ముక్కతో ముప్పు: పర్యావరణంపై మాంసం ప్రభావం

ఆదివారం వస్తే చాలు, శాకాహారులు తప్ప నీసు వాసన సోకని ఇల్లుండదు. పండుగొచ్చినా, పబ్బమొచ్చినా, ఫంక్షన్లైనా ముక్క లేనిది ముద్ద దిగదు. విదేశాల్లో అయితే, రోజూ మాంసమే. కానీ, ఆ మాంసమే పర్యావరణానికి తీరని నష్టాన్ని చేసేస్తోంది. వాతావరణాన్ని మార్చేస్తోంది. వేడిని పెంచేస్తోంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. స్వయానా ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్​గవర్నమెంటల్​ పానెల్​ ఆన్​ క్లైమేట్​ చేంజ్​ (ఐపీసీసీ) ఇస్తున్న వార్నింగ్​. దీనిపై ఐపీసీసీలోని 107 మంది సైంటిస్టులు కలిసి ఓ రిపోర్టును తయారు చేశారు. గురువారం దానిని ఆమోదించి విడుదల చేశారు. మరి, దానికి పరిష్కారం లేదా అంటే.. ఎందుకు లేదు, ఉంది అంటున్నారు. అదే ‘శాకాహారం’! ఆ రిపోర్టులో ఇంకా ఏముందో ఓసారి లుక్కేద్దామా?

ఒక్క మాంసమే కాదు, పర్యావరణ మార్పులకు ఇంకా ఎన్నో కారణాలున్నాయి. అవి, అడవులను కొట్టేయడం, విచ్చలవిడిగా నేలను ధ్వంసం చేయడం, నగరీకరణ పేరిట నిర్మాణాలు చేపట్టడం. ఇప్పటికే భూమిపై ఉన్న (మంచు ఖండాలు మినహా) 25 శాతం భూమిని అభివృద్ధి పేరిట నాశనం చేసేశామని ఐపీసీసీ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. ‘‘ఇప్పటికే 70 శాతం భూభాగం మనిషి పనుల వల్ల ప్రభావితమైంది. అందులో పావు వంతు భూమి పూర్తిగా నాశనమైంది. ఫుడ్డు, ఇతర అవసరాల కోసం చేస్తున్న పనుల వల్ల సహజ వనరులు, పర్యావరణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. జీవ వైవిధ్యం దారుణంగా తగ్గింది” అని ఐపీసీసీ కో చైర్​పర్సన్​ వలెరీ మాషన్​ డెల్మాట్​ ఆందోళన వ్యక్తం చేశారు.

అడవులను కొట్టేయడం, వ్యవసాయం కూడా భూమి వేడెక్కడానికి (గ్లోబల్​ వార్మింగ్​) కారణమవుతోంద్నారు. సరైన పచ్చదనం లేకపోవడం వల్ల కార్బన్​ డై ఆక్సైడ్​ను శోషించుకునే శక్తి కూడా నేలకు లేకుండా పోతోందన్నారు. దాదాపు 50 కోట్ల మంది అలాంటి ప్రాంతాల్లోనే బతుకుతున్నారని చెప్పారు. కాబట్టి ఆహార ఉత్పత్తి, భూమి నిర్వహణ పద్ధతులను మార్చడంతో పాటు తక్కువ మాంసం తినాలని సూచించారు.  ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకూ ఇంకా అవకాశాలున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. పొలాల్లో చెట్లు నాటి చిన్నపాటి అడవులను పెంచితే నేలను సారవంతంగా చేయొచ్చంటున్నారు. దీన్నే ఆగ్రోఫారెస్ట్రీ అంటున్నారు.

దక్షిణ అమెరికా అంత భూమి పోయింది

ఎక్కువగా రసాయన ఎరువుల వాడకం, సాగుబడి మరింత పెరగడం, అడవుల నరికివేత వంటి కారణాలతో సహజ వనరులు చాలా వరకు నాశనమయ్యాయి. మనిషి పనుల వల్ల దాదాపు 200 కోట్ల హెక్టార్ల (దగ్గరదగ్గర 495 కోట్ల ఎకరాలు) భూమి ధ్వంసమైపోయింది. ఆ మొత్తం దక్షిణ అమెరికా భూభాగంతో సమానం. దీంతో ఆ భూమిలో సారమంతా పోయింది. వాతావరణం నుంచి కొద్ది మొత్తంలో మాత్రమే భూమి కార్బన్​ను శోషించుకుంటోంది.

