నాలాను ఆక్రమించి బిల్డింగులు కట్టిన్రు

ఎన్జీటీలో రేవంత్ రెడ్డి పిటిషన్

నాలాను డీఎల్ఎఫ్, మైహోం సంస్థలు ధ్వంసం చేసినయ్ 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీఎల్ఎఫ్, మైహోం కంపెనీలకు ఎన్జీటీ నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు:  హైదరాబాద్ లోని పుప్పాలగూడలో నాలాను ఆక్రమించి భారీ బిల్డింగులు కడుతున్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ వేశారు. జీవో 111, బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ రూల్స్ 2012కు విరుద్ధంగా 30 అంతస్తుల భవనాలను కట్టారని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారం, ఆర్థిక తోడ్పాటు ఉన్న డీఎల్ఎఫ్, మైహోం కంపెనీలు రూల్స్ ను ఉల్లంఘించాయని పిటిషన్ లో తెలిపారు. ఎన్జీటీ చెన్నై బెంచ్ బుధవారం రేవంత్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీఎల్ఎఫ్, మైహోం కంపెనీలకు జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్ పర్ట్ సబైల్ దాస్ గుప్తాతో కూడిన టూమెంబర్ బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఫీల్డ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రంగారెడ్డి కలెక్టర్, కేంద్ర పర్యావరణ శాఖ రీజనల్ ఆఫీసర్, చెరువుల పరిరక్షణ కమిటీలతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని, దీనిపై విచారణ జరిపి రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

డీఎల్ఎఫ్, మైహోం.. రూల్స్ ఉల్లంఘన  

ఎన్జీటీలో రేవంత్ రెడ్డి తరఫున అడ్వకేట్ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. నార్సింగి లేక్–2, ముస్కిన్ చెరువు నుంచి నాగిరెడ్డి కుంటకు నీళ్లు వెళ్లే నాలాను డీఎల్ఎఫ్, మైహోం సంస్థలు ధ్వంసం చేశాయని ఆయన తెలిపారు. నాలాను ఆక్రమించడంతో ఆ ఏరియాలో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో భారీ ఎత్తున నీళ్లు నిలిచిపోయినప్పటి ఫొటోలను అందజేశారు. నాగిరెడ్డి కుంటకు నీళ్లు పోయేలా 9 మీటర్ల డ్రెయిన్ నిర్మించాలని ఇతర సంస్థలకు చెప్పిన ప్రభుత్వం.. డీఎల్ఎఫ్, మైహోం సంస్థలకు మాత్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని బెంచ్ కు వివరించారు. ఈ కంపెనీలు జీవో 111 రూల్స్ ను కూడా ఉల్లంఘించాయన్నారు. నాలా ఆక్రమణపై కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర పీసీబీకి కంప్లయింట్ చేసినా, స్పందించలేదని వివరించారు.

Latest Updates