తమిళనాడు, కేరళలో ఆరెంజ్ అలర్ట్

ఈశాన్య రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాఖ ప్రకటన

ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో భారీ వర్షాలు.. తెలంగాణలో అక్కడక్కడా చిరు జల్లులు

తీవ్రమైన కరువులో ఉన్న చెన్నైకి చల్లని కబురు

చెన్నై: నైరుతి రుతుపవనాలు కాలం ముగిసింది. అన్ని ప్రాంతాల నుంచి ‘నైరుతి’ వెళ్లిపోయింది. తిరోగమన రుతుపవనాలు వచ్చేశాయి. దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు వచ్చాయి. తమిళనాడు తీరాన్ని బుధవారం రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా కరువులో ఉన్న చెన్నైకి ఇది చల్లని కబురు. ఈ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగడంతో పాటు ఇతర జలవనరులు అందుబాటులోకి వస్తాయి. మహా నగరంలో జనాలకు తాగునీటి కష్టాలు తీరుతాయి.

రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

బుధవారం ఉదయం ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులో ప్రవేశించాయి. వీటి రాకకు ముందే వాతావరణం చల్లబడింది. నిన్నటి నుంచే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, లక్షద్వీప్ లలో వర్షాలు కురుస్తున్నారు. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తాయని వెల్లడించింది. తమిళనాడు, కేరళల్లో అతి భారీ వానలకు కురుస్తాయని చెప్పింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలెర్ట్ ను ప్రకటించింది వాతావరణ శాఖ.

ఆరెంజ్ అలెర్ట్ అంటే?

ఈశాన్య రుతుపవనాల రాకతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణ శాఖ.. తమిళనాడు, కేరళ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. దీని అర్థం ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని హెచ్చరించడమే. భారీ నుంచి అతి భారీ వర్షాల రాకతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇక రెడ్ అలెర్ట్ ప్రకటించిందంటే ఇళ్లు నుంచి సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్యూ క్యాంపులకు ప్రజలు వెళ్లాలని అర్థం.

ఇప్పటికే కర్ణాటక (+18%), కేరళ(+5), తమిళనాడు(+1%)ల్లో నైరుతు రుతుపవనాల సమయంలోనే అవసరానికి మించి వర్షం కురిసింది. దీంతో ఇప్పడు కురిసే వర్షాన్ని ఎలా వినియోగించుకోవాలి? నీటి వనరులను ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలపై ప్రభుత్వాలు ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.

2015లో రాత్రికి రాత్రే మునిగిన చెన్నై

సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2015 డిసెంబర్ నెలను తమిళనాడు ఎన్నటికీ మరచిపోలేదు. ఆ నెల చివరిలో ఒక్క రాత్రిలోనే భారీ వర్షం కురిసి.. చెన్నై నీట మునిగింది. వందేళ్లలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదకు మహా నగరం అల్లకల్లోలమైంది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి నెలకు పైగా పట్టింది.

నాటి పరిస్థితి నేర్పిన పాఠంతో.. భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించగానే చెన్నై కార్పొరేషన్ అధికారులు రివ్యూ నిర్వహించారు. శుక్రవారంలోపు వరద కాలువల పూడికతీత పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు.

ఇప్పటికే నిన్న అర్ధరాత్రి నుంచే చెన్నై, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పూనమలైలో 11 సెంటీమీటర్లు, పంబన్ లో 10 సెంటీమీటర్ల వాన పడిందని అధికారులు తెలిపారు.

Latest Updates