదికలు మాత్రమే కాకుండ ప్రభుత్వ పరంగా మిగిలిన ప్రాధాన్య కార్యక్రమాలు కూడా ఆలస్యమవుతున్నాయి.

సమస్యలు ఎవరికి చెప్పుకునేది ?

ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్​ను నేరుగా కలిసి చెప్పుకునే వారు. 2 నెలలుగా కలెక్టర్​ లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇన్​చార్జి కలెక్టర్​ ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు వస్తారో  తెలిసే అవకాశం లేదు. పబ్లిక్​తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికైనా జిల్లాకు కొత్త కలెక్టర్​ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

 

Latest Updates