అసభ్య వీడియో వైరల్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్

గౌహతి: అస్సాంలోని ఓ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే లెక్చరర్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక మహిళతో సదరు లెక్చరర్ అసభ్య భంగిమలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవడంతో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ధ్రుబజిత్ చౌధురీ దిబ్రూగఢ్ యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేథమేటిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 294 (ఏ), 500, 506 సెక్షన్‌ల కింద ధ్రుబజిత్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు.. శుక్రవారం అతణ్ని కోర్టులో ప్రవేశ పెట్టారు. ధ్రుబజిత్‌ సొంతూరు బర్‌‌పేట డిస్ట్రిక్ట్‌లోని పథ్సలా. ఈ కేసు గురించి మరిన్ని వివరాలను దిబ్రూగఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీజిత్ తెలిపారు.

‘నిందితుడికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఓ పార్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయి ఉంది. కేసు రిజిస్టర్ అయిన వెంటనే దానికి సంబంధించిన కాంపాక్ట్‌ డిస్క్‌ను మేం సీజ్ చేశాం. వీడియోలో ఉన్న వ్యక్తికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌కు మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని గుర్తించాం. దీంతో మేం అతడి ఇంటిపై రెయిడ్ చేశాం. అతడి ఇంట్లోకి ప్రవేశించి ల్యాప్‌ట్యాప్‌, మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశాం. నిందితుడు చెప్పిన దాని ప్రకారం.. మూడేళ్ల క్రితం గౌహతిలో సదరు వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోను తానే తీశానని, అందులో మహిళతో ఉన్నది తానేనని అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడు చెప్పిన దాని బట్టి వీడియోలో ఉన్న మహిళ స్టూడెంట్ కాదు. దీన్ని యూనివర్సిటీ వర్గాలు కూడా  చెక్ చేశాయి’ అని ఎస్పీ శ్రీజిత్ చెప్పారు.

Latest Updates