సిటీలో డొక్కు బస్సులు @ 1500

సిటీలో కాలం చెల్లిన బస్సులనే తిప్పుతున్న ఆర్టీసీ..  మోరాయిస్తున్న వాటితో  ప్రయాణికుల బెంబేలు

సిటీ ఆర్టీసీ బస్సులు అంటేనే జనాలు హడలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. బస్సు ఎప్పుడూ ఎక్కడ ఆగిపోతుందో తెలియని ఆందోళనతోనే ప్రయాణిస్తున్నారు.  గత మూడు నెలల కాలంలో  దాదాపు 100 బస్సులు సడెన్ గా రోడ్లపై మోరాయించి చుక్కలు చూపించాయి. బ్రేక్ డౌన్ లేదా సడెన్ గా ఆగిపోవటం, లేదంటే సెల్ఫ్ ప్రాబ్లమ్ ఇతరాత్ర సమస్యలు వస్తున్నాయి.  రోడ్డుపైకి బస్సు ఎక్కిందంటే తిరిగి డిపోకు వెళ్లే  వరకు డ్రైవర్, కండక్టర్‌‌కు టెన్షన్ తప్పడం లేదు. సిగ్నల్స్ వద్ద  బస్సు నిలిపితే ఇక కదులుతుందో లేదా తెలియని అయోమయ పరిస్థితి. ప్రధాన రోడ్లపై రోజూ ఏదో ఒక చోట సిటీ బస్సులు నిలిచిపోతూనే ఉన్నాయి. వీటిని రోడ్డుపై నుంచి డిపోకు తీసుకెళ్లడం పెద్ద తలనొప్పిగా మారింది.  అయినా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫిట్‌‌నెస్‌‌ లేని బస్సులను రోడ్లపై తిప్పుతుండడంతో ప్రయాణికులు పరేషాన్ అవుతున్నారు.

కాలం చెల్లినవే ఎక్కువ
గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో 3,800 బస్సుల వరకు తిరుగుతున్నాయి. సిటీలో జనాభాకు బస్సుల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేదు. దాదాపు 7 వేల పైగా బస్సులు అవసరం ఉంటే ఉన్నవాటితోనే  నెట్టుకొస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఉన్నవే  తిరుగుతున్నాయి. ఇందులో దాదాపు 1500 బస్సులు సరైన సామర్థ్యం లేని స్థితిలో ఉన్నాయి. 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన వాటిని పక్కన పెట్టాల్సి ఉండగా, 19 లక్షల కిలోమీటర్లపైగా తిరిగిన డొక్కు బస్సులనే తిప్పుతున్నారు. పదే పదే రిపేర్ చేయిస్తున్నారు కానీ కొత్తవి కొనేందుకు చర్యలు తీసుకోవడం లేదు. గత పదేళ్లలో సిటీలో జనాభా పెరిగిపోయింది.  బస్సులను ఎక్కేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇప్పటికీ సిటీ రవాణాలో ఆర్టీసీ ద్వారానే 50 శాతానికి పైగా ప్రయాణికులు వెళ్తున్నారు. సుమారు 44 లక్షల మందికి పైగా సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఇక ప్రయాణికుల భద్రత, వసతుల కల్పనలో ఆర్టీసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లుగా కొత్త బస్సులనుకొనే విషయంలో అడుగు ముందుకు పడడం లేదు. పైగా కాలం చెల్లిన బస్సులతోనే ప్రయాణికుల ప్రాణాలతో హరించేలా వ్యవహరిస్తున్నారు.

ఆర్థిక నష్టాలంటూ కొత్త బస్సులకు నో
ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండగా ఇందులో  సింహభాగం గ్రేటర్ -జోన్ దే. ఇక్కడ రోజుకు కోటి రూపాయలకు పైగా నష్టం వస్తోంది. దీన్ని సాకుగా చూపిస్తూ అధికారులు కొత్త బస్సులకు నో చెపుతున్నారు. ఉన్న వాటినే తిప్పుతూ నష్టాలను తగ్గించుకోవాలని చూస్తున్నారు. అయితే ఇవి ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా మారాయి. ఉండాల్సినన్ని బస్సులు లేక ఉన్నవాటిలోనే కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీంతో విద్యార్థులు, యూత్‌‌ ఫుట్ బోర్డులపై ప్రయాణిస్తూ ప్రమాదాల పాలవుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణమంటే చుక్కలు కనిపిస్తున్నాయి. సామర్థ్యానికి మించి జనం ఎక్కుతుండటంతో తీవ్ర ఇబ్బంది పడుతూనే మరో ప్రత్యామ్నాయం లేక వాటిలోనే వెళ్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఫిట్‌‌నెస్‌‌ లేక తరచూ ప్రమాదాలు
ఫిట్ నెస్ లేని బస్సులను సిటీ రోడ్లపై తిప్పుతున్నారు. అయితే ట్రాఫిక్, ఇరుకు రోడ్లు, ఇతర వాహనాల కారణంగా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. కానీ బ్రేకులు, గేర్ రాడ్లు, ఇంజిన్, టైర్ల సమస్యలతో డ్రైవర్లు నియంత్రణ కోల్పోతుండడంతో ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఏడాది సిటీలో బస్సులు ఢీ కొని 20 మందికి పైగా మృతి చెందారు. ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లను అధికారులు బాధ్యులను చేస్తూ, బస్సుల ఫిట్ నెస్ విషయంలో మాత్రం విఫలమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో 1500 వెంటనే స్క్రాప్ గా మార్చాల్సిన అవసరం ఉంది.

Latest Updates