ఇరవైళ్లలో ఇదే మొదటిసారి.. భారీగా తగ్గిన చమురు ధర

చమురు ఉత్పత్తి దేశాల మధ్య  పోటీతో పడిపోయిన ధరలు

దీనికి తోడైన కరోనా భయం, యెస్​ బ్యాంకు సంక్షోభం

వీటన్నింటి దెబ్బకు భారీగా పడిపోయిన మన స్టాక్​ మార్కెట్​

ఒక్క రోజే ఏడు లక్షల కోట్ల మేర ఆవిరైన ఇన్వెస్టర్ల సంపద

క్రూడాయిల్​ రేటు పడిపోవడం ఇండియాకు మేలే..

తగ్గనున్న దిగుమతుల బిల్లు.. ద్రవ్యలోటు కట్టడికి చాన్స్​

పెట్రోల్, డీజిల్​ ధరలు తగ్గితే రవాణా,  పరిశ్రమలకు బూస్ట్​

సాధారణ ప్రజలకూ ధరల ఊరట

రష్యా, ఒపెక్‌‌‌‌ దేశాలు పెట్రోల్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌పై ఒక ఒప్పందానికి రాకపోవడంతో క్రూడ్‌‌‌‌  ధర ఏకంగా 36 డాలర్లకు దిగివచ్చింది. గత ఇరవై ఏళ్లలో ఇంత ఎక్కువగా ఎప్పుడూ చమురు రేట్లు తగ్గలేదు.  చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఇండియా, చైనా వంటి దేశాలకు ఇది మంచి ఛాన్స్‌‌‌‌.  దీనివల్ల మనదేశంలోనూ ధరలు ఇంకా తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి.

ఇంటర్నేషనల్ మార్కెట్​లో క్రూడ్​ అయిల్​ ధర అమాంతం పడిపోయింది. బ్యారెల్​కు 36 డాలర్ల స్థాయికి పడింది. దీంతో ఒక్కసారిగా  ప్రపంచ మార్కెట్లు షేక్​ అయిపోయాయి. నిన్నమొన్నటి దాకా దాదాపు 60 డాలర్ల వరకు పలికి బ్యారెల్‌‌‌‌ క్రూడ్‌‌‌‌ ధర ఇప్పుడు 36 డాలర్లకు తగ్గింది.
అంటే 24 డాలర్లు (దాదాపు రూ.రెండు వేలు) పడిపోయింది.  2014 సెప్టెంబరులో ఏకంగా బ్యారెల్‌‌‌‌ క్రూడ్‌‌‌‌ ధర 100 డాలర్ల వరకు వెళ్లింది. అయితే,1991 తరువాత క్రూడ్‌‌‌‌ ధరలు ఇంతలా తగ్గడం ఇదే తొలిసారి. సోమవారం ఒక్క రోజే ధర 25 శాతం తగ్గడం గమనార్హం. దీంతో సౌదీ ఆరామ్‌‌‌‌కో షేర్ల ధరలు పదిశాతం తగ్గాయి. ఈ కంపెనీ పబ్లిక్‌‌‌‌ ఇష్యూ ధర కంటే కిందకి
దిగిపోయింది .

తగ్గుతున్న ధరలు

ఇంటర్నేషనల్‌‌ మార్కెట్లలో రేట్ల తగ్గుదల వల్ల ఇండియాలోనూ రేట్లు తగ్గుతున్నాయి. గత నెల 28 నుంచి దాదాపు ప్రతి రోజూ పెట్రో ధరలు 24పైసలు వరకు తగ్గాయి. ఇక సోమవారం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌‌ ధర రూ.70.63లకు, డీజిల్‌‌ ధర రూ.63.30లకు తగ్గింది.
ముంబైలో లీటరు పెట్రోల్‌‌ ధర రూ.76.27గా, డీజిల్‌‌ ధర రూ.66.22కు పడిపోయింది. చెన్నైలో లీటరు పెట్రోల్‌‌ ధర రూ.73.31గా, డీజిల్‌‌ ధర రూ.65.40లకు తగ్గింది. హైదరాబాద్‌‌లో వీటి ధరలు వరుసగా రూ.75.02, రూ.65.40గా నమోదయ్యాయి. గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం బ్యారెల్‌‌ ధర 36 డాలర్ల వరకు పలుకుతోందని, ఇది 20 డాలర్లకు తగ్గే అవకాశాలూ ఉన్నాయని గోల్డ్‌‌మన్‌‌ శాక్స్‌‌ తెలిపింది. ఇండియా తనకు కావాల్సిన చమురులో 84 శాతాన్ని విదేశాల నుంచి తెప్పించుకుంటున్న విషయం తెలిసిందే.
ధరల తగ్గుదల ఎకానమీకి మేలు చేసినప్పటికీ, ఓఎన్‌‌జీసీ వంటి కంపెనీలకు, సోలార్‌‌ కరెంటు సంస్థలకు నష్టమని ఆయిల్‌‌ మార్కెటింగ్‌‌ కంపెనీలు అంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మనదేశం చమురు కోసం రూ.7.43 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని పెట్రోలియం ప్లానింగ్‌‌ అండ్‌‌ ఎనాలిసిస్‌‌ సెల్‌‌ తెలిపింది. కేవలం రెండు వారాల్లో క్రూడ్​ ధర 24 డాలర్ల వరకు తగ్గింది. దీనివల్ల మనదేశంలో ధరలు మరింత తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి.

