జైల్లో ఉండి కోట్లు కొల్లగొట్టిన కిలాడీ ఖైదీ

ఉంటున్నది జైల్లో. చుట్టూ గట్టి సెక్యూరిటీ. కానీ ఆ కిలాడీ ఖైదీ.. జైల్లో నుంచే ఆన్‌లైన్‌ స్కామ్‌ చేశాడు. కోట్లు కొల్లగొట్టేశాడు. నైజీరియాలోని హోప్‌ ఒలుసెగున్‌ అరోకే అనే వ్యక్తికి నాలుగేళ్ల కిందట జైలు శిక్ష పడింది. జనాన్ని మోసం చేసి డబ్బు సంపాదించినందుకు శిక్ష వేశారు. లగోస్‌లోని మాగ్జిమమ్‌ సెక్యూరిటీ ప్రిజన్‌కు తరలించారు. జైల్లో ఉంటుండగానే ఓసారి జ్వరమొచ్చి హాస్పిటల్‌కు వెళ్లాడు. తర్వాత జైలుకు రాకుండా హోటళ్లలో ఉన్నాడు. అక్కడే ఫ్యామిలీని, పిల్లలని కలిశాడు. కొన్ని ఫంక్షన్లకూ వెళ్లాడు. ఆ టైంలోనే మొబైల్‌ ఫోన్లను, ఇంటర్నెట్‌ను వాడాడు. జైలుకెళ్లాక సహచరులతో టచ్‌లో ఉన్నాడు. వాళ్లతో కలిసి వివిధ దేశాల్లోని ప్రజలను టార్గెట్‌ చేశాడు. ప్లాన్‌ ప్రకారం రూ. 8 కోట్ల వరకు కొల్లగొట్టేశాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇదంతా తేలింది. హోప్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన వాళ్లను, అతనికి సెక్యూరిటీగా ఉన్న వాళ్లను, అతన్ని కలిసిన వాళ్లను విచారిస్తున్నారు. జైల్లో ఉండాల్సిన ఖైదీ బయటకు, ఫంక్షన్లకు ఎట్ల వెళ్లాడు, హోటళ్లలో ఎట్ల ఉన్నాడో అడిగితే అధికారులు స్పందించలేదు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్‌ జరుగుతోందని, ఏం మాట్లాడలేమని చెప్పారు. ఏయే దేశస్థులను టార్గెట్‌ చేశాడో కూడా వెల్లడించలేదు.

2012లోనూ అరెస్టు

జైల్లో ఉన్నపుడు నకిలీ పేరుతో బ్యాంకు అకౌంట్లు ఓపెన్‌ చేశాడు హోప్‌. ట్రాన్సాక్షన్లు చేశాడు. తన భార్య పేరుతో ఇండ్లు, కార్లు  కొన్నాడు. భార్య బ్యాం కు అకౌంట్‌ టోకెన్‌ను జైల్లో నుంచే వాడాడు. కింది స్థాయి సిబ్బంది, పోలీసులు లంచం తీసుకుని హోప్‌ కు సాయం చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. 2012 వరకు మలేసియాలో ఉన్న హోప్‌.. అక్కడ కొందరిని మోసం చేసి డబ్బు సంపాదించాడు. అక్కడున్నప్పుడు కౌలాలంపూర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ స్టూడెంట్‌నని చెప్పుకున్నాడు. మలేసియా నుంచి నైజీరియాకు హోప్‌ తిరిగి వచ్చాక అంతర్జాతీయంగా ఫ్రాడ్‌ చేసినందుకు అరెస్టు చేశారు. అక్కడి కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది.

Latest Updates