ఇండియాలో క్రికెట్‌ను ప్రారంభించే పరిస్థితి లేదు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి భయంతో విధించిన లాక్‌డౌన్ ఎత్తేశాక దేశంలో పాజిటివ్ కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో క్రికెట్‌ను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. క్రికెట్‌ను మళ్లీ మొదలుపెట్టే పరిస్థితుల్లో మనం ఉన్నామని తాను అనుకోవడం లేదని లెజెండరీ క్రికెటర్ తెలిపాడు. పరిస్థితులు మెరుగయ్యే వరకు వేచి ఉండటం ఉత్తమమని ద్రవిడ్ పేర్కొన్నాడు.

‘మేం నెలల వారీగా ముందుకెళ్లాలి. అన్ని ఆప్షన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఆగస్టు–సెప్టెంబర్‌‌లో మొదలయ్యే డొమెస్టిక్ సీజన్ అక్టోబర్‌‌లో ప్రారంభమైతే ఆ సీజన్‌ను తగ్గిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఎన్‌సీఏ తెరుచుకున్నా ప్రారంభంలో దాన్ని లోకల్ క్రికెటర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంచుతాం. ఇతర ప్లేసెస్ నుంచి ఎవరైనా వస్తే.. వారు తప్పకుండా 14 రోజుల వరకు క్వారంటైన్‌లో ఉండాలి. అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. ప్రస్తుతం అంతా అనిశ్చితిగా ఉంది. ఎంత క్రికెట్ ఆడతాం, ఎలా ఆడతామనేది ప్రభుత్వ గైడ్‌లైన్స్‌తోపాటు మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి జూన్ వరకు ఎన్‌సీఏకు బిజీ టైమ్‌గా చెప్పొచ్చు. సాధారణ టైమ్‌లో ఇక్కడ అండర్–16, 19, 23 చాంప్స్‌ జరిగేవి. కానీ ప్లాన్స్‌ను మళ్లీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సాధ్యమైనంత క్రికెట్‌ సీజన్‌ను మనం కోల్పోబోమని నేను ఆశిస్తున్నా. ఈ ఏడాది కొంచెమైనా క్రికెట్ జరుగుతుందని భావిస్తున్నా’ అని ద్రవిడ్ చెప్పాడు.