కలెక్టర్​ వెహికల్​ ఢీకొట్టి..  కాలుపోతే పట్టిచ్చుకున్నోళ్లే లేరు

మహబూబ్​నగర్, వెలుగు: జిల్లా కలెక్టర్​ కారు ఢీకొని ఓ పేద కుటుంబం రోడ్డున పడింది. ఆగస్టు 19న  మహబూబ్ నగర్ జిల్లా సమీపంలోని అమిస్తాపూర్ వద్ద కలెక్టర్​ వెంకట్​రావు కారు ఢీకొని పుల్లయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని హాస్పిటల్​తరలించాలని గన్​మెన్లను ఆదేశించిన కలెక్టర్​, వేరే వాహనంలో వెళ్లిపోయారు. పుల్లయ్యను గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించగా తీవ్రంగా దెబ్బతిన్న ఎడమకాలును డాక్టర్లు తొలగించారు. నడుం భాగం దెబ్బతినడంతో పుల్లయ్య మంచానికే పరిమితమయ్యారు.

కూలికెళ్తేనే పూటగడిచేది..

డ్చర్ల మండలానికి చెందిన పుల్లయ్య ఉన్న ఊళ్లో ఉపాధి లేక అమిస్తాపూర్ కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. ఇక్కడే ఒక చిన్న గది అద్దెకు తీసుకుని ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి ఉంటున్నాడు. ఆయన రోజూ మేస్త్రీ కింద కూలిపనికి పోతేనే ఆ కుటుంబానికి పూట గడుస్తుంది. తాజాగా పుల్లయ్య మంచానికే పరిమితం కావడంతో వారంతా పస్తులుండాల్సి వస్తోంది. ఈ యాక్సిడెంట్​కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో పుల్లయ్యకు ఇన్సూరెన్స్​కూడా రాలేదు. తన ముగ్గురు పిల్లల భవిష్యత్ దృష్ట్యా తన భార్యకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని పుల్లయ్య కలెక్టర్​ను కోరుతున్నాడు.

Latest Updates