NTR ట్రైలర్ : రామారావు చక్కగా సరిపోతారండీ

క్రిష్ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్. ఈ మూవీ ట్రైలర్ ను శుక్రవారం రాత్రి 7 గంటలకు రిలీజ్ చేసింది యూనిట్. 3 నిమిషాల 16 సెకన్లున్న ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ సీన్లను అద్భుతంగా చూపించారు. ట్రైలర్ ప్రారంభంలో..ఆ రామారావు ఏంటి? కృష్ణుడేంటి?.. మార్చండి’ అని ఓ వ్యక్తి అంటే.. ‘రామారావు చక్కగా సరిపోతారండీ. ఆయన కళ్లల్లో ఓ కొంటెతనం ఉంటుంది’ అని మరో వ్యక్తి సమాధానం చెప్పే డైలాగ్‌ తో ట్రైలర్‌ స్టార్ట్ అయ్యింది.

‘నేను ఉద్యోగం మానేశా.. నచ్చలేదు.. సినిమాల్లోకి వెళ్తాను..’ అని బాలయ్య అంటున్నారు. ‘నిన్ను చూడ్డానికి జనాలు టికెట్టు కొని థియేటర్‌ కు వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్లి, కనిపిస్తే నీ సినిమాలు ఎవరు చూస్తారు’ అని ప్రశ్నిస్తే.. ‘జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దు అంటాను’ అని సమాధానం ఇచ్చారు బాలయ్య. ‘60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లూ మా కోసం బతికాం… ఇక ప్రజల కోసం, ప్రజాసేవలో బతకాలి అనుకుంటున్నాం’ అని బాలయ్య చెప్పడం ట్రైలర్‌కే హైలైట్‌ గా నిలిచింది.

‘నిన్ను అందరూ ఇక్కడ దేవుడు అంటున్నారు. అక్కడ నువ్వు కూడా అందరిలాంటి మనిషివి అయిపోతావు బావా’ అని విద్యాబాలన్‌ అంటే.. ‘తారకం నన్ను దేవుడ్ని చేసిన మనుషుల కోసం నేను మళ్లీ మనిషిని కావడానికి సిద్ధంగా ఉన్నా’ అని బాలయ్య చెప్పారు.

ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌ రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించనున్నారు. బిగ్ ప్రాజెక్టుతో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ బయోపిక్‌ ను రెండు భాగాలుగా తీస్తున్నారు.  ఎన్టీఆర్‌ బాల్యం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకూ ‘కథానాయకుడు’గా రాబోతోంది. అక్కడి నుంచి అంతిమ ఘడియల వరకూ ‘మహానాయకుడు’లో చూపించబోతున్నారు. ఫస్ట్ భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న, రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది సినిమా యూనిట్.

 

Posted in Uncategorized

Latest Updates