రేవంత్ రెడ్డిపై కేసు.. అడ్డుకోలేకపోయిన ఏసీపీపై వేటు

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ  ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముట్టడి సందర్భంగా ప్రగతి భవన్ చుట్టుపక్కల 3,4 కిలోమీటర్ల మేర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాలు తనిఖీల్లో పలువురు కాంగ్రెస్ నేతల్ని, కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో పోలీసుల కళ్లుగప్పిన రేవంత్ రెడ్డి బైక్ పై వచ్చి క్యాంప్ ఆఫీస్ లోకి దూసుకెళ్లారు.

గతంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు వెళ్లిన వారిపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. ధర్నాలు జరిగే సమయంలో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం జరిగిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ముట్టడిని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ముట్టడికి యత్నించే సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహిరంచారని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. క్యాంప్ ఆఫీస్ కు సెక్యూరిటీ ఇంచార్జ్ గా ఉన్న.. ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహరెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు.

క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తూ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే కారణంతో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ముట్టడికి వెళుతున్న సమయంలో తనని నెట్టివేయటంతో గాయపడ్డానని ఎస్సై నవీన్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై ఐపీసీ 341, 353, 332 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్  కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates