అంపైర్‌ను బాల్​తో కొట్టిన జొకోవిచ్.. డిస్ క్వాలిఫై చేసిన రిఫరీలు

లైన్​ అంపైర్‌కు బాల్​ను కొట్టిన సెర్బియన్

​యూఎస్ ​ఓపెన్​ నుంచి డిస్ క్వాలిఫై

న్యూయార్క్​: యూఎస్​ ఓపెన్​లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వరల్డ్​ నంబర్​వన్, సెర్బియా స్టార్​ ప్లేయర్​ నొవాక్​ జొకోవిచ్.. అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆదివారం మెన్స్ సింగిల్స్​​ప్రిక్వార్టర్స్‌‌​ మ్యాచ్​లో జొకో.. వెనక్కి కొట్టిన బాల్ ​ అనుకోకుండా లైన్​ జడ్జ్​కు గొంతు భాగంలో  బలంగా తాకడంతో ఆమె  కుప్పకూలింది. ఫ్యాబ్లో కారెనో బుస్టా (స్పెయిన్​)తో జరిగిన మ్యాచ్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దశలో 5–6తో వెనుకబడ్డ జొకో.. కీలక టైమ్​లో గేమ్​ను కోల్పోవడంతో ఆగ్రహంతో బాల్​ను  రాకెట్‌‌తో వెనక్కి కొట్టగా అది లైన్‌‌ జడ్జ్‌‌కు తగిలింది. దీంతో రంగంలోకి దిగిన మ్యాచ్​ రిఫరీ సోరెన్​ ఫ్రీమెల్​, గ్రాండ్​స్లామ్​ సూపర్​ వైజర్​ ఎగ్లీ, చైర్​ అంపైర్​ ఔరెల్లీ టార్చీ.. జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. దాదాపు 10 నిమిషాల పాటు జొకోవిచ్​తో చర్చలు జరిపిన నిర్వాహకులు.. సెర్బియన్​ను టోర్నీ నుంచి తప్పించారు. యూఎస్​ ఓపెన్​ రూల్స్​ ప్రకారం ఏ ఆటగాడు కూడా ప్రమాదకరంగా బాల్​ను విసరకూడదు. అలా ప్రవర్తించిన ప్లేయర్​పై కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈ నిర్ణయంతో జొకో ఇప్పటివరకు టోర్నీలో సాధించిన 25 వేల యూఎస్​ డాలర్ల ప్రైజ్​మనీతో పాటు కొన్ని ర్యాంకింగ్​ పాయింట్లను  కూడా కోల్పోతాడు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ జొకో  రెండు చేతులు జోడించి కొద్దిసేపు ప్రాధేయపడినా ఆర్గనైజర్స్​ రూల్స్​ ప్రకారమే వెళ్లారు. ఇక, ప్రిక్వార్టర్స్‌‌లో మరో మ్యాచ్‌‌లో ఏడో సీడ్‌‌ డేవిడ్‌‌ గొఫిన్​కు చుక్కెదురైంది. 12వ సీడ్‌‌  డెనిస్ షెపవలోవ్‌‌ (కెనడా) 6-–7 (0/7), 6–3, 6–4, 6–3తో గొఫిన్‌‌ను ఓడించి క్వార్టర్స్‌‌లో అడుగు పెట్టాడు. ఐదో సీడ్‌‌ జ్వెరెవ్‌‌ (జర్మనీ) 6–2, 6–2, 6–1తో డవిడొవిచ్‌‌ (స్పెయిన్‌‌)పై గెలిచాడు.

ఫేవరెట్​గా బరిలోకి దిగి..

కరోనా మహమ్మారి నుంచి కోలుకుని యూఎస్​ ఓపెన్​లో టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగిన జొకోవిచ్​ అర్ధాంతరంగా నిష్క్రమించడం టెన్నిస్​ ఫ్యాన్స్​ను షాక్​కు గురి చేసింది. మొత్తానికి కెరీర్​లో 18వ గ్రాండ్​స్లామ్​ వేటలో ఉన్న జొకో ఆశలకు కళ్లెం పడగా, 29 వరుస విజయాలకు కూడా బ్రేక్​ పడింది. లెజెండ్​ ప్లేయర్లు రోజర్​ ఫెడరర్​ (20), రఫెల్​ నడాల్​ (19) లేకపోవడంతో కచ్చితంగా ఈసారి యూఎస్​ టైటిల్​ జొకోదేనని అందరూ భావించారు. కానీ, అతని నిష్ర్కమణతో మెగా టోర్నీలో కొత్త చాంపియన్‌‌ అవతరించనున్నాడు.

మిశ్రమ స్పందన..

జొకోవిచ్​ ఘటనపై టెన్నిస్​ వరల్డ్​లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జొకో కోపంతో చేశాడని కొందరు అంటుండగా, మరికొందరు అనుకోకుండా జరిగిన ఘటనగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ టైమ్​లో కోర్టులో ఏం జరిగిందో వీడియోను షేర్​ చేస్తూ అండగా నిలుస్తున్నారు. అయితే ఆటలో భావోద్వేగాలను కంట్రోల్​ చేసుకోకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయి. గతంలోనూ చాలా మంది ప్లేయర్ల విషయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొంత మంది రాకెట్​ను విరగ్గొడితే, మరికొంత మంది ఫ్యాన్స్​తో, అంపైర్లతో, లైన్​ జడ్జ్​లతో వాగ్వాదానికి దిగారు. అయితే  ప్లేయర్లపై ఇలా చర్యలు తీసుకున్న సంఘటనలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

ఒసాకా ముందుకు.. క్విటోవా ఇంటికి

మహిళల సింగిల్స్‌‌లో నాలుగో సీడ్‌‌ నవోమి ఒసాకా క్వార్టర్స్‌‌ చేరగా.. ఆరో సీడ్‌‌ పెట్రా క్విటోవా ఇంటిదారి పట్టింది. ప్రి క్వార్టర్స్‌‌లో ఒసాకా (జపాన్) 6–3, 6–4తో 14 సీడ్‌‌ కొంటావిట్‌‌ (ఇస్తోనియా)పై గెలిచింది.  క్విటోవా (చెక్ రిపబ్లిక్​) 6–7 (5/7), 6–3, 6–7 (6/8)తో షెబ్లీ రోజర్స్‌‌ (అమెరికా) చేతిలో పోరాడి ఓడిపోయింది.

చాలా బాధపడుతున్నా

ఈ వ్యవహారంపై జొకోవిచ్​ విచారం వ్యక్తం చేశాడు. ‘ఆ టైమ్​లో నేను కోపంగా ఉన్నా. బాల్​ను కొట్టా. అది లైన్​ అంపైర్​కు తాకింది.  నేను కావాలని ఆ పని చేయలేదు. అలా చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇందులో నా తప్పు లేదు. కానీ బాధ్యత వహించాల్సిందే. ఆమెకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నా. నన్ను డిస్​క్వాలిఫై చేయడం బాధగా ఉంది. ఈ ఘటన నాకో గుణ పాఠం లాంటిది. యూఎస్​ ఓపెన్​కు సారీ చెబుతున్నా’ అని జొకో వ్యాఖ్యానించాడు.

Latest Updates