వీరజవాన్ల కోసం: ఆరు రోజుల్లో ఆరు కోట్లు

NRI Vivek Patel Starts Fund Rising for Dead Soldier’s Family at Pulwama Attack
  • వీర జవాన్ల ఫ్యామిలీ కోసం ఫేస్ బుక్ ద్వారా 6 కోట్లు కలెక్ట్ చేసిన ఎన్ఆర్ఐ

NRI Vivek Patel Starts Fund Rising for Dead Soldier’s Family at Pulwama Attack

పుల్వామాలో జరిగిన టెర్రర్ ​అటాక్​ను యావద్దేశం ముక్త కంఠంతో ఖండించింది. దాడిలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించింది. దేశాన్ని, దేశ ప్రజల్ని కాపాడేందుకు తమ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు తోడుగా నిలిచింది. మేమున్నామంటూ చాలా మంది ముందుకు వచ్చారు. జవాన్ల పిల్లల్ని చదివిస్తామని హామీ ఇచ్చారు. పేటీఎం, గూగుల్ పే లాంటి మనీ వాలెట్ల ద్వారా నగదు సాయాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ వెబ్ సైట్ ​“భారత్ కీ వీర్” ద్వారా డొనేట్ చేస్తున్నారు. అయితే ఇవి కేవలం ఇండియన్స్​కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎన్నారైలకు లేకపోవడంతో చాలా మంది డబ్బులు డొనేట్​ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. అలా ఇబ్బంది పడ్డ వారిలో వర్జీనియాలో ఉంటున్న ఇండియన్ ​వివేక్ ​పటేల్‌‌ ​అనే యువకుడు ఒకరు. అయితే అందరిలా పటేల్ బాధపడుతూ కూర్చోలేదు. జవాన్లకు ఎలా సాయం చేయాలో ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా ఫేస్​బుక్ ద్వారా ఫండ్​ రైజింగ్​ను ప్రారంభించాడు. అలా ఆరు రోజుల్లో ఆరు కోట్ల రూపాయలను సేకరించాడు.

గుజరాత్ లోని వడోదరకు చెందిన వివేక్​ పటేల్ యూఎస్​లోని వర్జీనియాలో సీనియర్​ బిజినెస్ ఎనలిస్ట్​గా పనిచేస్తున్నారు. పుల్వామా ఘటనతో చలించిపోయిన వివేక్​ జవాన్ల కుటుంబానికి ఆసరాగా నిలబడాలని, వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగా కేంద్రం ప్రారంభించిన “భారత్ కీ వీర్” సైట్​లోకి వెళ్లి డొనేట్ చేయాలని ప్రయత్నించగా.. అందులో ఫారిన్ డెబిట్​కార్డులు, క్రెడిట్ కార్డులను తీసుకోలేదు. కచ్చితంగా జవాన్లకు ఏదైనా సహాయం చేయాలనే బలమైన నిర్ణయంతో ముందుకు వెళ్లిన అతను ఫేస్​బుక్​ ఫండ్​ రైజర్​ను ప్రారంభించారు.

వివేక్​ ఆలోచనకు స్థానిక రేడియో స్టేషన్లు తమ సహాయాన్ని అందించాయి. ఫండ్​ రైజింగ్ ​గురించి ప్రచారం చేశాయి. దీంతో ఆరు రోజుల్లో దాదాపు ఆరు కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది. కెనడా, ఆస్ట్రేలి యా, జర్మనీల్లో నివసిస్తున్న వారి నుంచి కూడా తనకు ఫోన్లు వస్తున్నాయని, అందుకే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎన్నారైలు కూడా డొనేట్ ​చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వివేక్ ​అభిప్రాయపడ్డారు. “ ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా మనం ఇండియన్స్​ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సైనికుల త్యాగాన్ని డబ్బుతో వెల కట్టలేం అయినా వారి కుటుంబాలకు అండగా ఉండాలి” అని వివేక్ అన్నారు.

న్యూయార్క్​ డిప్యూటీ కాన్సులేట్ ​జనరల్ శ్రతుఘ్న సిన్హా తో మాట్లాడానని, ఎస్ బీఐ బ్యాంక్​ ద్వారా ఆ డబ్బును ఇండియాకు చేర్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఈ విషయంపై సీఆర్ పీఎఫ్​ డిప్యూటీ ఇన్స్​పెక్టర్ జనరల్ విజయ్ కుమార్​ స్పందించారు. వివేక్​ పటేల్ తో తాము కాంటాక్ట్​లో ఉన్నామని, డబ్బు కచ్చితంగా ఇండియాకు చేరేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నారైలు కూడా నగదును ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

Latest Updates