ఓల్డ్ ఇస్ గోల్డ్.. జస్ట్​ రూ.140 కోట్లే

కారు కొనాలనుకుంటున్నారా? ఎంత వరకు పెడతారు? పది లక్షలు.. పోనీ కోటి రూపాయలు.. ఇంకా ఖరీదైన కారు కావాలా? అయితే, ఇదిగో ఈ పాత రేసింగ్​ కారును కొనేసుకోండి. ఎంతేంటి అంటారా? రూ.140 కోట్ల పైమాటే (2 కోట్ల డాలర్లు). అంత గొప్పేముందా కార్లో అని మళ్లీ అడిగేరు. అక్కడికే వస్తున్నాం. మన తాత ముత్తాతల కాలం నాటి రేసు కారిది. ఇప్పుడంటే రేస్​ కార్లు చూడ్డానికి అందంగా, అధునాతనంగా ఉన్నాయిగానీ, అప్పట్లో ఇలాగే ఉండేవి మరి. ఇది ఇప్పుడు చాలా ఫేమస్​ కార్​ అయిన పోర్షేదే. టైప్​64గా పిలిచేవారు. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క పాత పోర్షే కార్​ ఇదే.

ఆగస్టులో అమెరికా కాలిఫోర్నియాలోని మోంటరీలో కార్​ వీక్​ 2019ను నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈ కారు వేలంలో 2 కోట్ల డాలర్లు (రూ.140 కోట్లపైనే) పలకొచ్చని నిర్వాహకులు అంటున్నారు. ఒకవేళ అదేగానీ జరిగితే ప్రపంచ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన పోర్షే కారుగా ఇది రికార్డు సృష్టిస్తుందని చెబుతున్నారు. ఈ కారును తయారు చేయాలన్న ఆలోచన కంపెనీకి 1939లో వచ్చింది. ఆ తర్వాతి ఏడాది అంటే 1940లో దానికి ఓ రూపమిచ్చింది. కంపెనీ ఇంజనీర్​, పోర్షే ఓనర్​ ఫెర్డినాండ్​ పోర్షే కుమారుడు ఫెర్రీ పోర్షే ఆలోచనల్లో నుంచి పుట్టిందీ కారు. ఈ కారును సొంతం చేసుకున్న తొలి వ్యక్తి రేసర్​ ఒట్టో మాథ్​. 1949లో ఆ కారును కొన్నాడు. 1950లో దాన్ని రేసింగ్​ కోసం విరివిగా వాడారు. 1995లో చనిపోయే దాకా ఆయన వద్దే ఉంది ఆ కారు. తర్వాత ఆస్ట్రియాకు చెందిన డాక్టర్​ థామస్​ గ్రూబర్​ అనే వ్యక్తి కారును కొన్నాడు. ప్రస్తుతం అది అతడి దగ్గరే ఉంది. ఇప్పుడు ఆర్​ఎం సోథెబీ అనే సంస్థ దానిని వేలం వేయనుంది.

Latest Updates