ఆఫీసులు ఓపెన్‌..పనులు బంద్‌

హైదరాబాద్​, వెలుగుఇన్నాళ్లూ లాక్​డౌన్​తో పనులు కాలేదు. ఇప్పుడు లాక్​డౌన్​లో సడలింపులిచ్చి ఆఫీసులు తెరుచుకునే అవకాశం కల్పించింది సర్కార్​. ప్రజలూ సంతోషించారు. కానీ, ఆ సంతోషం ఎంతో సేపు లేదు. ఆఫీసులు ఓపెన్​ అయినా పనులు మాత్రం జరగట్లేదు. కారణం, కరోనా..! జీహెచ్​ఎంసీ ఆఫీసులో కరోనా కలకలం రేపుతోంది. పది మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన ఆఫీసుతో పాటు జోనల్​, సర్కిల్​ ఆఫీసుల్లో పౌర సేవల్ని నిలిపివేశారు. 15 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. దీంతో అర్జీలు పట్టుకుని ఆఫీసులకు వస్తున్న జనాలు నిరాశతో వెనక్కి వెళ్లిపోతున్నారు.

50% మంది ఉద్యోగులతోనే…

ఆదివారం ప్రధాన కార్యలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆఫీసు మొత్తాన్ని శానిటైజ్​ చేశారు. సోమవారం ఉద్యోగులందరినీ అధికారులు ఇళ్లకు పంపించారు. నాలుగో అంతస్తులోని ఉద్యోగులకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. మొత్తంగా ప్రధాన ఆఫీసుతో పాటు ఆరు జోనల్​ ఆఫీసులు, 30 సర్కిల్​ ఆఫీసుల్లో పౌర సేవలను నిలిపేశారు. 50 శాతం మంది ఉద్యోగులతోనే పని చేయిస్తున్నారు. థర్మల్​ స్క్రీనింగ్​ చేసి, శానిటైజేషన్​ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. కేవలం సర్వీస్​సెంటర్​లోకి ఆస్తి పన్ను కట్టేవారిని మాత్రమే అనుమతిస్తున్న అధికారులు.. వేరే పనుల కోసం వచ్చిన వారిని మాత్రం అనుమతించట్లేదు. ప్రధాన ఆఫీసులోని పోనివ్వట్లేదు. అన్ని పౌర సేవలను నిలిపేశారు. మంగళవారం పారిశుధ్య నిర్వహణ, ఇంటి నిర్మాణ అనుమతి, పింఛన్​, బర్త్​, డెత్​ సర్టిఫికెట్లు, సర్టిఫికెట్లలో మార్పుల కోసం వచ్చిన వారిని లోపలికి పంపలేదు. దీంతో కొందరు సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అత్యవసర పనుల కోసం పెట్టుకునే అర్జీలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.

పది మందికి పాజిటివ్‌‌

గ్రేటర్​లో కరోనా కట్టడికి బల్దియా బాధ్యతలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి గైడెన్స్​ ఇస్తోంది. అయితే, కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో జీహెచ్​ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది వరుసగా వైరస్​ బారిన పడుతున్నారు. సిటీలో ఇప్పటిదాకా జీహెచ్​ఎంసీకి చెందిన ఇద్దరు శానిటరీ ఫీల్డ్​ అసిస్టెంట్లు, ఇద్దరు బిల్​ కలెక్టర్లు, ఆరుగురు పారిశుధ్య సిబ్బందికి కరోనా సోకింది. వైరస్​ కట్టడిలో ముందుండి పనిచేస్తున్న వారికీ వైరస్​ సోకుతుండడంతో తోటి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్​లో సికింద్రాబాద్​ సర్కిల్​ పరిధిలోని పారిశుధ్య కార్మికుడు కరోనాతో చనిపోయాడు. మే మొదటి వారంలో లంగర్​హౌస్​కు చెందిన పారిశుధ్య విభాగం సూపర్​వైజర్​కు కరోనా సోకింది. ఇటీవల సికింద్రాబాద్​ ఐడీహెచ్​ కాలనీకి చెందిన పారిశుధ్య కార్మికుడికీ కరోనా పాజిటివ్​ వచ్చింది. శనివారం నమోదైన కేసుల్లో జీహెచ్​ఎంసీ బిల్​ కలెక్టర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆదివారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని హెల్త్​ విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు ఆఫీసు మొత్తాన్ని శానిటైజ్​ చేశారు. ఉద్యోగి విధులు నిర్వహించిన నాలుగో అంతస్తు మొత్తాన్ని స్ప్రే చేశారు. ఆఫీసులోకి బయటివారిని అధికారులు రానివ్వడం లేదు.

గాంధీలో డాక్టర్ పై దాడి

Latest Updates