ఒలింపిక్స్ వాయిదా ఖాయం!

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం స్తంభించింది..! వందలాది దేశాలు వైరస్‌‌‌‌ బారిన పడి వణికిపోతున్నాయి..! అన్ని రంగాలూ దెబ్బతినగా.. క్రీడారంగం మొత్తం కుదేలైంది..! ఆటలు లేక స్టేడియాలు కళ తప్పాయి..! ఆటగాళ్లు ప్రాక్టీస్‌‌‌‌కు, కోచింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లకు బ్రేక్‌‌‌‌ ఇచ్చేశారు..! ఐపీఎల్, ఎన్‌‌‌‌బీఏ, యూరో లీగ్‌‌‌‌, కోపా అమెరికా సాకర్‌‌‌‌ కప్‌‌‌‌ కూడా వాయిదా పడ్డాయి..! మరెన్నో టోర్నీలు రద్దయ్యాయి..! దాదాపు సగం ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌ టోర్నీలకూ బ్రేక్‌‌‌‌ పడింది..! ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌‌‌‌ నిర్వహణ ప్రహసనంగా మారింది..! ప్రాణాలను పణంగా పెట్టి పోటీకి రావాలా? అంటూ అథ్లెట్లు.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో గేమ్స్‌‌‌‌ అవసరమా? అంటూ క్రీడా సంఘాలు ప్రశ్నల వర్షం గుప్పిస్తుండగా..ఇంటర్నేషనల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ కమిటీ,                  ఆతిథ్య జపాన్‌‌‌‌ ఎట్టకేలకు తలొగ్గాయి..! ఆలస్యంగా నిర్వహించే అవకాశం ఉందని తమ పార్లమెంట్‌‌‌‌ సాక్షిగా జపాన్‌‌‌‌ ప్రధాని ప్రకటించడంతో టోక్యో 2020 గేమ్స్‌‌‌‌ వాయిదా ఖాయమే అనిపిస్తోంది..! రద్దు ఆలోచనే తమకు లేదంటున్న ఐఓసీ.. ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది..! అయినా ఈ మెగా ఈవెంట్‌‌‌‌ నుంచి వైదొలుగుతున్నట్టు కెనడా అధికారికంగా ప్రకటించడం గమనార్హం!

టోక్యోఒలింపిక్స్ ఆలస్యం కానున్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్‌‌ దాటికి ప్రపంచం మొత్తం కుదేలవుతుండగా.. విశ్వక్రీడలను వాయిదా వేసే యోచనలో ఉన్నట్టు జపాన్‌‌ ప్రధాని షింజో అబె సోమవారం తమ పార్లమెంట్‌‌లో ప్రకటించారు. దీనిపై నాలుగు వారాల్లో తుది నిర్ణయం వస్తుందని ఇంటర్నేషనల్‌‌ ఒలింపిక్‌‌ కమిటీ (ఐఓసీ)  తెలిపింది. మరోవైపు టోక్యో గేమ్స్‌‌ నుంచి కెనడా వైదొలుగుతున్నట్టు ప్రకటించగా… ‘2021లో జరిగే ఒలింపిక్స్‌‌’కోసం సిద్ధం కావాలని ఆస్ట్రేలియా తమ దేశ అథ్లెట్లకు సూచించింది.
దాంతో, మెగా ఈవెంట్‌‌ వాయిదా పడడం ఖాయమని స్పష్టమవుతోంది. అథ్లెట్లు, వివిధ క్రీడా సంఘాలు వాయిదా వేయాలని చాన్నాళ్లుగా డిమాండ్‌‌ చేస్తున్నప్పటికీ నిర్ణీత సమయానికే గేమ్స్‌‌ను ప్రారంభిస్తామని జపాన్‌‌ గవర్నమెంట్‌‌, ఒలింపిక్‌‌ అధికారులు చెబుతూ వస్తున్నారు. ఒలింపిక్స్‌‌ పూర్తి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని జపాన్‌‌ ప్రధాని స్పష్టం చేశారు. కానీ, అది కష్టమైతే మాత్రం మొదటగా క్రీడాకారులను పరిగణనలోకి తీసుకుంటే పోటీలను వాయిదా  తప్పదేమోనని ప్రకటించారు. అంతకుముందే ఐఓసీ చీఫ్‌‌ థామస్‌‌ బాచ్‌‌ ‘వాయిదా’అనేది తమ పరిశీలనలో ఉన్న ఒక ఆప్షన్‌‌ అన్నారు. దీనిపై నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మెంబర్లతో ఎమర్జెన్సీ మీటింగ్ అనంతరం.. అథ్లెట్లకు ఆయన లేఖ కూడా రాశారు. ‘మనుషుల జీవితాలకంటే ఏదీ ముఖ్యం కాదు. ఒలింపిక్స్‌‌ కూడా తర్వాతే. గేమ్స్‌‌ను రద్దు చేస్తే ఎలాంటి సమస్య పరిష్కారం కాబోదు. అలా చేస్తే ఎవ్వరికీ ఉపయోగం కూడా ఉండదు. అందువల్ల అది మా ఎజెండాలోనే లేదు’అని లేఖలో పేర్కొన్నారు.

