గనుల్లో సేఫ్టీపై సింగరేణిలో కీలక మీటింగ్​

గనుల్లో సేఫ్టీపై సింగరేణిలో కీలక మీటింగ్​
  •     కార్మిక సంఘాల సలహాలు, సూచనలకు ప్రయారిటీ
  •     టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాల హాజరు

మందమర్రి, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కార్మికుల్లోని ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. గడిచిన11 నెలల్లో ఒక ఆఫీసర్ సహా11 మంది ఎంప్లాయ్స్ మృతి చెందారు. ‘బొగ్గు ఉత్పత్తి పెంచాలి. వినియోగదారులకు సకాలంలో అందించాలి. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలి. రోజువారీ టార్గెట్ పెంచుకోవాలి.’ అని సింగరేణి ఆఫీసర్లు పదేపదే చెబుతున్నారే తప్ప కార్మికుల రక్షణపై ఫోకస్​పెట్టడం లేదు. ఈ నెల10న జరిగిన ఎస్సార్పీ3 గని ప్రమాదం తర్వాత ఆర్కే5, 7, కేకే ఓసీపీల్లోనూ వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం సోమవారం గోదావరిఖనిలో కీలక సేఫ్టీ మీటింగ్​నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్​తో పాటు జాతీయ కార్మిక సంఘాలను కూడా పిలిచింది.1998లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు విధానం అమల్లోకి వచ్చాక యాజమాన్యం జాతీయ సంఘాలను మీటింగ్​కు పిలవలేదు. మొదటిసారి ఆ సంఘాలను కూడా పిలుస్తోంది. వరుస ప్రమాదాలపై యాజమాన్యం, డీజీఎంఎస్ ఆఫీసర్ల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడంతోపాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సంఘాలు రెడీ అయ్యాయి. 

పదేళ్లలో 100 మంది మృతి

సింగరేణిలో ప్రస్తుతం18 ఓసీపీలు, 27 అండర్​ గ్రౌండ్​ మైన్స్ ఉన్నాయి. వాటిలో దాదాపు 44 వేల మంది కార్మికుల పని చేస్తున్నారు. 2012 నుంచి 2021 గనుల్లో జరిగిన ప్రమాదాల్లో 100 మంది కార్మికులు చనిపోయారు. 2,174 సివియర్, 3,419 రిపోర్టబుల్ ప్రమాదాలు నమోదయ్యాయి. ఈయేడు జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృతి చెందగా 104 మందికి తీవ్రగాయాలయ్యాయి. 105 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందులో ఆగస్టు నెలఖారులో మణుగూరు ఓసీపీలో ముగ్గురు, భూపాలపల్లి ఏరియా కేటీకే 6  గనిలో ఇద్దరు, ఈనెల 10న శ్రీరాంపూర్​లోని ఎస్సార్పీ3 గనిలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 19న మందమర్రి ఏరియా కేకే ఓసీపీలో సేఫ్టీ పర్యవేక్షణ చేసే మేనేజర్ మృత్యువాత పడ్డారు.

యాక్సిడెంట్ల రికార్డు ఉండట్లే

కార్మికుల రక్షణ విషయంలో లోపాలు బయటకు కపించకుండా ఉండేందుకు ఆఫీసర్లు యాక్సిడెంట్లను  రికార్డు చేయడం లేదు. డీజీఎంఎస్​ఆఫీసర్ల దృష్టికి రాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారు. గాయపడ్డ కార్మికున్ని చికిత్స కోసం ఆసుపత్రికి పంపిస్తున్నారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని ఒత్తిడి తీసుకొస్తూ అనధికారికంగా రెస్టు ఇస్తున్నారు. రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడానికి నిర్వహించే సేఫ్టీ సమావేశాలపై యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. 6 నెలలకు ఒకసారి జరగాల్సిన సేఫ్టీ మీటింగులు గడిచిన ఏడేండ్లలో 3 సార్లు మాత్రమే జరిగాయి. డీజీఎంఎస్ ఆఫీసర్లతోపాటు గుర్తింపు కార్మిక సంఘం, యాజమాన్యం ప్రతినిధులు పాల్గొనే సమావేశంలో అనేక రక్షణ అంశాలపై చర్చిస్తారు. లోపాలను గుర్తించి వాటిని సమీక్షించుకుంటారు.1956 నుంచి 2020 వరకు12 సార్లు నేషనల్​ సేఫ్టీ మీటింగులు జరిగితే వాటిలో తీసుకున్న నిర్ణయాలను సింగరేణిలో అమలు చేయడంలేదని బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య ఆరోపిస్తున్నారు. సింగరేణి కాలరీస్​ఆడిట్ రిపోర్టులు పరిశీలిస్తే, సంస్థ కార్మికుల భద్రతను ఎంత నిర్లక్ష్యం చేస్తుందో స్పష్టం అవుతుంది. 2019–-20 ఆర్థిక సంవత్సరంలో కార్మికుల భద్రత కోసం రూ.7 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది రూ.3.89 కోట్లు మాత్రమే. 2020–-21లో రూ.20.08కోట్లు కేటాయిస్తే కేవలం రూ.5.43 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. యాక్సిడెంట్లపై కార్మికుల్లో అవగాహన కల్పించేందుకు యాజమాన్యం రూ.కోట్లు ఖర్చుచేసి సింటార్స్​(సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్​ మేనేజ్​మెంట్​ ట్రైనింగ్​ సెంటర్)ను మందమర్రి, యైటింక్లైన్​కాలనీలో ఏర్పాటు చేసింది. కానీ అవగాహన తరగతులు నామమాత్రంగా నిర్వహిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటీసీలోనూ అంతంతగానే ఉంది.