
కేంద్ర హోంశాఖ క్లారిటీతో జగన్ సర్కారు ఏర్పాట్లు
అమరావతి, వెలుగు: ఉమ్మడి ఏపీ అవతరణ దినోత్సవాన్నే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహించేందు కు వైఎస్ జగన్ సర్కారు ఏర్పాట్లు చేపట్టింది. విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు. విభజన జరిగిన తేదీనా లేక నవంబర్ 1న జరుపుకోవాలా అనే మీమాంసలో ఉండేది. క్లారిటీ కోసం టీడీపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ కూడా రాసింది. దీనిపై ఇటీవల స్పందించిన కేంద్ర హోంశాఖ నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించింది. సోమవారం ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నతాధికారులతో సమావేశమై విభజన తర్వాత రాష్ట్ర అవతరణ తొలి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే వేడుకల్లో సీఎం జగన్ పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో వేడుకల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఫండ్స్ రిలీజ్ చేస్తామని తెలిపారు.