కేంద్ర ఉద్యోగులు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవాలి

మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం సూచన

న్యూఢిల్లీ: ఎప్పటి నుంచి ఇండియన్ అనేది హిందీ తెలిసుండటంతో సమానమయ్యిందని డీఎంకే లీడర్ కనిమొళి ఆదివారం ట్వీట్ చేసిన విషయం తెలిసుందే. ఎయిర్‌‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ అధికారితో తనకు హిందీ రాదని వివరిస్తున్న టైమ్‌లో సదరు అధికారి.. నువ్వు భారతీయురాలివైతే అని చెప్పారని ట్వీట్ చేశారు. తనతో తమిళం లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడాలని.. తనకు హిందీ రాదని చెప్పానన్నారు. తమిళనాడులో ఈ ట్వీట్‌ కొత్త చర్చలకు దారి తీస్తోంది. ప్రాంతీయ భాషలకు ప్రాథామ్యంపై నిపుణులు చర్చలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హిందీతోపాటు ఇంగ్లిష్‌లో కూడా మాట్లాడేలా బహుభాషా విధానాన్ని తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు.

‘ఒకవేళ కేంద్ర ప్రభుత్వం హిందీతోపాటు ఇంగ్లీ‌ను అధికార భాషలుగా చేయాలని కట్టుబడితే మాత్రం సెంట్రల్ గవర్నెమెంట్ ఎంప్లాయీస్‌ తప్పనిసరిగా ఆ రెండు భాషలు నేర్చుకోవాలని పట్టుబట్టాలి’ అని చిదంబరం ట్వీట్ చేశారు. హిందీ మాట్లాడని ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పోస్టుల్లో రిక్రూట్ అయ్యాక త్వరగా ఆ భాషను నేర్చుకుంటున్నారని.. అలాంటప్పుడు హిందీ మాట్లాడే ఎంప్లాయీస్ ఇంగ్లీష్‌ ఎందుకు నేర్చుకోరని ప్రశ్నించారు.

Latest Updates