
గో వీగన్, వెజిటేరియన్ ఫుడ్ అన్ని జబ్బులకు ఆన్సర్… అంటూ కూరగాయలు, పండ్లు ఫుడ్‌లో భాగం చేసుకునే వాళ్ల సంఖ్య ఈ మధ్య పెరిగిపోతోంది. టీకాలు, మందులతో పెరుగుతున్న కోళ్లనుంచి వచ్చే మాంసం హెల్దీ కాదు, మాంసం వల్ల బాడీకి అందాల్సిన ఫైబర్ తగ్గిపోతోంది. నాన్ వెజ్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతోంది. ఇలాంటి కారణాల వల్ల వెజిటబుల్స్‌కి గిరాకీ బాగానే పెరిగింది. నిజానికి కూరగాయల వల్ల జరిగే మంచి ఎక్కువే. కానీ, ఆ కూరగాయలనుంచే విషం కూడా ఎక్కుతోంది.
పచ్చి కూరగాయలను తినాలనుకుంటే
నిజానికి పంటల మీద పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన తర్వాత కనీసం వారం నుంచి పదిరోజుల తర్వాతే వాటిని మార్కెట్లో అమ్మాలి. అయితే ఉన్న డిమాండ్ వల్ల ఒకటీ రెండు రోజులకే వాటిని మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు. పెస్టిసైడ్ టాక్సిన్ అవశేషాలు మనుషుల బాడీలోకి వెళ్లటం వల్ల మొదటి దెబ్బ పడేది నెర్వ్స్ సిస్టమ్ మీదనే. లివర్ మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోయి చిన్నచిన్న వ్యాధులకు కూడా శరీరం తట్టుకోకుండా తయారవుతోంది. అంటే…
హెల్త్ కోసం అనుకుని ఎక్కువగా తింటున్న కూరగాయల వల్లనే మరింత పెద్ద ప్రమాదంలో పడుతున్నాం. అందుకే హెల్దీగా ఉండటం కోసమని పచ్చి కూరగాయలను తినాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. పాలకూర, గోంగూర, మెంతి, బెండ, టొమాటో, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి పంటలకి తెగుళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కువ. వాటిని తట్టుకోవటానికి స్ప్రే చేసే కెమికల్స్ మన బాడీలోకీ వచ్చేస్తున్నాయి.
ఇలా క్లీన్ చేసుకోవాలి
మామూలుగా పండ్ల మీద ఉండే పొట్టు (తొక్కలని)ని తీసేసి తింటాం కాబట్టి ఆరెంజ్, అరటి లాంటి పండ్లతో రిస్క్ తక్కువ. వీటిని కూడా కడగకుండా తినకూడదు.
యాపిల్, ద్రాక్ష, చెర్రీ లాంటి పండ్లతో పాటు టొమాటో, ఆలుగడ్డ వంటి కూరగాయల్ని ట్యాప్ కింద ఫాస్ట్‌గా వచ్చే వాటర్‌తో కనీసం 30 సెకండ్లు కడగటం మంచిది. ద్రాక్షలో పురుగుల మందు మిగతా వాటికన్నా ఎక్కువగా ఉంటుంది.
కూరగాయలను ఉప్పు నీళ్లలో వేసి నానబెట్టడం వల్ల పెస్టిసైడ్ టాక్సిన్స్ ని చాలావరకూ తగ్గించొచ్చు.
వెనిగర్ వేసిన నీళ్లలో కూరగాయలను కనీసం 3-5 నిమిషాలు, పండ్లయితే కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి.
క్యాబేజీపై ఉండే నున్నటి మూడు పొరలు తీసేయాలి. క్యాలీ ఫ్లవర్ లోనూ పువ్వుల మధ్యలో పురుగులను చంపేందుకు పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడతారు. అందుకే పువ్వులన్నింటిని విడివిడిగా తీసి ఉప్పు నీళ్లలో కాసేపు ఉంచాలి.
మిర్చిపై కూడా పురుగుల మందులు వాడుతుంటారు. కాబట్టి ఇళ్ళలో పచ్చిమిర్చిని శుభ్రంగా కడగాలి.
గ్రీన్ సలాడ్ చాలా మంచిదే. అయితే సలాడ్‌కు వాడే కూరగాయలను కచ్చితంగా ఉప్పునీళ్లలో కడిగాకే వాడాలి.
కీరా, టొమాటో, బీన్స్, వంకాయలు చూడటానికి చాలా శుభ్రంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అయినా సరే మళ్లీ కడగటం మాత్రం మర్చి పోవద్దు.
ఆకుకూరల మీద వచ్చే పురుగులని చంపటానికి వాడే మందులు కూడా చాలా డేంజర్. అందుకే కొత్తిమీరతో పాటు మిగిలిన ఆకు కూరలన్నింటినీ ఉప్పు లేదా వెనిగర్ వేసిన నీళ్ళలో కొద్దిసేపు ఉంచాలి. ఆ తరువాత కడిగి మాత్రమే వాడాలి.