సవాల్ గా ‘సిటిజన్ ’

ఇండియాలో జనాభా లెక్కలకు సంబంధించి పక్కాగా ఒక సిస్టమ్​ని ప్రవేశపెట్టాలనుకుంటే… ఇక్కడున్నవాళ్లతోపాటు తమకు సంబంధం లేని పాకిస్థాన్​, బంగ్లాదేశ్​లుకూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నాయి. మరి, వాళ్ల దేశాల్లో ఎలాంటి లెక్కాపత్రం లేకుండా జనాభా అవసరాలను తీరుస్తున్నారా అనే అనుమానం రావచ్చు. చాలా ప్రపంచ దేశాల్లో మాదిరిగానే పాకిస్థాన్​, బంగ్లాదేశ్​లుకూడా సిటిజెన్​షిప్​ ఐడెంటిటీ కార్డుల్ని ఇష్యూ చేస్తున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశమూ చేయలేనంత పకడ్చందీగా పాకిస్థాన్​ సిటిజెన్ల వివరాల్ని సేకరించింది. పాకిస్థాన్​లో హోం మినిస్ట్రీకి అనుబంధంగా ఉన్న ‘నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (నాడ్రా)’ అనే సంస్థ ప్రతి ఒక్క పౌరుడికి ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేస్తుంది. బంగ్లాదేశ్​ 2006లో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను ఆరంభించింది. మొదట్లో మాన్యువల్​గా ఇచ్చే ఐడి కార్డుని… 2016 అక్టోబరు నుంచి బయోమెట్రిక్, మైక్రో చిప్ ఉన్న స్మార్ట్ ఐడి కార్డులుగా మార్చింది.

ప్రస్తుతం దేశమంతా ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్​ మంత్రాలు జపిస్తోంది. ఇవే… నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజెన్స్​ (ఎన్నార్సీ), సిటిజెన్​షిప్​ అమెండ్​షిప్​ యాక్ట్​ (సీఏఏ), నేషనల్​ పాపులేషన్​ రిజిస్టర్​ (ఎన్పీఆర్​). ఈ మూడు వేర్వేరుగా నమోదు పనిచేసేవేగానీ, ఒకదానికొకటి ఇన్​డైరెక్ట్​గా లింక్​ అయి ఉన్నాయి.

దేశంలో ఉంటున్న విదేశీయుల గుర్తింపుకు సంబంధించింది ఎన్నార్సీ,

ఇల్లీగల్​గా దేశంలో ప్రవేశించినవాళ్లలో ఆరు మతాలవాళ్లకు పౌరసత్వం ఇచ్చేది సీఏఏ,

దేశంలో పట్టణాలు మొదలు మారుమూల పల్లెల వరకు నివసిస్తున్న ప్రజల వివరాలను నమోదు చేసేది ఎన్పీఆర్​.

దేశంలో రోజూ ఏదోకమూలన గొడవలకు కారణమవుతున్న ఈ మూడు పాలసీలు కొత్తవేమీ కావు. ఇవి మన దేశానికి మాత్రమే ప్రత్యేకించినవి కూడా కావు. ప్రపంచంలో 480 ఏళ్ల క్రితమే ఇవి అమల్లో ఉన్నాయి. ఫ్రాన్స్​ మొట్టమొదటిగా నేషనల్​ సివిల్​ రిజిస్ట్రేషన్​ని 1539లో చేపట్టింది. అప్పట్లో జనన, మరణాలు, వివాహాలు, విడాకుల వంటివి చర్చి ఫాదర్​లు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చేవారు. ఇదే రకంగా యూకే, నెదర్లాండ్స్​, అమెరికా, రష్యా తదితర దేశాల్లోనూ, మత ప్రాతిపదికన విడిపోయిన పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ల్లోనూ సిటిజెన్​షిప్​ రిజిస్ట్రేషన్​ పక్కాగా సాగుతోంది.

