రోడ్డుపై న్యూసెన్స్.. బీఆర్ఎస్ నేతలపై కేసు

రోడ్డుపై న్యూసెన్స్.. బీఆర్ఎస్ నేతలపై కేసు

జూబ్లీహిల్స్, వెలుగు: ఫోన్ టాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్​ను సిట్ అధికారులు విచారిస్తుండగా, రోడ్డుపై న్యూసెన్స్ చేసిన  బీఆర్ఎస్ విద్యార్థి నాయకులపై  కేసు నమోదైంది.  పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ నంది నగర్​లోని కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు విచారణ చేస్తుండగా, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూకుమ్మడిగా దూసుకొచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ స్థానికంగా భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా అటువైపు వెళ్తున్న వాహనదారుల రాకపోకలకు ఆటంకం కలిగించారు.  దీంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్, కడవి స్వామి యాదవ్, బాలు, చటరి దాశరథి, జూపల్లి రాముపై కేసు నమోదు చేశారు.  

మహిళా నాయకురాళ్లపై కూడా

అలాగే బీఆర్ఎస్ భవన్ దగ్గర భారీ ఎత్తున కార్యకర్తలు పోలీసు ఆంక్షలు పట్టించుకోకుండా దూసుకొచ్చారు.  ఆ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తున్న అనూష అనే కానిస్టేబుల్ బృందం వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వసంత అనే బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఆమె అనుచరులతో కలిసి పోలీస్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో మహిళా కానిస్టేబుల్ అనూష, సుజాతలకు చేతులు, ముఖాలకు గాయాలయ్యాయి.  వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.