రోజుకొక సెల్ఫీ.. ఇరవై ఏళ్లలో 7,263 సెల్ఫీలు

నోవా కలీనా న్యూయార్క్‌‌‌‌లో ఒక ఫేమస్‌‌ ఫొటోగ్రాఫర్‌‌‌‌. పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేశాడు. అతని ఫొటోలు ప్రపంచంలోని చాలా ఎగ్జిబిషన్స్‌‌లో పెట్టారు. ఇవన్నీ ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. కానీ.. ‘ఎవ్రీడే’ ప్రాజెక్ట్ కలీనాను ఏకంగా సెలబ్రిటీనే చేసింది. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌‌ ఏంటంటే..

కలీనా ప్రతిరోజు తనను తాను ఒక ఫొటో తీసుకుంటాడు. అందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? అవును పది రోజులో, ఇరవై రోజులో తీసుకుంటే ప్రత్యేకత ఏం ఉండదు. కానీ.. ఇతను ఏకంగా ఇరవై ఏళ్ల పాటు ప్రతి రోజు ఫొటో తీసుకున్నాడు. అది కూడా ఒకే ఎక్స్‌‌ప్రెషన్‌‌లో. ఈ మధ్యే మొదలైన సెల్ఫీ ట్రెండ్‌‌ ఆయన ఎప్పుడో ఫాలో అయ్యాడు. సెల్ఫీ కెమెరాలు లేని టైంలో కూడా సెల్ఫీ తీసుకున్నాడు.

ఆయనకు ప్రతిరోజు ఫొటో తీసుకోవాలనే ఆలోచన 2000 సంవత్సరంలో వచ్చింది. అప్పుడు అతని వయసు 19 సంవత్సరాలు. 2000 జనవరి 11న రివర్సబుల్‌‌ వ్యూ ఫైండర్‌‌‌‌ కెమెరాతో ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆరేళ్లకు 2006లో ఆరేళ్లపాటు తీసుకున్న ఫొటోలతో ఒక వీడియో రిలీజ్‌‌ చేశాడు. అది అప్పట్లో చాలా వైరల్‌‌ అయ్యింది. దాంతో ఆయనకు చాలా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ థీమ్‌‌పై సింప్సన్‌‌ అనే టీవీ షో ‘స్పూఫ్‌‌’ కూడా చేసింది. ఆ తర్వాత 2012లో అలాంటి వీడియోనే మరొకటి రిలీజ్‌‌ చేశాడు కలీనా. ఈ వీడియోలో 12ఏళ్లలో దిగిన ఫొటోలు పెట్టాడు. దాంతో రెండోసారి కూడా ఆ వీడియో వైరల్‌‌ అయ్యింది. కలీనా ఆ అలవాటును అలాగే కొనసాగించాడు. ఇప్పుడు ఇరవై ఏళ్లలో దిగిన 7,263 ఫొటోలతో వీడియో రూపొందించాడు. అదిప్పుడు సోషల్‌‌మీడియాలో వైరల్‌‌ అవుతోంది. ఆ వీడియోలో ఫొటోగ్రాఫర్‌‌‌‌ ముఖంతో పాటు అతని లైఫ్‌‌ను కూడా చూడొచ్చు. పెరుగుతున్న ఆయన జుట్టు, మళ్లీ కటింగ్‌‌ చేయించడం. ఈ ఫొటోల్లో చాలాసార్లు రిపీట్‌‌ అయ్యింది. ఒక చిన్న చీకటి గదిలో మొదలుపెట్టిన ఆయన ప్రయాణం.. పెద్ద స్టూడియో పెట్టేవరకు ఆ ఫొటోల్లో గమనించవచ్చు.

కలీనా 20 సంవత్సరాల మైలురాయిని చేరుకోవటానికి ఎంతో అంకితభావంతో పని చేశాడు. ఈ ఇరవై ఏళ్లలో ఆయన కేవలం 37రోజులు మాత్రమే ఫొటో తీసుకోలేదు. ఎన్ని పనులున్నా ఏది ఏమైనా.. ఫొటో తీసుకోవడం మామూలు విషయం కాదు. ఆ అలవాటు పట్ల ఎంతో శ్రద్ధ ఉంటే తప్ప చేయలేరు. ఆయన జర్నీ ఇంతటితో ముగిసిపోలేదు. ‘నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు ప్రతిరోజు ఫొటో తీసుకుంటా’ అంటున్నాడు కలీనా.

Latest Updates