మన దేశంలో చాలా ఏళ్లుగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నా ముందుకు సాగడం లేదు. ప్రతి పదేళ్ల కొకసారి జనాభా లెక్కలు ప్రకటించి ఊరుకుంటున్నారు. ఇది సెల్ఫ్​ డిక్లరేషన్​ ఆధారంగా జరిగే ప్రక్రియ. అంటే, ఎవరూ ఎవరికీ ఎలాంటి వివరాలను ఇవ్వనక్కర్లేదు. స్వయంగా తాను ఈ దేశపు పౌరుడిని అని సెన్సెస్​ ఆఫీసర్​కి చెప్పుకుంటే చాలు, నమోదు చేసేసుకుంటారు. ఐక్యరాజ్య సమితి 1979లోనే ప్రపంచంలోని ప్రతి దేశం పక్కాగా జనాభా వివరాలను నమోదు చేయాలని తీర్మానించింది. ఇండియాలో ఆరేడేళ్ల క్రితం ‘ఆధార్​’ పేరుతో కొంత ప్రయత్నం చేసి, దానిని కొనసాగిస్తున్నారు. అయితే, ‘ఆధార్​’కు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినందువల్ల అవకతవకలన్నింటినీ సరిజేయాలన్నది మోడీ సర్కారు ఉద్దేశంగా ఎనలిస్టులు చెబుతున్నారు.

సీఏఏవల్ల అస్సాంకి నష్టమా!

ఇక, సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ) అనేది దేశ విభజన సమయంలోనూ, ఆ తర్వాత బంగ్లాదేశ్​ ఇండిపెండెన్స్​ వార్​ (ఇండో–పాక్​ యుద్ధం) కాలంలోనూ ఇండియాలోకి ప్రవేశించిన నాన్​–ముస్లింలకు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించింది. దీని కింద పాకిస్థాన్​, అఫ్ఘానిస్థాన్​, బంగ్లాదేశ్​ల నుంచి 2014 డిసెంబర్​ 31లోగా వచ్చిన ఆరు (హిందు, పార్సీ, జైన్, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ) మతాలకు చెందినవారికి ఇండియన్​ సిటిజన్​షిప్​ ఇవ్వాలన్నది ఈ తాజా సవరణలో తీసుకున్న నిర్ణయం. ఇది గనుక అమల్లోకి వస్తే అస్సాంతోపాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్న ఈ ఆరు మతాల ప్రజలకు పౌరసత్వం లభిస్తుంది. అందువల్ల ఈశాన్య రాష్ట్రాల్లో గొడవలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎందుకంటే, ఎన్నార్సీ కింద ఎలిమినేట్​ అయిపోయిన 9 లక్షల మందిలో చాలామందిని నాన్​–ముస్లిం కోటా కింద తిరిగి చేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది.

ఎన్పీఆర్​కి జనాభా లెక్కలకు తేడా ఏమిటి?