ఆహార భద్రతకు ముప్పు

పర్యావరణ మార్పుల వల్ల ఆహార భద్రతకు ముప్పు ఎక్కువగా ఉందని ఐపీసీసీ హెచ్చరించింది. వాతావరణంలో మార్పుల వల్ల తరచూ కరువులు, వరదలు వస్తున్నాయని, దీంతో పంటలు, పంటకు అవసరమయ్యే మౌలిక వసతులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అది మరింత తీవ్రమైతే భవిష్యత్తులో మనిషికి తిండి దొరకకుండా పోయే ముప్పు ఉందని చెప్పింది. కొన్ని చోట్ల వేడి వల్ల కొన్ని రకాల పంటలు పండకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. రిపోర్టు ప్రకారం ఆహారం కోసమే  ప్రపంచంలోని  34% భూమిని వాడుకుంటున్నారు. 75% అడవులు పోతున్నాయి.

బయో ఎనర్జీ పరిష్కారం కాదు

వాతావరణంలోని కార్బన్​ డై ఆక్సైడ్​ను తొలగించేందుకు బయోఎనర్జీ విత్​ కార్బన్​ క్యాప్చర్​ అండ్​ స్టోరేజ్​ (బెక్స్​) పద్ధతులను వాడాలని గత ఏడాది నివేదికలో ఐపీసీసీ చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు మాత్రం అది పరిష్కారం కాదని చెప్పింది. బెక్స్​ను పెద్ద స్థాయిలో చేపట్టాలంటే అంతే ఎక్కువగా భూమిని కూడా వాడుకోవాల్సి వస్తుందని, అది మరింత ప్రమాదమని హెచ్చరించింది. ఎరువులు, నీటి ద్వారా బయో ఎనర్జీ ఉత్పత్తిని పెంచితే నేలలోని సారమంతా తుడిచిపెట్టుకుపోతుందని, నీటి ఎద్దడి ఎక్కువై ఆహార భద్రతపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. బయో ఎనర్జీ ఉత్పత్తి కోసం పంట భూముల్లో 45% (దాదాపు 72 లక్షల చదరపు కిలోమీటర్లు) మేర భూమి కావాలని చెప్పింది.

తిండిని పారేయొద్దు

పర్యావరణాన్ని బాగు చేసుకోవాలంటే తిండిని వేస్ట్​ చేయొద్దని, మాంసం తక్కువ తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భూమి వేడెక్కడంలో ఫుడ్డు వేస్ట్​ వాటా 8–10%గా తేలింది. అంతేకాదు, మాంసం ఉత్పత్తి వాటా 14.5 శాతం. ఓ పక్క ప్రపంచంలో 82.1 కోట్ల మందికి సరైన తిండే దొరకట్లేదని, అయినా, ఉత్పత్తయ్యే ఆహారంలో 25–30 శాతం వేస్ట్​ అవుతోందని ఐపీసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. మిగిలిన భోజనాన్ని పడేసే బదులు, పశువుల కుడితిలో దాణాగా వేస్తే బాగుంటుందని సూచించింది. లేదంటే భోజనం అవసరమైన వాళ్ల కోసం పనిచేసే చారిటీలకైనా ఇస్తే, ఆకలితో అలమటించే వారి కడుపైనా నిండుతుందని సూచించింది. స్విట్జర్లాండ్​కు చెందిన పార్టేజ్​ అనే సంస్థ షాపుల్లో అమ్ముడుపోని తిండిని సేకరించి స్థానికంగా ఉండే పేదలకు పంచేస్తుంది. అంతేకాదు, పాడైపోయిన బ్రెడ్డులు తీసుకుని బిస్కెట్లను తయారు చేస్తోంది.  కాలుష్య కారకాల విడుదలలో అమెరికా, చైనా తర్వాతి వాటా ఆహార వృథాదేనని వేస్ట్​ అండ్​ రీసోర్సెస్​ యాక్షన్​ ప్రోగ్రామ్​ (రాప్​) తెలిపింది. 100 కోట్ల టన్నుల ఫుడ్డును ఎవరూ తినట్లేదని చెప్పింది. వాతావరణంలోని కార్బన్​ డై ఆక్సైడ్​ను అడవులు, వెట్​ల్యాండ్స్​ (చిత్తడి నేలలు) శోషించుకుంటాయి. కానీ, అవే ఇప్పుడు తగ్గుతున్నాయి కాబట్టి వాతావరణంలో కార్బన్​ అలాగే ఉండిపోతోంది. 2007–2016 మధ్య కేవలం 29 శాతం కార్బన్​ను మాత్రమే అవి శోషించుకోగలిగాయి. తడి భూముల్లో ఓ రకమైన పీట్​ల్యాండ్స్​ (గడ్డి భూములు) కార్బన్​ను ఏళ్ల పాటు పట్టి ఉంచుతాయి. వాటిని పెంచేందుకు చర్యలు చేపట్టాలి.

Latest Updates