13 శాతం నష్టోయిన రిలయన్స్‌‌ షేరు

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు 25 శాతానికిపైగా పడిపోవడంతో రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ షేర్‌‌ ధర సోమవారం 13 శాతం నష్టపోయి, రూ.1,113లకు చేరింది. 2008 అక్టోబరు తరువాత ఆర్‌‌ఐఎల్‌‌ షేరు ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు మార్కెట్‌‌క్యాప్‌‌పరంగా మొదటిస్థానంలో ఉన్న రిలయన్స్‌‌ షేర్ల విలువ పడిపోవడంతో రెండోస్థానానికి చేరింది. టీసీఎస్‌‌ మొదటిస్థానానికి వచ్చింది.

మన పరిస్థితి?

పెట్రో ధరల తగ్గుదల ఏ దేశానికి అయినా మేలు చేస్తుంది. ఇండియా వంటి డెవలపింగ్‌‌‌‌ నేషన్స్‌‌‌‌కు అయితే ఎంతో లాభం. చమురు దిగుమతుల కోసం మనదేశం రూ. లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.  చమురు చౌకగా దొరికితే ఇండియా ఫారిన్‌‌‌‌ కరెన్సీ నిల్వలు తక్కువగా ఖర్చవుతాయి. ఫలితంగా ద్రవ్యలోటు తగ్గుతుంది. ఇతర వస్తువుల ధరలూ తగ్గుతాయి. డిమాండ్‌‌‌‌ పెరిగి ఎకానమీ పరుగుతీస్తుంది. అయితే కరోనా కేసుల వల్ల డాలర్‌‌‌‌తో రూపాయి విలువ 74 స్థాయికి చేరడంతో ఇండియా ఈ పరిస్థితిని పెద్దగా సొమ్ము చేసుకోలేకపోతోంది. ఇంటర్నేషనల్‌‌‌‌ మార్కెట్లో చమురు కొనడానికి డాలర్లలో చెల్లిస్తారనే విషయం తెలిసిందే. ఇండియాకు ఉన్న మరో ఇబ్బంది ఏమిటంటే నిల్వ సామర్థ్యాలు తక్కువ. మనదేశంలో ఉడిపి, మంగళూరు, వైజాగ్‌‌‌‌లో పెట్రోలియం నిల్వ స్థావరాలు ఉన్నాయి. వీటిలో రెండు వారాలకు సరిపడా నిల్వలను మాత్రమే ఉంచవచ్చు. మనం రెండు వారాల్లో 3.7 కోట్ల పీపాలను మాత్రమే నిల్వచేయగలం. చైనా 68 కోట్ల, జపాన్‌‌‌‌ 32 కోట్ల పీపాలను నిల్వ చేస్తుంది. నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం అతిపెద్ద సమస్యగా మారింది. తక్కువ ధరకు చమురు దొరుకుతున్నా ఎక్కువ కొనలేని పరిస్థితి ఉంది.  అయితే ధరలు ఇలాగే కొనసాగితే రాబోయే ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతుల భారం సగం తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం చమురు కొనుగోలుకు ఏటా 64 బిలియన్‌‌‌‌ డాలర్ల వరకు ఖర్చవుతోంది. బ్యారెల్‌‌‌‌ ధర ఒక్క డాలర్‌‌‌‌ తగ్గినా మనకు రూ.2,900 కోట్లు ఆదా అవుతాయి. రూపాయి మారక విలువ ఒక యూనిట్‌‌‌‌ తగ్గినా రూ.2,700 కోట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

గొడవలతోనే.. క్రాష్​

మామూలుగా అయితే ఇంటర్నేషనల్‌‌‌‌ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే తప్ప తగ్గే సందర్భాలు తక్కువ! ఎందుకంటే పెట్రో ప్రొడక్టులకు డిమాండ్‌‌‌‌ అలా ఉంటుంది మరి! చమురును తయారు చేసే దేశాల మధ్య విబేధాలు ఏర్పడటంతో పరిస్థితి మారింది. ఆర్గనైజేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పెట్రోలియం ఎక్స్‌‌‌‌పోర్టింగ్‌‌‌‌ కంట్రీస్‌‌‌‌ (ఒపెక్‌‌‌‌), రష్యా దేశాల మధ్య తేడాలు రావడంతో ధరలు రికార్డుస్థాయిలో దిగివస్తున్నాయి. కరోనా వైరస్‌‌‌‌, ఎకానమీ స్లోడౌన్‌‌‌‌ కారణంగా పెట్రో ప్రొడక్టులకు డిమాండ్‌‌‌‌ పడిపోయింది. దీంతో సహజంగానే ధరలూ పడిపోయాయి. ఇలాగైతే లాభం లేదని భావించిన ఒపెక్‌‌‌‌ దేశాలు ప్రొడక్షన్‌‌‌‌ను తగ్గించి ధరలు పడిపోకుండా చూడాలని అనుకున్నాయి. రష్యా మాత్రం వీరి నిర్ణయానికి ఒప్పుకోలేదు. ప్రొడక్షన్‌‌‌‌ను తగ్గిస్తే తనకు నష్టం కలుగుతుందని కుండబద్దలు కొట్టింది. దీంతో ఒపెక్‌‌‌‌ దేశాలు ప్లాన్‌‌‌‌ను మార్చాయి. తామూ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం సౌదీ అరేబియా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తిని అమాంతం పెంచి ధరల యుద్ధానికి తెరతీసింది. ఎక్కువ అమ్మకాలతో ఎక్కువ ఆదాయం సంపాదించాలన్నది దీని ప్లాన్‌‌‌‌.

Latest Updates