ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోతే.. రేప్ చేస్తారా?

‘ఎన్టీఆర్ గురించి నాకు తెలియదు, నేను ఆయన అభిమానిని కాదు’ అన్నందుకు ఓ హీరోయిన్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు ఆయన అభిమానులు. ‘వాన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మీరా చోప్రా. మారో, బంగారం వంటి సినిమాలలో నటించినా.. ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలేవీ రాలేదు. దాంతో తెలుగు సినిమాలకు దూరమైనా.. తమిళ్, హిందీ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మీరా.. జూన్ 1న ‘ఆస్క్ మీరా’ పేరుతో ఇన్‌స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చింది. ఆ లైవ్ చాట్‌లో చాలామంది చాలా ఫన్నీ ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికి ఆమె సమాధానం చెబుతూ వచ్చింది. చాట్‌లో భాగంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు.. ఎన్టీఆర్ గురించి అడిగారు. దానికి మీరా.. ‘ఎన్టీఆర్ గురించి నాకు తెలియదు, నేను ఆయన అభిమానిని కాదు. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం’ అని చెప్పింది.

మీరా ఇచ్చిన సమాధానం ఆయన అభిమానులకు నచ్చలేదు. దాంతో మీరాను సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు అయితే ఏకంగా.. నిన్ను గ్యాంగ్ రేప్ చేసి చంపుతామంటూ బెదిరిస్తున్నారు. మరికొంత మంది నిన్ను, నీ తల్లిదండ్రులను చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. ఆ బెదిరింపు ట్వీట్లతో విసిగిపోయిన మీరా.. వాటన్నింటిని స్క్రీన్ షాట్ తీసి.. తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. అంతేకాకుండా.. వాటన్నింటిని హైదరాబాద్ సిటీ పోలీస్, సైబర్‌క్రైమ్ టీంలకు ట్యాగ్ చేసింది. తనని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. బెదిరిస్తున్నవారందరిని అరెస్టు చేయాలని కోరింది. ఇవన్నీ హీరో ఎన్టీఆర్‌కు తెలిసేలా ఆయనకు కూడా ట్యాగ్ చేసింది. ‘మిమ్మల్ని సపోర్ట్ చేయకపోతే.. మీ అభిమానులు వేధిస్తున్నారు. ఇలాంటి అభిమానుల వల్ల మీకు విజయం కలుగుతుందా?’ అని హీరో ఎన్టీఆర్‌ను ప్రశ్నించింది. అలాగే తనను దూషించిన వారి ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించాలని కంపెనీని కోరింది. సినీ వర్గానికి చెందినవారితో పాటు చాలామంది నెటిజన్లు మీరాచోప్రాకు మద్దతు పలుకుతున్నారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

For More News..

ఫోన్ కోసం అక్కాతమ్ముడి గొడవ.. ఉరేసుకొని చనిపోయిన తమ్ముడు

ఈజీగా కొత్త అప్పులిస్తున్నస్టేట్​ బ్యాంక్​

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

కారు కొనాలనుకుంటున్నారా? ఇదే మంచి సమయం..

Latest Updates