వన్డే వార్: ఈ సారి లంకేయులకు కష్టమే!

odi-war-this-time-its-hard-for-sri-lanka-cricketers

శ్రీలంక.. ఓ చిన్న దీవి.. 1996లో జరిగిన వరల్డ్‌‌కప్‌‌లో విజేతగా నిలిచి తొలిసారి ప్రపంచ క్రికెట్‌‌పై బలమైన ముద్ర వేసింది. 2003 తర్వాత జరిగిన ప్రతీ వరల్డ్‌‌కప్‌‌లోను నాకౌట్‌‌ దశకు చేరిన లంక ఈసారి అనామక జట్టుగా బరిలోకి దిగుతుంది. సీనియర్ల రిటైర్మెంట్‌‌, బోర్డులో వివాదాలు, అవినీతి ఆరోపణలు.. అన్ని కలిసి లంక జట్టును పసికూనగా మార్చాయి. రెండేళ్లలో తొమ్మిది మంది కెప్టెన్లు మారారంటే జట్టు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈసారి టోర్నీలో పసికూనైన ఆఫ్ఘనిస్థాన్‌‌పై  గెలిచిన అదో అద్భుతమనే స్థాయికి లంక దిగజారింది. ఇలాంటి తరుణంలో సీనియర్లు దినేశ్‌‌ చండిమల్‌‌, నిరోషన్‌‌ డిక్‌‌వెలాపై వేటు వేసిన సెలెక్టర్లు దిముత్‌‌ కరుణరత్నెకు వరల్డ్‌‌కప్‌‌ ఆడే జట్టు పగ్గాలు అప్పగించారు. 2015 వరల్డ్‌‌కప్‌‌ తర్వాత వన్డే జట్టుకు దూరమైన కరుణరత్నె.. స్కాట్లాండ్‌‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో తిరిగి బరిలోకి దిగాడు. ఇటీవల లంక ఫామ్‌‌ను చూస్తే వరల్డ్‌‌కప్‌‌లో ఆ జట్టుపై అంచనాలు పెట్టుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది. 2015 వరల్డ్‌‌కప్‌‌ తర్వాత 84 వన్డేలు ఆడిన లంక 55 మ్యాచ్‌‌ల్లో ఓడిపోయింది. 2016 తర్వాత ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్‌‌లోను ఆ జట్టు విజయం సాధించలేదు. 2016లో  ఐర్లండ్‌‌తో జరిగిన వన్డే సిరీస్‌‌లో లంక 2–0తో చివరిగా గెలిచింది. 2017లో  2–3తో జింబాబ్వే చేతిలో సిరీస్‌‌ ఓడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక, 2019లో ఇప్పటిదాకా ఆడిన 8 వన్డేల్లో  ఒక్క మ్యాచ్‌‌ కూడా నెగ్గలేదు.

బౌలింగే బలం…

వన్డేల్లో పేలవ ఫామ్‌‌లో ఉన్న శ్రీలంక.. బౌలర్లను నమ్ముకునే ఈసారిబరిలోకి దిగుతుంది. మాజీ కెప్టెన్‌‌, సీనియర్‌‌ ప్లేయర్‌‌ మలింగ ఈసారి ఆ జట్టులో ట్రంప్‌‌ కార్డ్‌‌ ప్లేయర్‌‌. వరల్డ్‌‌కప్‌‌ అనుభవంతో పాటు జట్టులో సీనియరైన మలింగపై జట్టు భారీగానే ఆశలు పెట్టుకుంది. మెగాటోర్నీలో మలింగకు అదిరిపోయే రికార్డు కూడా ఇందుకు ఓ కారణం. అతను సాధించిన రెండు హ్యాట్రిక్‌‌లు వరల్డ్‌‌కప్‌‌లోనే రావడం విశేషం, ఇటీవల ఐపీఎల్‌‌ ఫైనల్‌‌లో ముంబై ఇండియన్స్‌‌కు కప్‌‌ అందించిన మలింగ నుంచి లంక జట్టు అదే మ్యాజిక్‌‌ను ఆశిస్తుంది. ప్రతీ 35 బాల్స్‌‌కు ఓ వికెట్‌‌ తీస్తూ ఇటీవల రాణిస్తున్న పేసర్‌‌ సురంగ లక్మల్‌‌పైనా ఆశలు పెట్టుకుంది. వీరితో పాటు ఇప్పటికే తమని తాము నిరూపించుకున్న మాజీ కెప్టెన్‌‌ ఏంజెలో మాథ్యూస్‌‌,  తిసారా పెరీరా, లహిరు తిరిమన్నె, కుశాల్‌‌ పెరీరా, కుశాల్‌‌ మెండిస్‌‌ వంటి ప్లేయర్లు ఆ జట్టు సొంతం.