మూడోది… మొన్ననే కేంద్ర కేబినెట్​ తీసుకున్న నిర్ణయం నేషనల్​ పాపులేషన్​ రిజిస్టర్​ (ఎన్పీఆర్​). దీనిని సిటిజెన్​షిప్​ యాక్ట్​–1955 కింద… 2003లో అప్పటి వాజ​పేయి ప్రభుత్వం తెచ్చిన సిటిజెన్​షిప్​ రూల్స్​ద్వారా చేపడతారు. ప్రతి ఒక్క పౌరుడిని గుర్తించి నేషనల్​ ఐడెంటిటీ కార్డులను ఇష్యూ చేస్తారు. పట్టణంలో, పల్లెలో, మారుమూల తండాల్లో, వార్డుల్లో, డిమార్కేటెడ్​ ఏరియాల్లో (గుర్తించిన జనావాసాల్లో) నివసించే ప్రతి ఒక్కరి వివరాలను ఎన్పీఆర్​ కింద నమోదు చేస్తారు. ఈ వివరాలు సాధారణంగా ప్రతి పదేళ్లకొకసారి జనాభా లెక్కలకోసం సేకరించే విధంగానే ఉంటాయి. అయితే,  సెన్సెస్​ యాక్ట్​–1948 కింద సెల్ఫ్​ డిక్లరేషన్​ ఆధారంగా జనాభా లెక్కలు తీస్తారు. దీనికోసం ఎవరూ ఎలాంటి డాక్యుమెంట్లు లేదా వివరాలు ఇవ్వనక్కర్లేదు. ఎన్పీఆర్​లో 2003నాటి సిటిజెన్​షిప్​ రూల్స్​లోని రూల్​–3(4) ప్రకారంగా డేటా సేకరణ జరుగుతుంది.  అస్సాం మినహా అన్ని రాష్ట్రాల్లోనూ డోర్​–టు–డోర్​ సర్వే జరపాలని కేంద్రం 2009 జూలైలోనే గెజిట్​ నోటిషికేషన్​ ఇచ్చింది. 2020 ఏప్రిల్​ 1న ఆరంభించి సెప్టెంబర్​ 30లోగా పూర్తి చేయాలని టైమ్​ ఫ్రేమ్​కూడా పెట్టింది. దీనిని రిజిస్ట్రార్​ జనరల్ ద్వారా నిర్వహిస్తారు.

ఎన్నార్సీ ఎవరికోసం?

ఎన్నార్సీ అనేది అస్సాంలో అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను గుర్తించి పంపించేయడంకోసం 1951లో చేపట్టారు. దేశ విభజన తర్వాత పాకిస్థాన్​లోనే ఉండిపోయిన ముస్లింలు కానివారు… తర్వాత రోజుల్లో అక్కడ ఉండలేని పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. దాంతో చాలామంది ఇండియాలోకి ప్రవేశించడం మొదలెట్టారు. వీరిలో ఎక్కువగా ఈస్ట్​ పాకిస్థాన్​ (ప్రస్తుత బంగ్లాదేశ్​) నుంచి పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్​, అస్సాం రాష్ట్రాల్లోకి వచ్చేశారు. వారికోసం మొదటి ఎన్నార్సీ అవసరమైంది. ఆ తర్వాత 1971లో ఈస్ట్​ బెంగాల్​ ఇండిపెండెన్స్​ పోరాట సమయంలో మరోసారి అస్సాంలోకి వలసలు మొదలయ్యాయి. ఇదే సమస్యతో అస్సాంలోని స్టూడెంట్లు ఉద్యమాలు జరిపారు. జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలాక 1980 లోక్​సభ ఎన్నికల్లో మళ్లీ అధికారానికొచ్చారు ఇందిరా గాంధీ. బంగ్లాదేశ్ వలసల సమస్యను తీర్చడానికి బదులుగా మరింత బిగించేశారు ఆమె.  దాదాపు 40 లక్షల మంది బంగ్లాదేశీయులకు సిటిజెన్​షిప్​ ఇవ్వాలని నిర్ణయించడంతో అస్సాం భగ్గుమంది.  యాంటీ–బెంగాలీ మూవ్​మెంట్​ పల్లెలకు పాకింది. బొంగల్​ ఖేడా, గోరేశ్వర్​, మందాయి, ఖోరియాబారి, నెల్లి గ్రామాల్లో వరుసగా ఊచకోతలు జరిగాయి. బెంగాలీ మాట్లాడే వేలాదిమందిని  ఉద్యమకారులు నరికి చంపారు. ఆ సమయానికి అధికారంలో ఉన్న రాజీవ్​ గాంధీ, స్టూడెంట్​ యూనియన్​ నాయకులతో 1985లో ఒప్పందం చేసుకున్నారు. దీంతో రెండో ఎన్నార్సీ అవసరమైంది. మొదటి ఎన్నార్సీలో ఉన్నవాళ్లతోపాటుగా, 1971 మార్చి 24వ తేదీ వరకు అస్సాంలో ఉన్నవాళ్లందరినీ తాజా ఎన్నార్సీలో చేర్చాలన్నది ఆ ఒప్పందం. అయితే, ఎంతకూ దీనిపై పనులు మొదలు కాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2005లో ప్రధాని మన్మోహన్​ సింగ్​ గైడ్​లైన్స్​ ఖాయం చేశారు. మరో ఎనిమిదేళ్లకు 2013లో సుప్రీంకోర్టు కలగజేసుకుంటేగానీ, ఎన్నార్సీ పనులు మొదలెట్టలేదు. చివరకు 2017లో ఎన్నార్సీ డ్రాఫ్ట్ రిలీజ్​ చేసి, 2019 ఆగస్టులో ఫైనల్​ కాపీ రిలీజ్​ చేశారు. ఈ లిస్టులో 9 లక్షల మందిని బయటివాళ్లుగా గుర్తించారు. ఇది ఎన్నార్సీకి సంబంధించిన విషయం.

