కడియాల కోసం కాళ్లు న‌రికి, పెట్రోల్ పోసి..

రంగారెడ్డి జిల్లా ఆధిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని దారుణం జరిగింది. అభ‌ర‌ణాల కోసం ఓ వృద్ధురాలిని అతి కిరాత‌కంగా చంపి, పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక రాందాస్ పల్లి పరిధిలో ఒక వెంచర్ లో తెగిపడి ఉన్న ఓ కాలును చూసి అక్క‌డి స్థానికులు 100కు ఫోన్ చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకొని.. చుట్టుప్రక్కల పరిశీలించగా హత్యకు గురై పాక్షికంగా కాలిన ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాళ్లకున్న వెండి కడియాలకోసం మహిళను దారుణంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

మహిళను చంపి, రెండు కాళ్ళు నరికి చెల్లా చెదురుగా పడేసిన హంతకుడు.. ఆ ఆనవాళ్లు కనపడకుండా పెట్రోల్ తో మృతదేహాన్ని కాల్చేశాడు. పాక్షికంగా కాలిన ఆ మృత‌దేహాన్ని వ‌నస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్ కు చెందిన బొమ్మరాజు(చాకలి) మైసమ్మ(60) గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె క‌నిపించ‌డం లేదంటూ కేసు నమోదైంది. మంగ‌ళ‌వారం ఆమె శ‌వ‌మై క‌నిపించింది. 100 తులాల వెండి ఆభరణాలు, 4 తులాల బంగారు ఆభరణాల కోసం ఆ వృద్ధురాలిని దారుణంగా చంపిన‌ట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని హంత‌కుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Latest Updates