వాటర్ క్వాలిటీ రిపోర్టులు దాస్తున్న అధికారులు

వాటర్ క్వాలిటీ రిపోర్టులు దాస్తున్న అధికారులు

పబ్లిక్ డొమైన్​లో పెట్టని వాటర్​బోర్డు

సిటీలో వాటర్ క్వాలిటీ రిపోర్టులు జనాలకు అందుబాటులో ఉండట్లేదు. పబ్లిక్ డొమైన్​లో ఉంచాల్సిన డెయిలీ రిపోర్టులను వాటర్ ​బోర్డు దాస్తోంది. దీంతో వెబ్ సైట్, మీడియాలో పొల్యూటెడ్ వాటర్ పరిస్థితులను తెలుసుకొని జాగ్రత్తగా ఉండే వీలు లేకుండా పోయింది.  వానాకాలంలో సీజనల్ వ్యాధుల దృష్ట్యా వాటర్ క్వాలిటీ టెస్టులను పెంచినట్లుగా ప్రకటిస్తారే తప్పా.. వాటి  వివరాలేవి బయటకు రాకుండానే అధికారులు ఆపేస్తున్నారు. దీంతో ఏ ప్రాంతంలో ఏ తీరుగా నీటి సరఫరా జరుగుతుందనే విషయాలు తెలుసుకునే అవకాశం లేకుండా చేశారు.  రోజువారీ రిపోర్టుల తయారీ కూడా రూల్స్ ప్రకారం జరగడం లేదు. సిటీలో డ్రింకింగ్ వాటర్ సప్లయ్ చేసే వాటర్ బోర్డు, రోజువారీ నీటి సప్లయ్, క్వాలిటీ వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. పలు ఏరియాల్లో ర్యాండమ్ గా సేకరించి ల్యాబొరేటరీలలో పరీక్షిస్తుంది. ఇందులో ఈకోలి బ్యాక్టీరియా, ఫ్లోరిన్, క్లోరిన్ వంటి రసాయనాల తీవ్రతను లెక్కిస్తుంది. ఇలా వాటర్ బోర్డు పరిధిలో 7 ల్యాబ్ లున్నాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం), ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(ఐహెచ్ఎస్) వంటి సంస్థలు కూడా పలు ప్రాంతాల్లో వాటర్ క్వాలిటీని పరీక్షిస్తాయి. వీటన్నింటిని రోజువారీ, నెలవారీగా రిపోర్టులుగా పబ్లిక్ డొమైన్ లు, రీసెర్చ్​, స్టడీ సంస్థలకు వీలుగా అందుబాటులో ఉంచాలి. గతంలో ఉంచేవారు. కానీ ఇప్పుడు ఆ విధానం పూర్తిగా పక్కన పెట్టేశారు. గడిచిన మూడేళ్లలో ఈ  రిపోర్టులు ఎక్కడా కనిపించ లేదు.

రిపోర్టులు బయటకు రానిస్తలే

వాటర్ బోర్డు పరిధిలో ఏడు క్వాలిటీ, టెస్టింగ్ లాబొరేటర్లు ఉండగా జనరల్ మేనేజర్ స్థాయి అధికారి క్వాలిటీ ప్రమాణాలను పర్యవేక్షిస్తారు. రోజుకు వెయ్యి ప్రాంతాల్లో శాంపిల్స్ కలెక్ట్ చేసి క్లోరిన్ శాతం, నీటి నాణ్యత వంటి విషయాలను పరిశీలిస్తారు. ఇక ఐపీఎం , ఐహెచ్ఎస్ వంటి సంస్థలు కూడా నిత్యం 500 –800 శాంపిళ్లను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి టెస్టు చేస్తుంటాయి. ఈ వివరాలను ఆయా సంస్థలు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచే విధానం 2018 వరకు అమలయ్యేది. ఆ తర్వాత వీటిని అందుబాటులో ఉంచడం లేదు. దీనికి  కారణం సిటీలో నిత్యం పలు చోట్ల మురుగు నీరు సరఫరా అవుతుండడమే.  ప్రతి రోజు నల్లా మొదలైన 5–6 నిమిషాల వరకు బురద నీళ్లు వస్తుండటమేనని తెలిసింది. దీంతో రిపోర్టులేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.  చాలా చోట్ల సీవరేజీ లైన్ల పక్కనే డ్రింకింగ్ పైపు లైన్ ఉండడం, లీకేజీలు జరుగుతుండడంతో తాగునీటిలో ఈకోలి బ్యాక్టీరియా అవశేషాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.  దీనివల్ల రోజువారీ నివేదికలు కేవలం ఆఫీసులకే పరిమితం చేస్తున్నట్లుగా మాజీ వాటర్ బోర్డు ఉద్యోగులు చెబుతున్నారు. అయితే రూల్స్​ప్రకారం ప్రజా ప్రయోజనాలకు నీటి నాణ్యత వివరాలు అందుబాటులో ఉంచాల్సిందేనని వాటర్ బోర్డు లో  ఓ రిటైర్డ్ డైరెక్టర్ చెప్పారు.

అధికారులు నో రెస్పాన్స్​

సిటీలో పలు ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి క్వాలిటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని వాటర్ బోర్డు అధికారులు చెబుతుంటారు.  గతంలో ఆ రిపోర్టులను రోజు, నెలవారీగా వెబ్ సైట్ లో పొందుపరిచేవారు. కానీ మూడేళ్లుగా అప్ లోడ్ చేయట్లేదు. ఇక వేర్వేరుగా సేకరించిన శాంపిళ్లను పరీక్షించి నాణ్యత వివరాలను ఎప్పటికప్పుడు పబ్లిష్ చేసే విధానాన్ని ఆయా సంస్థలు బంద్​ పెట్టాయి.  ఐపీఎం వెబ్ సైట్​ లో 2018 నాటి వివరాలు మాత్రమే ఉండగా, అప్పటి నుంచి రిపోర్టులు అప్ లోడ్ చేయలేదా? లేక వాటర్ టెస్టింగ్ జరగట్లేదా? అనే  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై వాటర్ బోర్డు ఉన్నతాధికారులను అడిగితే సమాధానం లేదు.  పొల్యూటెడ్ వాటర్ సరఫరా అయినా, కనీసం జనాలను అప్రమత్తం చేసే వ్యవస్థ లేదు. చివరకు మురుగు నీరు వస్తుందని ఫిర్యాదు చేసిన పట్టించుకుంటలేరు.