కరెంట్ కార్లకు టైం పడుతుంది

Ola focuses on two and three-wheelers for EV adoption; 4-wheeler to take time
  • ఇప్పటికైతే ఎలక్ట్రిక్‌‌ బైకులు, ఆటోలే
  • ఓలా ఎలక్ట్రిక్‌‌ మొబిలిటీ ప్రకటన

న్యూఢిల్లీ: ఇప్పటికప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌‌ కార్లను తీసుకురావడం సాధ్యం కాదని, ఇందుకు మరింత సమయం పడుతుందని క్యాబ్‌‌ అగ్రిగేటర్​ ఓలా భావిస్తోంది. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్‌‌ ఆటోలు, బైకుల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపింది. ఈ కంపెనీ తొలిసారిగా 2017లో నాగపూర్‌‌లో ఎలక్ట్రిక్‌‌ కార్ల ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నిర్వహించింది. ఇందుకోసం మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్‌‌ కార్లను కొనుగోలు చేసింది. ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఎలక్ట్రిక్‌‌ కార్ల ప్రాజెక్టును ఆపేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి వివిధ నగరాల్లో 10 వేల ఎలక్ట్రిక్‌‌ ఆటోలు, బైకుల ద్వారా సేవలు అందిస్తామని తెలిపింది. ఎలక్ట్రిక్‌‌ కార్లకు మనదేశం ఇంకా సిద్ధం కాలేదని నాగపూర్‌‌ అనుభవం ద్వారా గ్రహించామని, వీటిని ప్రవేశపెట్టడానికి మరికొన్నేళ్ల సమయం పడుతుందని ఓలా ఎలక్ట్రిక్‌‌ మొబిలిటీ (ఓఈఎం) సహ వ్యవస్థాపకుడు అనంద్‌‌ షా చెప్పారు.

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌‌ రిక్షాలకు ఆదరణ బాగుందని, టూవీలర్లకు కూడా స్పందన వస్తుందని భావిస్తున్నామని అన్నారు. తమ లాంటి కంపెనీ ఎలక్ట్రిక్‌‌ టూవీలర్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. ఓలా గుర్గావ్‌‌లో ఇది వరకే వంద ఈ–రిక్షాలను నడిపిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, గుజరాత్‌‌ వంటి రాష్ట్రాలకు ఎలక్ట్రిక్‌‌ వాహనాలను తీసుకొస్తామని ఆనంద్‌‌ వెల్లడించారు. అయినప్పటికీ, ఎలక్ట్రిక్‌‌ కార్ల ప్రాజెక్టు కోసం కృషి కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘మేం ప్రస్తుతం కొన్ని ఎలక్ట్రిక్‌‌ కార్లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాం. కొత్త మోడల్స్ వస్తే వాటినీ చూస్తాం. వాణిజ్యస్థాయిలో వీటిని నడపడానికి మాత్రం కొన్నేళ్లు పడుతుంది. సరైన బ్యాటరీ టెక్నాలజీ లేకపోవడం వల్లే నాగపూర్‌‌లో మేం విజయం సాధించలేకపోయాం. మనదేశ రోడ్లకు అనువైన బ్యాటరీలు కావాలి. కరెంటు బిల్లులు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎలక్ట్రిక్‌‌ వాహనాల కోసం మా భాగస్వామ్య సంస్థలు టైగర్‌‌ గ్లోబల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌, మ్యాట్రిక్స్ ఇండియా నుంచి రూ.400 కోట్లు సేకరించాం. వీటితో మా లక్ష్యాలు నెరవేరుతాయి’’ అని ఆనంద్‌‌ వివరించారు.