బలహీనతలు…

నిలకడలేని బ్యాటింగ్‌‌ లైనప్‌‌, సరైన నాయకత్వం లేకపోవడం, ఇటీవల ఫామ్‌‌.. చెప్పుకుంటూ పోతే లంక టీమ్‌‌లో చాలా సమస్యలే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఎనిమిది వన్డేలు ఆడినా ఒక్క దాంట్లోనూ గెలువలేదు. కెప్టెన్‌‌ కరుణరత్నె 2015 వరల్డ్‌‌కప్‌‌లో చివరిసారిగా వన్డే ఆడాడు. ఇక బ్యాట్స్‌‌మన్‌‌ విషయానికి కొస్తే ఇసుర ఉడాన, తిరిమన్నె, మాథ్యూస్‌‌కు తప్పితే ఎవ్వరికి 30 కంటే ఎక్కువ సగటు లేదు. లంక ఈ ఏడాది వన్డేల్లో ఒక్కసారి కూడా 300 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. అంతేకాక ఆడిన 8 మ్యాచ్‌‌ల్లో ఏడు సార్లు ఆలౌటైంది. కీలక ఆటగాడైన కుశాల్‌‌ మెండిస్‌‌ వన్డే ఫామ్‌‌ కూడా కలవరపెడుతుంది. టెస్ట్‌‌ల్లో మంచి ఆటగాడిగా పేరుతెచ్చుకున్న కుశాల్‌‌ వన్డేల్లో పెద్దగా మెరిపించింది లేదు. ఇక జట్టుకు సరైన వికెట్‌‌ కీపర్‌‌ కూడా లేడు.  కుశాల్‌‌ పెరీరా లేదా కుశాల్‌‌ మెండిస్‌‌లో ఒకరు కీపింగ్‌‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ ఇద్దరూ దేశవాళ్లీలో కూడా కీపింగ్‌‌ బాధ్యతలు నిర్వర్తించలేదు. అనుభవం లేని వికెట్‌‌ కీపర్‌‌తో బరిలోకి దిగడం వరల్డ్‌‌కప్‌‌లో శ్రీలంకకు ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశముంది.

నాకౌట్‌‌ చేరితే అద్భుతమే..

పేలవ ఫామ్‌‌లో ఉన్న శ్రీలంక జట్టు నుంచి ఈసారి ఎక్కువ ఆశిస్తే అది తప్పేవుతుంది. కీలక ఆటగాళ్లు రాణించినా ఒకటి, రెండు మ్యాచ్‌‌ల్లో జట్టును గెలిపించగలరు. దాదాపు అట్టడుగు స్థానాల్లోనే టోర్నీని ముగించే చాన్స్‌‌ అధికంగా ఉంది. ఒకవేళ జట్టుగా రాణించి లంక నాకౌట్‌‌కు చేరితే అది అద్భుతమే. అదే జోరులో టైటిల్‌‌ గెలిస్తే ఖచ్చితంగా మహాద్భుతమే.

జట్టు: దిముత్‌‌ కరుణరత్నె(కెప్టెన్‌‌), ఏంజెలో మాథ్యూస్‌‌, లసిత్‌‌ మలింగ, తిసార పెరీరా, కుశాల్‌‌ పెరీరా, ధనంజయ డిసిల్వా, కుశాల్‌‌ మెండిస్‌‌, ఇసుర ఉదాన, మిలింద సిరివర్ధన, అవిష్క ఫెర్నాండో, జీవన్‌‌ మెండిస్‌‌, లహిరు తిరిమన్నె, జెఫ్రీ వాండర్సే, నువాన్‌‌ ప్రదీప్‌‌, సురంగ లక్మల్‌‌.

Latest Updates