ఐపీఎల్‌కు స్పాన్సర్‌ దొరికేనా?

బీసీసీఐ ముందు కొత్త సవాళ్లు
యాంటీ చైనా మూమెంట్తో మెగా లీగ్‌కు చిక్కులు
పేటీఎమ్, బైజూస్, డ్రీమ్ ఎలెవెన్ తో బంధం ముగించాలని డిమాండ్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆలస్యంగా జరుగుతున్న ఐపీఎల్ కు రోజుకో కొత్త సమస్య ఎదురువుతోంది. ముఖ్యంగా యాంటీ చైనా మూమెంట్ బీసీసీఐకి పెను సవాలుగా మారింది. ఇండియా, చైనా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో టైటిల్ స్పాన్సర్ ‘వివో’ ఇప్పటికే లీగ్ కు దూరమైంది. దీంతో కొత్త స్పాన్సర్‌‌ వేటలో బోర్డు నానా ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఏదీ కొలిక్కి రావడం లేదు. స్పాన్సర్‌‌షిప్‌ వ్యవహారం పెద్ద సమస్య కాదని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌ గంగూలీ చెబుతున్నా.. రియాల్టీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. స్పాన్సర్‌‌షిప్‌కు జియో సిద్ధంగా ఉందని వార్తలొచ్చినా.. కనీసం చర్చలు జరపడానికి కూడా ఇంట్రెస్ట్‌‌ చూపలేదు. దీని వెనుక ఉన్న కారణాలు మాత్రం బహిర్గతం కాలేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌‌ దిగ్గజం అమెజాన్‌ మాత్రమే టైటిల్‌‌ స్పాన్సర్‌‌షిప్‌ రేసులో ఉందని సమాచారం. ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవి కొలిక్కి వస్తాయా? లేదా? చూడాలి. ఇక కోకకోలా, అన్‌అకాడమీ కూడా రేసులోకి వచ్చాయని ఊపిరి పీల్చుకునే లోపే బీసీసీఐ ముందు మరో కొత్త సవాలు వచ్చి పడింది. ఐపీఎల్ సెంట్రల్ స్పాన్సర్స్, ఇండియన్ క్రికెట్ స్పాన్సర్‌‌షిప్‌ కంపెనీలైన పేటీఎమ్, డ్రీమ్ ఎలెవెన్, బైజూస్ సంస్థలతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ మొదలైంది. ఆయా సంస్థల్లో చైనా పెట్టుబడులు ఉండడమే ఇందుకు కారణం. ఆర్ఎస్ఎస్ కు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ఐఎం) ఈ మేరకు బీసీసీఐ కార్యాలయం ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చింది. క్విట్ చైనా పేరిట ఎస్ఐఎం ఆదివారం ప్రారంభించిన ఓ ఉద్యమంలో భాగంగా ఈ ఆందోళనలు చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ‘ఆత్మనిర్భర భారత్ ’ నినాదానికి బలం చేకూర్చడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగానే బీసీసీఐని టార్గెట్ చేస్తున్నామని ఎస్ఐఎంకు చెందిన ధనంజయ బిండే పేర్కొన్నారు. ప్రభుత్వం పిలుపును పక్కనబెట్టి చైనా సంస్థలతో లావాదేవీలు కొనసాగించడాన్ని తాము సహించబోమని ధనంజయ అన్నాడు.

చైనాతో సంబంధమున్న ఐపీఎల్ స్పాన్సర్లు..
ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐతో కలిసి పనిచేసేందుకు సాధారణంగానే కార్పొరేట్ సంస్థలు ఎగబడతాయి. అలాగే వివిధ కంపెనీలతో బోర్డు కోట్లాది రూపాయాల విలువైన ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇందులో ముఖ్యమైన డ్రీమ్ ఎలెవెన్, పేటీఎమ్, బైజుస్లో చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడిదే క్రికెట్ బోర్డుకు సమస్యగా మారింది. ఫ్యాంటసీ స్పోర్స్ గేమింగ్ ప్లాట్ ఫామ్‌ ‌అయిన డ్రీమ్ ఎలెవెన్లో చైనాకు చెందిన గేమింగ్ కంపెనీ టెన్సెంట్ కు 20 శాతం వరకు వాటా ఉంది. బీసీసీఐ టైటిల్ పార్టనర్‌‌, ఐపీఎల్ సెంట్రల్ పార్టనర్ అయిన పేటీఎమ్ లో సగానికిపైగా వాటాలు వేర్వేరు చైనా కంపెనీల వద్దే ఉన్నాయి. టీమిండియా జెర్సీ స్పాన్సరైన బైజూస్ లోనూ టెన్సెంట్కు 15 శాతం వాటా ఉంది.

ముందుకు రాని కంపెనీలు..
మరోపక్క ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ వేట కొనసాగిస్తోంది. పేటీఎమ్, బైజూస్ సహా లీగ్ అసోసియేట్ స్పాన్సర్లు అయిన టాటా మోటార్స్, డ్రీమ్ ఎలెవెన్ వంటి ఇతర సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. కానీ ఇప్పటిదాకా ఆశించిన బదులు బోర్డుకు రాలేదు. పైగా
యాంటీ చైనా మూమెంట్ బోర్డుకు తలనొప్పిగా మారింది. బైజూస్, పేటీఎమ్, డ్రీమ్ ఎలెవెన్ కూడా వివో మాదిరిగానే తప్పు కోవాల్సి వస్తే బీసీసీఐకి తలకు మించిన భారం తప్పదు. ‘ పేటీఎమ్, డ్రీమ్ ఎలెవెన్, బైజూస్ సంస్థలు బీసీసీఐ పార్టనర్ప్. ఇవన్నీ ఇండియన్ సంస్థలే. కానీ పెట్టుబడులు మాత్రం చైనా కంపెనీలు పెట్టాయి. యాంటీ చైనా మూమెంట్ నేపథ్యంలో కొంత ఆలోచనలో పడ్డాం. ఈ కంపెనీలు టైటిల్ స్పాన్సర్ షిప్ కు ముందుకొస్తే ఎదురయ్యే పరిస్థితులపై అంచనా వేస్తున్నాం’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. యాంటీ చైనా మూమెంట్ ను దాటి బీసీసీఐ ఈసారి ఐపీఎల్ ను ఎలా నిర్వహిస్తుందో చూడాలి.

For More News..

క్లాసులే కాదు.. ఎగ్జామ్స్ కూడా ఆన్‌లైన్ లో పెడ్తున్న ప్రైవేట్ స్కూల్స్

ఆన్‌‌లైన్ కంపెనీల్లో జాబ్స్ జోరు

రూ.లక్ష కోట్లతో మారనున్న రైతు లైఫ్

Latest Updates