పొరుగు దేశాల్లో ఎలా ఉందంటే?

బంగ్లాదేశ్​లో  ‘నిక్ ’కార్డులు

సిటిజన్లు ఎవరో, కానివారు ఎవరో తెలుసుకోవడానికి బంగ్లాదేశ్ ‘నేషనల్ ఐడెంటిటీ కార్డ్ (నిక్)’లు ఇవ్వడం మొదలెట్టింది. 2006 నుంచి 18 ఏళ్లు దాటినవాళ్లకు బయో మెట్రిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థద్వారా ఫొటో ఐడెంటిటీ కార్డు ఇస్తారు. గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ అకౌంట్ వంటి పనులకు ఈ కార్డులే ఆధారం. ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అందచేసిన వివరాలతో అమలు చేసేవాళ్లు. 2016 కు ముందు సిటిజన్లకు ఇచ్చే గుర్తింపు కార్డులు చాలా సాదాసీదాగా ఉండేవి. కార్డు హోల్డర్ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఐడీ నెంబరు, వేలి ముద్ర, ఫొటో వంటివి మాత్రమే ఈ కార్డుపై ఉండేవి. 2016 అక్టోబరు నుంచి వీటి స్థానంలో బయోమెట్రిక్, మైక్రో చిప్ ఉన్న స్మార్ట్ గుర్తింపు కార్డులను ఇస్తున్నారు. ఈ చిప్​ బేస్​డ్ కార్డుద్వారా సిటిజన్లు 22 రకాల సేవలను పొందే అవకాశం ఉంటుంది.

మలేసియాలో 12ఏళ్లకే సిటిజన్​షిప్​

సిటిజన్​షిప్ అమెండ్​మెంట్​ యాక్ట్​ను మలేసియా తప్పుపడుతుందిగానీ, సిటిజన్లకు గుర్తింపు  కార్డులు ఇవ్వడంలో ఆ దేశం చాలా ఫాస్ట్. జస్ట్ 12 ఏళ్లు దాటినవారందరికీ ఐడీ కార్డులు ఇస్తారు. ‘నేషనల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్​మెంట్ ఆఫ్ మలేసియా (ఎన్ఆర్డీఎం)’కి సరైన డాక్యుమెంట్స్ చూపించిన తరువాత వెరిఫై చేసుకుని ‘మైకాడ్’ పేరుతో ఉన్న ఐడెంటిటీ కార్డు ఇస్తారు. మలేసియా సిటిజన్లందరికీ తప్పనిసరి.  దీనిపై 12 నెంబర్లుంటాయి.

సిటిజన్లకు హై క్వాలిటీ ఐడెంటిటీ కార్డు ఇవ్వడం మలేసియా ప్రత్యేకత. ఫొటో ఐడెంటిఫికేషన్​తో పాటు ఫింగర్ ప్రింట్, బయో మెట్రిక్ డేటా ఉన్న తొలి గుర్తింపు కార్డు ప్రపంచంలో అందచేసింది మలేసియానే. డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎంకి కూడా ఇదే ఉపయోగపడుతుంది.

