ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు

న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎన్‌‌టీ, ఆప్తమాలజీ, ఆర్థో, డెంటల్ లాంటి సాధారణ ఆపరేషన్లకు సంబంధించి ఆయుర్వేద డాక్టర్లు ట్రెయినింగ్ తీసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దీనికి చట్టబద్ధత కల్పించే నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. ఆయుర్వేద పీజీ కోర్సు చేస్తున్న డాక్టర్లు మాత్రమే ఈ ప్రాక్టీస్‌‌కు అర్హులుగా కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఇక నుంచి ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్రచికిత్సలు చేయొచ్చు. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ 2016 నిబంధనలను సవరించింది. షాలియా ( సాధారణ శస్త్రచికిత్స ) షాలక్య (ఈఎన్‌టీ, హెడ్‌, డెంటల్‌ స్పెషలైజేషన్‌ ) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది.

ప్రత్యేక శిక్షణ అనంతరం ఈఎన్‌టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది. అయితే ఈ ఆపరేషన్లు ఆయుర్వేద ఇన్‌‌స్టిట్యూట్‌‌లతోపాటు ఆస్పత్రుల్లో మాత్రమే చేసుకోవచ్చునని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ప్రెసిడెంట్ జయంత్ డియోపుజారి పేర్కొన్నారు. ‘సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ విభాగాలు ఆయుర్వేదంలో గత 25 ఏళ్లుగా భాగంగా ఉన్నాయి. సర్జికల్ ఓపీడీలు కూడా దీంట్లో భాగమే. దశాబ్దాలుగా జరుగుతున్న దాంట్లో చట్టబద్ధత ఉందా అనే దానిపై ఎవరూ దృష్టి పెట్టలేదు. ఆయుష్ మంత్రిత్వ శాఖతోపాటు నీతి అయోగ్‌‌తో చర్చించిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించాం’ అని జయంత్ చెప్పారు.

Latest Updates