దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే నిర్వహించిన సర్ డ్రైవ్‌ను పరిశీలిస్తే, డ్రాఫ్ట్ లిస్టులో అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగింపు ఉత్తరప్రదేశ్‌లో నమోదైంది. యూపీలో సుమారు 2.89 కోట్లు డ్రాఫ్ట్ లిస్టులో గాయబ్ అయ్యాయి. తర్వాత తమిళనాడులో 97 లక్షల ఓట్లు తగ్గాయి. ఈ రెండింటి తర్వాత తెలంగాణలో ఏకంగా 73.95 లక్షల ఓటర్ల వివరాలు ఇంకా నమోదు కాకపోవడంతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం మేర ఓటర్ల వివరాలు ఆన్‌లైన్ కాకపోవడం వెనుక ఎన్నికల సిబ్బంది నమోదు చేసిన ఆబ్సెంట్, డెత్, షిఫ్టెడ్ వర్గీకరణే అత్యంత కీలకమైన అంశం. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లిన సమయంలో లభించని ‘ఆబ్సెంట్’ ఓటర్లు, ఉద్యోగాలు, ఉపాధి లేదా ఉన్నత చదువుల నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు శాశ్వతంగా వెళ్లిన ‘షిఫ్టెడ్’ ఓటర్లు, మరణించినప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్న ‘డెత్’ కేటగిరీ ఓటర్లే ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణమయ్యారు.
ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు పట్టణ పరిధిలో అద్దె ఇళ్లు తరచూ మారే కుటుంబాల సమాచారం లభించకపోవడం వల్ల వారంతా ‘షిఫ్టెడ్’ జాబితా కిందకు వచ్చారు. అలాగే బోగస్ ఓట్లను, ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఉన్న డబుల్ ఓట్లను అధునాతన మ్యాపింగ్ సాంకేతికత ద్వారా గుర్తించి తొలగించడం ద్వారా ఓటర్ల సంఖ్య తగ్గింది. కొన్ని చోట్ల గ్రామాల్లో నివసించకుండా పట్టణాలకు మారిన వారి పేర్లు కూడా స్వగ్రామాల్లో తొలగింపునకు గురయ్యాయి.
