గండికోట రిజర్వాయర్లో నీటి నిల్వపై వెనక్కి తగ్గిన అధికారులు: మైలవరం-పెన్నాకు విడుదల

ముంపు బాధితుల ఆందోళనతో.. పరిహారం చెల్లించిన తర్వాతే నీళ్లు నిల్వ చేయాలని నిర్ణయం

గండికోట నుండి మైలవరానికి… మైలవరం నుండి పెన్నాకు విడుదల

వైఎస్ఆర్ కడప జిల్లా: గండికోట రిజర్వాయర్ లో నీటిని నిల్వ చేయడంపై అధికారులు వెనక్కి తగ్గారు. తమకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలంటూ ముంపు బాధితుల ఆందోళన చేపట్టడంతో.. ఈ సమస్య పరిష్కరించిన తర్వాతే నీళ్లు నిల్వ చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో గండికోట రిజర్వాయర్ లో నిల్వ చేసిన నీటిని మైలవరం జలాశయానికి విడుదల చేశారు. అక్కడ నుండి పెన్నాకు విడుదల చేస్తున్నారు.

గండికోట నుండి మైలవరానికి 7500 క్యూసెక్కులు విడుదల

గండికోట రిజర్వాయర్ లో నిల్వ చేసిన నీటిని దిగువన మైలవరానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి వర్షాలు లేకున్నా ఒక్కసారిగా 7500 క్యూసెక్కుల నీటి విడుదల ప్రారంభించారు. రజకులు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలు నీటి ప్రవాహం విషయంలో  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 4.2 టీఎంసీల నీరు నిల్వ ఉండగా… ఎగువ నుండి 7500 క్యూసెక్కులు వస్తోంది. జలవనరుల శాఖ ఎస్.ఈ మధుసూధన్ రెడ్డి  మైలవరం జలాశయం వద్ద గేట్లు ఎత్తి పెన్నా నదికి నీటి విడుదల ప్రారంభించారు. 500 క్యూసెక్కులతో ప్రారంభమైన నీటి విడుదల క్రమంగా పెంచాలని నిర్ణయించారు. ముందు జాగ్రత్తగా పెన్నా పరివాహక ప్రాంతాల్లోని వారిని అప్రమత్తం చేస్తున్నారు.

Latest Updates