సీఎం హామీ ఇచ్చినా.. అందని పట్టాలు

కోల్ బెల్ట్ వ్యాప్తంగా 35 వేల కుటుంబాల ఎదురుచూపులు

కంపెనీ నుంచి ప్రభుత్వానికి భూమి ట్రాన్స్​ఫర్​

సర్వేలు చేసి పత్తాలేకుండా పోయిన ఆఫీసర్లు
సింగరేణి స్థలాల్లో ఇండ్లకు అందని ఓనర్​షిప్ డాక్యుమెంట్స్

‘మీ ప్రధాన సమస్య ఏమిటో నాకు తెలుసు.. సింగరేణి స్థలాల్లోని ఇళ్లకు పట్టాలు లేక మీరంతా గోస పడుతున్నరు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వచ్చి నా చేతులతోనే అందరికీ పట్టాలు అందజేస్తా’.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 నవంబర్​లో మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ప్రజాఆశ్వీరాద సభలో  సీఎం కేసీఆర్. అంతకు ముందు శ్రీరాంపూర్​లో జరిగిన సింగరేణియుల చైతన్యసభలో కూడా సీఎం కేసీఆర్ ఇదే హామీ ఇచ్చారు.

మందమర్రి, వెలుగు: సింగరేణి స్థలాల్లోని ఇళ్లకు పట్టాలిప్పిస్తామని సీఎం ఇచ్చిన హామీ అమలుకు నోచడం లేదు. సింగరేణి యాజమాన్యం, ఆయా ల్యాండ్స్​ను రెవెన్యూ శాఖకు ట్రాన్స్​ఫర్​ చేసినా ఇవ్వడానికి సర్కారుకు తీర్తలేదు. అప్పట్లో మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆఫీసర్లు హడావిడి సర్వే చేసి కేవలం 50 మంది చొప్పున లబ్ధిదారులకు పట్టాలిచ్చి ఎలక్షన్​ ట్రిక్​ ప్లే చేశారు.  రేపో మాపో పట్టాలు ఖాయమని భావించిన ప్రజలు ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఆదరించారు . కానీ ఏడాదిన్నర గడుస్తున్నా  రాష్ట్ర సర్కారు మాత్రం పట్టాల అంశాన్ని కోల్డ్​ స్టోరేజీలోంచి బయటకు తీస్తలేదు. ఫలితంగా 35 వేల కుటుంబాలకు ఎదురుచూపులు తప్పట్లేదు.

40 ఏండ్లుగా ఉంటున్నరు

బొగ్గు గనుల్లో ఉద్యోగాలు, ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి 40 ఏండ్ల క్రితం వేలాది మంది సింగరేణి ప్రాంతాలకు వలస వచ్చారు. కంపెనీ స్థలాల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకొని దశాబ్దాలుగా ఉంటున్నారు. కానీ నివాసాలకు  యాజమాన్య హక్కు లేకపోవడంతో ఇళ్లకు  పట్టాలివ్వాలని కొన్నేండ్లుగా డిమాండ్​ చేస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వాలకు తమ నిరసన తెలుపుతూ వచ్చారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్ 2018 ఫిబ్రవరి 27న శ్రీరాంపూర్​లోని ప్రగతి స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో కంపెనీ స్థలాల్లోని నివాసాలకు పట్టాలిస్తామని ప్రకటించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందు  నవంబర్ 29న  బెల్లంపల్లిలో మరోసారి సీఎం ప్రస్తావించారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో కలిపి సింగరేణి కార్మికులు, కార్మికేతరులు నిర్మించుకున్న  సుమారు 35 వేల  పైగా నివాసాలు, ఖాళీ స్థలాలకు సంబంధించి 1,713 ఎకరాలను యాజమాన్యం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.  దీంతో ప్రభుత్వం 2019 జూన్​లో  సింగరేణి స్థలాలకు పట్టాలివ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏడాదిన్నర దాటుతున్నా..

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే నెల రోజుల్లోనే సింగరేణి ప్రాంతాల్లోని నివాసాలకు పట్టాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత పట్టాల కోసం సింగరేణి స్థలాల రెగ్యులరైజేషన్​కు జీవోలు విడుదల చేసింది. అనంతరం  రెవెన్యూ శాఖ  సర్వే నిర్వహించింది.  పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 1,511ఇళ్లు, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 8,010, భూపాలపల్లిలో 3 వేలు,  మంచిర్యా జిల్లాలో 25 వేల ఇళ్లు సింగరేణి స్థలాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో రెవెన్యూ, మున్సిపల్, సింగరేణి జాయింట్​గా చేపట్టిన సర్వే ఇప్పటికీ పూర్తికాలేదు.  ఒక దశలో మున్సిపల్ ఎన్నికలకు అంతా రెడీ అవుతున్న టైంలో లబ్ధి పొందాలని  కోడ్ అమలులోకి రాకముందే హడావిడిగా ఆయా ప్రాంతాల్లో 50 మందికి చొప్పున పట్టాలు పంపిణీ చేయడం ద్వారా షో చేశారు. ఆ తర్వాత నుంచి సర్వేలు, రీసర్వేలు జరుగుతున్నాయని, టీమ్​లు  వివరాలు సేకరిస్తున్నాయంటూ ఆఫీసర్లు తప్పించుకుంటున్నారు. పట్టాల పంపిణీని ప్రతిసారి  ప్రభుత్వం ఎన్నికల కోణంలో చూస్తోందని, మళ్లీ  సింగరేణి గుర్తింపు సంఘం  ఎన్నికలప్పుడే పట్టాల గురించి ఆలోచిస్తుందని లబ్ధిదారులు అంటున్నారు.

ఎన్నికల్లో లబ్ధి కోసమే…
సింగరేణి భూముల్లో నివసిస్తున్న వారి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రతిసారీ ప్రభుత్వం పట్టాల పంపిణీని వాడుకుంటోంది. అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందినా అందరికీ పట్టా లివ్వలేదు. మళ్లీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల వరకు వేచి
చూడాలెమో. చిత్తశుద్ధి ఉంటే వెంటనే పట్టాలివ్వాలి.
– ల్యాగల శ్రీనివాస్,
బీఎంఎస్ నాయకుడు

For More News..

నో జాబ్.. నో మనీ..

ఎలాంటి శానిటైజర్స్‌ వాడాలి? అసలు ఏం చూడాలి?

పోటీపడి మరీ రేట్లు తగ్గిస్తున్న ఎయిర్‌టెల్-జియో బ్రాడ్ బ్యాండ్స్

తెలంగాణలో మరో 2,479 కరోనా కేసులు.. 10 మంది మృతి

Latest Updates