స్కూలు పిలగాడి ట్వీటు.. బస్సు టైమింగ్​ను మార్చేసింది!

భువనేశ్వర్(ఒడిశా): టైముకు బస్సు లేకపోవడం వల్ల రోజూ స్కూలుకు లేటవుతుందంటూ ఓ బుల్లి స్టూడెంట్​ చేసిన ట్వీట్​కు ఒడిశా అధికారులు ఏకంగా బస్సు టైమింగ్​ను మార్చేసిన్రు. రోజూ స్కూలుకు వెళ్లి బాగా చదువుకొమ్మని సలహా ఇచ్చిన్రు. ఒడిశా రాజధానిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. భువనేశ్వర్​కు చెందిన సాయి అన్వేష్​ అమృతం ప్రధాన్​ ఎంబీఎస్ స్కూల్​లో చదువుకుంటుండు. ఇంటి నుంచి రోజూ ‘మో బస్’(క్యాపిటల్​ రీజియన్​ అర్బన్​ ట్రాన్స్​పోర్ట్​ భువనేశ్వర్– సీఆర్ యూటీ ఆధ్వర్యంలో నడిచే బస్సు) లో స్కూలుకు పోయొస్తడు. ఇటీవల అధికారులు ఆ బస్సు టైమింగ్​ను మార్చేశారు. దీంతో లింగిపూర్​ నుంచి ఫస్ట్​ బస్  ఉదయం 7:40  నిమిషాలకు బయలుదేరుతుంది.  ఈ టైమింగ్​ మార్చడం వల్ల తను స్కూలుకు ఇన్​టైమ్​లోగా వెళ్లలేకపోతున్నానని సాయి చెబుతున్నాడు. తన స్కూలు ఉదయం 7:30 కే స్టార్ట్​ అయితదన్నడు. రోజూ ఆలస్యంగా వెళ్లడం వల్ల పాఠాలు పోతున్నయని వాపోయాడు. దీనిపై సీఆర్​యూటీ అధికారులు, ఎండీ అరుణ్​ బోత్రాకు సాయి ట్వీట్​ పెట్టిండు. ‘సార్.. నా పేరు సాయి అన్వేష్​ అమృతం ప్రధాన్. నేను ఎంబీఎస్ పబ్లిక్​ స్కూల్​లో చదువుకుంటున్న. రోజూ ‘మో బస్’లోనే స్కూలుకు పోయొస్త. కానీ, మా ఏరియా నుంచి బయలుదేరే బస్సు టైమింగ్​ను ఇటీవల మార్చిన్రు. దీంతో నేను స్కూలుకు లేటవుతున్నా’ అని ట్వీట్​ చేసిండు. సాయి రిక్వెస్ట్​ ఆకట్టుకోవడంతో నెటిజన్లు ట్వీట్​ను వైరల్​ చేసిన్రు. దీంతో సీఆర్​యూటీ అధికారులు స్పందించారు. సీఆర్​యూటీ ఎండీ, ఐపీఎస్ ఆఫీసర్​ అరుణ్​ బోత్రా జవాబిస్తూ.. ‘డియర్​ సాయి. నీలాంటి ప్రయాణికులను ‘మో బస్’ ప్రేమతో గమ్యం చేరుస్తోంది. సోమవారం నుంచి మీ ఏరియాకు వచ్చే బస్​ టైమింగ్​ మారింది. ఫస్ట్​ బస్సు ఉదయం 7 గంటలకే అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇకపై నువ్వు స్కూలుకు లేట్​గా వెళ్లక్కర్లేదు’ అని ట్వీట్​ చేశారు.

Latest Updates