16 నెలల నుంచి సెక్రటేరియట్​లోకి నో ఎంట్రీ

16 నెలల నుంచి సెక్రటేరియట్​లోకి నో ఎంట్రీ
  • సమస్యలు ఏడ చెప్పుకోవాలో తెలియక జనం అవస్థలు
  • జిల్లాల నుంచి రోజూ వందల మంది రాక.. గేట్ దగ్గరే ఆపేస్తున్న పోలీసులు
  • ఇంకా కరోనా ఆంక్షల పేరుతో బీఆర్కే భవన్‌ లోనికి అనుమతించని సర్కార్

సామాన్య జనాన్ని సెక్రటేరియట్లకు అడుగే పెట్టనిస్తలేరు. సమస్యలు చెప్పుకుందామని వచ్చెటోళ్లను ఆ దరిదాపులకు కూడా పోనిస్తలేరు. 16 నెలలుగా బీఆర్కే భవన్​లోకి ప్రజలకు ఎంట్రీ ఉండటం లేదు. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో పెట్టిన ఆంక్షలను.. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడినా సడలించడం లేదు. పలు జిల్లాల నుంచి రోజూ నాలుగైదు వందల మంది జనం తమ సమస్యలను, స్కీమ్స్​కు సంబంధించిన ఇబ్బందులు చెప్పుకునేందుకు వస్తున్నారు. కానీ బీఆర్కే భవన్ దగ్గర సెక్యూరిటీగా ఉన్న పోలీసులు వారిని లోపలికి పంపించడం లేదు. దీంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాళ్లు నిరాశగా వెనుదిరుగుతున్నరు. రాష్ట్ర పరిపాలనకు కీలకమైన సెక్రటేరియట్‌‌లోనే పరిస్థితి ఇట్లుంటే.. ఇక జిల్లాల్లో ఆఫీసర్లు తమను ఇంకేం పట్టించుకుంటారని బాధితులు వాపోతున్నరు. కనీసం అప్లికేషన్ కూడా తీసుకుంటలేరని ఆవేదన చెందుతున్నారు. గేట్ దగ్గరే ఆపేస్తున్నారని, పై నుంచి ఫోన్ చేయించుకోవాలని చెబుతున్నారని, కానీ తమకు ఆ స్థాయిలో తెలిసిన వాళ్లు ఉంటే సమస్యలు చెప్పుకునేందుకు ఇక్కడిదాకా ఎందుకొస్తామని అంటున్నారు. సంఘాల వాళ్లు, పార్టీల వాళ్లు.. సీఎస్​, ఇతర శాఖల హెచ్ఓడీలకు ఏదైనా రిప్రజెంటేషన్ ఇద్దామన్నా లోపలికి రానివ్వడం లేదు.

రెండేళ్ల కింద సెక్రటేరియట్‌‌ను కూల్చివేశారు. బీఆర్కే భవన్‌‌లోకి తాత్కాలికంగా సెక్రటేరియట్‌‌ను షిప్ట్ చేశారు. డిపార్ట్​మెంట్ల హెచ్ఓడీలు, ఇతర ఆఫీసర్లకు గదులు కేటాయించారు. సీఎం ఆఫీస్​ను బేగంపేటలో ఏర్పాటు చేశారు. మంత్రులు కూడా ఒక్కొక్కరూ ఒక్కోచోట చాంబర్లు ఏర్పాటు చేసుకున్నారు. పాత సెక్రటేరియట్‌‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజిటర్స్‌‌కు అనుమతి ఉండేది. ఆ టైంలో వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలు అందుబాటులో ఉండేవారు. బీఆర్కే భవన్​కు షిప్ట్ అయిన తర్వాత కొన్నాళ్లు విజిటర్స్​కు ఎంట్రీ ఇచ్చారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ టైంలో విజిటర్స్​ను ఆపేశారు. ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్లాలంటే కచ్చితంగా బీఆర్కే భవన్‌‌లోని ఎవరైనా ఆఫీసర్.. సెక్యురిటీ వింగ్​కు కాల్ చేసి పంపించమని చెప్పాల్సిందే. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న వారు గేట్ దగ్గరే గంటల కొద్దీ వెయిట్ చేసి చివరకు చేసేదేమీ లేక వెనుదిరుగుతున్నరు.


సర్కార్ ఆర్డర్స్.. మేమేం చేయలేం


సమస్య చెప్పుకునేందుకు లోపలికి ఎందుకు అనుమతించడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘సర్కార్ ఆర్డర్ అంతే’ అనే సమాధానం పోలీసుల నుంచి వస్తోంది. పెద్దాఫీసర్ల నుంచి ఆదేశాలు ఉన్నాయని, లేకుంటే ఎందుకు ఆపేస్తమని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వేరే చోట ఉన్న ఆఫీసుల నుంచి కిందిస్థాయి ఆఫీసర్లు హెచ్ఓడీలకు ఫైల్స్ ఇచ్చేందుకు వచ్చినా కొన్నిసార్లు లోపలికి రానివ్వట్లేదు. రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్‌‌కి సంబంధించిన పనులు పూర్తి చేసుకోవడానికి భవన్‌లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వైరస్ వ్యాప్తి తగ్గినా కరోనా రూల్స్‌‌ నోటీసులు అంటించి ఆంక్షలు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.


వినతి పత్రం ఇస్తమంటే పంపలే
వరంగల్‌‌లోని అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్‌‌‌‌లో ప్రభుత్వం చేపట్టిన ఓ బిల్డింగ్ నిర్మాణం కోసం 16 పేద కుటుంబాల గుడిసెలు తొలగించారు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి డబుల్ ఇండ్లు కేటాయించాలని సీఎస్, హౌసింగ్ సెక్రటరీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చాం.  ఇక్కడేమో లోపలికి పంపించట్లేదు. సీఎస్ నుంచి ఫోన్ చేయించుకుని లోపలికి వెళ్లమంటున్నరు.
                                                                                                   -  రిపబ్లిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా (ఎ) రాష్ట్ర ప్రతినిధులు

ఇంకెక్కడికి పోవాలె
నాకు ఓ షాప్ ఉంది. రైతు వేదికలకు కుర్చీలు పంపిణీ చేసిన. 11 లక్షల రూపాయల బిల్లు ఆగిపోయింది. ఎప్పుడిస్తరో అడుగుదామని వచ్చిన. లోపలికి పోనిస్తలేరు. చాలా ఇబ్బందుల్లో ఉన్న. ఇక్కడ కాకుంటే ఇక ఎక్కడ చెప్పుకోవాలె? నా సమస్య ఎవరు తీరుస్తరు? ఐదు నిమిషాల్లో పోయి వస్త అంటే ‘కుదరదు’ అంటున్నరు. 
- మహ్మద్ అహ్మద్, హైదరాబాద్