ఇది కాకుండా మల్టీ పర్పస్ కార్డులు కూడా ఇవ్వాలని మలేసియా నిర్ణయించింది.

మైపీఆర్      :       మలేషియా పర్మనెంట్ రెసిడెంట్స్ కు ఇచ్చే కార్డు

మైటెంతెర     :       మలేషియా సాయుధ బలగాలకు ఇచ్చే కార్డు

మైపోలీస్      :       రాయల్ మలేషియా పోలీస్ సిబ్బందికి ఇచ్చే కార్డు

మైకిడ్         :       మలేసియాలో పుట్టిన వెంటనే ఇచ్చే కార్డు. అప్పటి నుంచే ఆ పాప లేదా బాబు మలేసియా సిటిజన్ కిందే లెక్క. 12 ఏళ్లు నిండాక ‘మైకాడ్’తో  రీప్లేస్ చేస్తారు.

పాకిస్థాన్​లో నాడ్రా కార్డు

ఎన్నార్సీ విషయంలో మనదేశాన్ని విమర్శిస్తున్న పాకిస్థాన్​లోనూ సిటిజన్ల రిజిస్టరీ ఉంది. అంతేకాదు సిటిజన్లకు ఓ ఐడెంటిటీ కార్డు ఇచ్చే ఏర్పాటు కూడా ఉంది. పాకిస్థాన్​లో జనాభా లెక్కింపు ఒక స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆంతరంగిక భద్రత మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ‘ది నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (నాడ్రా)’ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. సిటిజన్లకు కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డులను ఇచ్చే బాధ్యత కూడా ఈ సంస్థదే. ప్రపంచంలోనే సిటిజన్లకు సంబంధించి అతి పెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ ఉన్న ఆర్గనైజేషన్​గా ‘నాడ్రా’కు పేరుంది. పౌరులకు సంబంధించిన అన్ని వివరాలను ఈ సంస్థ రహస్యంగా ఉంచుతుంది. అన్ని వివరాలు చెక్​ చేశాక ‘కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డు (సీఎన్ఐసీ)’ పేరుతో కార్డును సిటిజన్లకు ‘నాడ్రా’ సంస్థ అందచేస్తుంది. మొట్టమొదటిసారి 2000 లో పాకిస్థాన్ సిటిజన్లకు ‘సీఎన్​ఐసీ’లను అందచేసింది. ఇక్కడ 18 ఏళ్లు పైబడ్డ వాళ్లందరూ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే, ఒక ప్రత్యేక నెంబరు ఇస్తుంది. ఈ నెంబరు చాలా కీలకం. ఫలానా వ్యక్తి  సిటిజనా, కాదా అని తేల్చి చెప్పేది సీఎన్​ఐసీ ఇచ్చే ఈ నెంబరే.

అన్ని దేశాలకూ ఉంది

ఫ్రాన్స్​: నేషనల్​ సివిల్​ రిజిస్ట్రేషన్​ని తొలిసారి (1539లో) ప్రారంభించింది. ఆ రోజుల్లో చర్చిలకు వెళ్లేవాళ్ల వివరాలను ముఖ్యంగా బాప్టిజం తీసుకున్నవాళ్ల బర్త్ డే, డెత్​ డే రాసిపెట్టేవారు. 1792లో పూర్తి స్థాయి ప్రాసెస్​ మొదలై నేటికీ కొనసాగుతోంది. బర్త్​, మ్యారేజ్​, డైవోర్స్​, డెత్ వంటి రికార్డ్స్​ మెయిన్​టెయిన్​ చేస్తున్నారు.

నెదర్లాండ్స్​: సివిల్​ రెజిస్ట్రీ బాధ్యత మునిసిపాలిటీలదే. ప్రజ​ల వివరాలను రోజూ క్లోజ్డ్​ నెట్​వర్క్​ ద్వారా నేషన్​ వైడ్ డేటాబేస్​కి అప్​డేట్​ చేస్తుంటారు. 2005 నుంచి అఫిషియల్​ ఐడెంటిఫికేషన్​ని కంపల్సరీ చేశారు. 14 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ముఖ్యమైన సందర్భాల్లో సిటిజెన్​షిప్​ను సర్కారు వద్ద నిరూపించుకోవాల్సిందే.

