నాన్​వెజ్​ పెద్ద దెబ్బే తీసింది

  • ద్రవ్యోల్బణాన్ని అమాంతం పెంచేసింది

రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో ఎనిమిది నెలల గరిష్టానికి పెరిగి 3.18 శాతానికి చేరుకుంది. నాన్​వెజి​టేరియన్​ ఫుడ్​ ధరలు పెరగడంతో ఈ ద్రవ్యోల్బణం పెరిగినట్టు ప్రభుత్వ అధికారిక డేటా వెల్లడించింది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ) ఆధారితంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని విడుదల చేస్తారు. 2019 మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.05 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది. 2018 జూన్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 4.92 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరి నుంచి పెరుగుతూనే ఉంది. కేంద్ర గణాంకాల ఆఫీస్(సీఎస్‌ఓ) విడుదల చేసిన సీపీఐ డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 2.17 శాతం పెరిగింది. అంతకుముందు నెలలో ఈ ద్రవ్యోల్బణం 1.83 శాతంగా ఉండేది.కూరగాయలు, పండ్ల ధరల పెరుగుదల తక్కువగానే ఉన్నప్పటికీ.. గుడ్లు, మాంసం, చేపల ధరలు బాగా పెరిగినట్టు తెలిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మానిటరీ పాలసీలో రేట్లను నిర్ణయించడానికి రిటైల్ ద్రవ్యోల్బణాన్నే ప్రధాన కారకంగా పరిగణనలోకి తీసుకుంటుంది. అటు  మే నెలలో దేశీయ ఇండస్ట్రియల్ అవుట్‌పుట్ గ్రోత్‌ 3.1 శాతానికి తగ్గింది. మైనింగ్, మానుఫాక్చరింగ్ రంగాల్లో పర్‌‌ఫార్మెన్స్ స్తబ్దుగా ఉండటంతో, గ్రోత్ కాస్త తగ్గినట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది. 2018 మే నెలలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ 3.8 శాతంగా ఉండేది. ఈ ఏడాది మే నెలలో మైనింగ్ సెక్టార్ విస్తరణ 3.2 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది. కానీ గతేడాది ఇదే నెలలో ఈ సెక్టార్ 5.8 శాతం వృద్ధిని రికార్డు చేసింది. అదేవిధంగా మానుఫాక్చరింగ్ రంగ వృద్ధి మే నెలలో స్తబ్దుగా 2.5 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.6 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా తెలిపింది. పవర్ జనరేషన్ మాత్రం గతేడాది కంటే ఈ ఏడాది మే నెలకు బాగా పెరిగింది. పవర్ జనరేషన్ ఈ మే నెలలో 7.4 శాతానికి పెరిగినట్టు డేటా పేర్కొంది. ఇండస్ట్రీస్ పరంగా చూసుకుంటే మానుఫాక్చరింగ్ రంగంలోని 23 ఇండస్ట్రీ గ్రూప్‌లలో 12 పాజిటివ్ వృద్ధి బాట పట్టాయి.

Latest Updates