అనుమానాస్పద రీతిలో వృద్ధుడి హత్య

old-man-suspicious-death-in-thirumala-giri

హైదరాబాద్ : తిరుమలగిరి పీఎస్ పరిధిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..  తిరుమలగిరి లో నివాసముంటున్న 65 ఏళ్ల మార్టిన్ ఆరోగ్య దాస్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ భార్యాపిల్లలతో జీవనం సాగిస్తున్నాడు.  తిరుమలగిరిలో ఉంటున్న ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు కట్టే ఉద్దేశంతో మార్టిన్..  వారం రోజుల క్రితం అతని భార్యాపిల్లలను కనాజిగూడలో  ఓ అద్దె ఇంటికి పంపించాడు. అయితే ఇంట్లో ఇంకొంత సామాను ఉండడంతో ఆరోగ్యదాస్ అదే ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. వీలు చూసి తాను కూడా కనాజిగూడకు వెళదామనుకున్నాడు.

శుక్రవారం రాత్రి ఆరోగ్యదాస్ తన మిత్రులతో కలసి పార్టీ చేసుకున్నాడు. మద్యం మత్తులో నడవలేని స్థితిలో అతన్ని మిత్రులు ఆటోలో తిరుమలగిరి లోని అతని ఇంటి వద్దకు చేర్చారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఆరోగ్యదాస్ మరో మిత్రుడు చిరంజీవి.. ఆరోగ్య దాస్ కోసం అతని ఇంటికి వెళ్లి చూడగా దాస్ అపస్మారక స్థితిలో కనిపించాడు. పరిశీలించి చూడగా అతని ఎడమ ఛాతి భాగంపై రక్తంతో కూడిన గాయాలుండడంతో వెంటనే పోలీసులకి సమాచారమందించాడు.

విషయం తెలుసుకున్న ఏసీపీ బేగంపేట్ శ్రీ రామ్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ మార్చురీ కి తరలించారు. ఈ అనుమానాస్పద మృతిని మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

 

Latest Updates