యూకే: స్టాటిస్టిక్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ సర్వీస్​ యాక్ట్​–2007 ప్రకారం ఆ ఏడాది డిసెంబర్​ నుంచి రిజిస్ట్రార్లు, సూపరింటెండెంట్​ రిజిస్ట్రార్లు సిటిజెన్​ల వివరాలను సేకరిస్తారు. వ్యక్తుల పేర్లు, మ్యారేజ్​, బర్త్​, డెత్​ తదితర డేటాను డైలీ బేసిస్​లో రెన్యువల్​ చేస్తుంటారు. జనానికి కావాల్సినప్పుడు ఆ ఎంట్రీల సర్టిఫైడ్​ కాపీలు ఇస్తారు.

ఇంగ్లండ్​, వేల్స్​: పుట్టిన 42 రోజుల్లోపు, చనిపోయిన 5 రోజుల్లోపు ఆయా వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. గతంలో విడిగా ఉండి, ప్రస్తుతం నేషనల్​ స్టాటిస్టిక్స్​ విభాగంలోనే కలిసిపోయిన జనరల్​ రిజిస్ట్రార్​ ఆఫీసే ఈ పనులన్నీ చూసుకోవాలి. పెళ్లిళ్ల వివరాలను అవి జరిగే చర్చిల్లోనే రికార్డ్​ చేస్తారు.

అమెరికా: బర్త్​, డెత్​ సర్టిఫికెట్లను​; అప్పుడప్పుడూ మ్యారేజ్​ సర్టిఫికెట్లను రాష్ట్రాల్లోని ‘ఆఫీస్​ ఆఫ్​ వైటల్ స్టాటిస్టిక్స్’​ లేదా ‘ఆఫీస్​ ఆఫ్​ వైటల్​ రికార్డ్స్​’ జారీ చేస్తాయి. డీడ్​లు, మార్టగేజ్​లు, నేమ్​ ఛేంజ్​ డాక్యుమెంట్లు, డైవోర్స్ రికార్డుల మెయింటనెన్స్​ను ఆయా కౌంటీల్లోని కోర్టుల క్లర్క్​లే చూసుకుంటారు.

రష్యా: బర్త్​, డెత్​, మ్యారేజ్​​ రికార్డులను యాక్ట్స్​ ఆఫ్​ సివిల్​ స్టేట్​ అని, లేదా యాక్ట్స్​ ఆఫ్​ సివిల్​ స్టేటస్​ అని అంటారు. యూనిఫైడ్​ స్టేట్​ రిజిస్టర్​ ఆఫ్​ యాక్ట్స్​ ఆఫ్​ సివిల్​ స్టేటస్ పనుల​ను ఏడాదిగా ఫెడరల్​ ట్యాక్స్​ సర్వీస్ ఆఫ్​ రష్యానే చూస్తోంది.

ఆస్ట్రేలియా: సివిల్​ రిజిస్ట్రేషన్స్​ బాధ్యతను స్టేట్​ అడ్మినిస్ట్రేషన్స్​కి ఇచ్చారు. బాప్టిజం, మ్యారేజ్​, డెత్​ వంటి వ్యవహారాలు తొలి రోజుల్లో చర్చిల ఆధ్వర్యంలో నడిచేవి. ఇప్పుడు ఆ పనులను గవర్నమెంట్​ ఎంప్లాయీసే నిర్వహిస్తున్నారు.

సౌతాఫ్రికా: నేషనల్​ పాపులేషన్​ రిజిస్టర్​ను నేషనల్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హోం అఫైర్స్​ రూపొందిస్తుంది. పుట్టుక, పెళ్లి, చావు.. ఇలా ఏ ముఖ్య సమాచారాన్నైనా రికార్డ్​ చేస్తారు.

Latest Updates