పరిషత్ లో ‘లోకల్’ పంచాయితీ

పరిషత్ ఎన్నికల్లో కొత్త పంచాయితీ తెరమీదికి వచ్చింది. లోకల్, నాన్ లోకల్ అంశం నేతల మధ్య అగ్గిరాజేస్తోంది. ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీచేయాలని భావించే నేతలు.. వివిధ కారణాల వల్ల తమ ఏరియాలో పోటీకి అవకాశం లేకపోవడంతో పక్క మండలాలపై దృష్టి పెట్టారు. ఆ మండలాల నుంచి ఎలాగైనా పార్టీ టికెట్ దక్కించుకొని పోటీలో నిలవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. టికెట్ల కోసం పెద్ద పెద్ద నేతలతో పైరవీలు చేయించుకుంటున్నారు. దీనిపై లోకల్ నేతలు భగ్గుమంటున్నారు. తమ అవకాశాలకు గండికొడితే సహించేది లేదని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.

ఓటుంటే పోటీ చేసే చాన్స్ 
రాష్ట్రంలో ప్రస్తుతం 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మండలంలో ఓటు కలిగి ఉంటే ఆ మండలంలోని ఏ ఎంపీటీసీ స్థానం నుంచైనా పోటీ చేయవచ్చు. జడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటే ఆ జిల్లాలో ఎక్కడైనా ఓటుకలిగి ఉండాలి. అయితే కొన్నిచోట్ల రిజర్వ్‌‌డ్‌ స్థానాలు కావడం, పార్టీ నుంచి ఎక్కువ మంది బరిలో  ఉండటంతో పలువురు నేతలు పక్క గ్రామాలు, పక్కమండలాలపై దృష్టి పెట్టారు. ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ కావాలనుకునే ఆశావహులు, జడ్పీటీసీగా గెలిచి జడ్పీ పీఠం దక్కించు కోవాలనుకునే లీడర్లు ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మీరొస్తే మేమేం చేయాలి?
స్థానికంగా అయ్యే ఎన్నికల ఖర్చు మొత్తం తామే భరిస్తామని, ఇతర అభ్యర్థులకు డబ్బులు కూడా సమకూరుస్తామని, వారిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామని నాన్‌‌ లోకల్‌‌ అభ్యర్థులు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. లోకల్ నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘ఎప్పటి నుంచో గ్రౌండ్‌ ప్రిపేర్‌‌ చేసుకున్నాం. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం. టికెట్‌‌ వస్తదని ఎంతో ఆశించాం . ఇప్పుడు ఎక్కడి నుంచో మీరొచ్చి ఇక్కడ పోటీ చేస్తే మా పరిస్థితి ఏంది..?’’ అని నిలదీస్తున్నారు. ఐదేళ్ల దాకా మళ్లీ ఎన్నికలు లేవని, ఇప్పుడు టికెట్‌‌ రాకపోతే అప్పటిదాకా ఎదురుచూడలేమని తేల్చి చెప్తున్నారు. నాన్‌‌ లో కల్‌‌ వాళ్లు తమప్రాంతాల్లో నిలబడితే వారికి, పార్టీకి సహకరించబోమని చాలా మంది లోకల్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా తామే పార్టీకి, అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసి ఓడగొడుతామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.

టీఆర్ఎస్లో ఎక్కువ!
లోకల్‌‌, నాన్‌‌లోకల్‌‌ పంచాయితీ ఎక్కువగా అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌‌ఎస్‌ లో చేరారు. అప్పటికే పార్టీలో ఉన్న నేతలతో పాటు, కొత్తగా చేరిన నేతలు ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవులు చేపట్టాలనుకునేవారు ఎలాగైనా బరిలోకి దిగాలని చూస్తున్నారు. వివిధ కారణాలవల్ల తమ ప్రాంతంలో టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పక్క ప్రాంతాల్లో పోటీకి ఆసక్తి చూప్తున్నారు. ఇతర పార్టీల్లోనూ ఇదేపరిస్థితి కనిపిస్తోంది.

Latest Updates