బ్యాంక్‌‌ ఫ్రాడ్స్‌‌ తగ్గాయ్‌‌!

కేంద్ర ప్రభుత్వ ప్రకటన

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రూ.లక్ష అంతకంటే ఎక్కువ మొత్తంలో మోసాలు జరిగిన కేసుల సంఖ్య తగ్గిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌‌ పార్లమెంటులో మంగళవారం ప్రకటించారు. 2018–19లో 6,735 బ్యాంక్‌‌ ఫ్రాడ్స్‌‌ నమోదవగా, 2017–18లో 9,866 కేసులు నమోదయ్యాయని తెలిపింది. 2018–19లో బ్యాంక్‌‌ ఫ్రాడ్స్‌‌ కారణంగా రూ.2,836 కోట్ల నష్టం జరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌‌ ఫ్రాడ్స్‌‌ వల్ల రూ.4,228 కోట్ల నష్టం వాటిల్లింది. ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణ లేకపోవడం, రుణ సంస్కృతి లోపించడమే బ్యాంక్‌‌ ఫ్రాడ్స్‌‌కు కారణాలని ఆమె చెప్పారు.

‘‘నిధులను కాజేయడానికి, ఆస్తులను చేజిక్కించుకోవడానికి, ఇతర అక్రమాలకు పాల్పడటానికి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. డిఫాల్టర్ల పాస్‌‌పోర్టు వివరాలు లేకపోవడం, వారిని అరెస్టు చేయించేందుకు బ్యాంకులకు లుకౌట్‌‌ నోటీసులు జారీ చేసేందుకు అనుమతి లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లను గుర్తించే విధానం లేదు. అందుకే నేరాలు చేసి తప్పించుకోవడం సులువని వాళ్లు భావిస్తున్నారు’’ అని మంత్రి వివరించారు. గతంలో బ్యాంకర్ల, ఆడిటర్ల పాత్రను పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే బ్యాంకింగ్‌‌రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని, రుణ సంస్కృతిని మెరుగుపర్చామని, క్రమశిక్షణను పెంచామని వివరించారు. ఫలితంగా బ్యాంక్‌‌ ఫ్రాడ్స్‌‌ తగ్గాయని నిర్మల తెలియజేశారు.

 

 

 

Latest Updates