అథ్లెట్లే కాదు అందరి ఆరోగ్యానికి ముప్పు కెనడా

కొవిడ్‌‌–19 వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక దేశాలు కఠిన ఆంక్షలు విధించడంతో అథ్లెట్లు, క్రీడా సంఘాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. టోర్నీలన్నీ ఆగిపోగా.. కనీసం ట్రెయినింగ్‌‌కు కూడా అవకాశం లేకుండా పోయింది. దాంతో, ఒలింపిక్స్‌‌ను వాయిదా వేయాలని స్పోర్ట్స్‌‌ బాడీస్‌‌ డిమాండ్‌‌ చేస్తున్నాయి. మరో అడుగు ముందుకేసిన కెనడా పోటీలను ఏడాది పాటు వాయిదా వేయాలంటూ ఏకంగా ఒలింపిక్స్‌‌, పారాలింపిక్స్‌‌ నుంచి వైదొలిగింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండగా గేమ్స్‌‌ కోసం ట్రెయినింగ్‌‌ కొనసాగిస్తే అథ్లెట్లు, వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు మిగతా ప్రజల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని కెనడా ఒలింపిక్‌‌ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య పరిస్థితిని, ఒలింపిక్‌‌ సన్నాహాలపై దాని ప్రభావంతో పాటు వాయిదా అవకాశాలపై పూర్తిస్థాయిలో చర్చలు జరుపుతామని ఐఓసీ చెప్పినప్పటికీ కెనడా గేమ్స్‌‌ నుంచి తప్పుకుం. మరోవైపు ‘వాయిదా’పై నిర్ణయం చెప్పేందుకు ఐఓసీ చెప్పిన గడువుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఐఓసీది బాధ్యతారాహిత్య ప్రకటన అని బ్రిటన్‌‌కు చెందిన వరల్డ్‌‌ 200మీ. చాంపియన్‌‌ డినా అషెర్‌‌- స్మిత్‌‌ విమర్శించింది. ‘ఇప్పుడు మేం వెయిట్‌‌ చేయాలి. అంటే ఫిట్‌‌గా ఉండేందుకు అథ్లెట్లు మరో నాలుగు వారాల పాటు ట్రెయినింగ్‌‌ కొనసాగించాలి. చివరకు గేమ్స్‌‌ వాయిదా పడుతున్నప్పటికీ మాతో పాటు కోచ్‌‌లు, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌, మా కుటుంబ సభ్యుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టాల్సిందేనా?’అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

జులైలో ఒలింపిక్స్​ సాధ్యం కావు సెబాస్టియన్ కో

లండన్:  కరోనా వైరస్​ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న నేపథ్యంలో జులైలో ఒలింపిక్స్ నిర్వహించడం సాధ్యం కాదని వరల్డ్​ అథ్లెటిక్స్​ ​చీఫ్​ సెబాస్టియన్ ​కో అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇంటర్నేషనల్​ఒలింపిక్​ కమిటీ ప్రెసిడెంట్​థామస్​ బాచ్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు.  ఒలింపిక్స్ వాయిదాపై నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల సమయం ఉందని ఐఓసీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే సెబాస్టియన్​ఈ లేఖ పంపారు. ‘ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా దేశాలు వారిని బయటకు రావద్దని చెబుతున్నాయి. ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో అథ్లెట్లు శిక్షణ కొనసాగిస్తే గాయాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జులై 24 నుంచి మెగా ఈవెంట్​జరిగే అవకాశం లేదు’ అని కో  చెప్పుకొచ్చారు. అథ్లెట్ల ప్రాణాలను పణంగా పెట్టి ఒలింపిక్స్​నిర్వహించాలని ఎవరూ
కోరుకోరని పునరుద్ఘాటించారు.

నెల పాటు వేచి చూస్తాం: బాత్రా

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ భయంతో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్​నుంచి వైదొలుగుతున్నట్లు కెనడా ప్రకటించడంతో మిగతా దేశాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్​నరీందర్ ​బాత్రా విశ్వ క్రీడల్లో పాల్గొనడంపై సోమవారం స్పందించారు. ఒలింపిక్స్ పై తుది నిర్ణయం తీసుకునే ముందు ఓ నెల రోజుల పాటు వేచి చూసే ధోరణిని అవలంబిస్తామని.. అథ్లెట్లు, అధికారుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. తాజా పరిస్థితులను గమనిస్తున్నామని, అథ్లెట్ల బాగు కోరే నిర్ణయమే తీసుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ వాయిదా పడుతుందని తాము భావించట్లేదని ఐఓఏ సెక్రటరీ జనరల్​ రాజీవ్ ​మెహతా చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో పరిస్థితులు మరీ అధ్వానంగా లేవన్నాడు. కాగా, కెనడా బాటాలోనే ఇండియా నడుస్తుందా అని స్పోర్ట్స్ సెక్రటరీ రాధే శ్యామ్​జులానియాను ప్రశ్నించగా.. తాము ఎవరినీ సంప్రదించట్లేదని, క్రీడా మంత్రిత్వ శాఖ ఇకపై ఎవరికీ సలహాలు ఇవ్వబోదని స్పష్టం చేశారు.

ఆలస్యమైతే అవరోధాలెన్నో

జపాన్‌‌ ప్రధాని, ఐఓసీ ప్రెసిడెంట్‌‌ ప్రకటనల దృష్ట్యా ఒలింపిక్స్‌‌ వాయిదా ఖాయమే అనిపిస్తోంది. కానీ, విశ్వక్రీడలను వాయిదా వేయడం అంటే ఆషామాషీ విషయం కాబోదు. థామస్‌‌ బాచ్‌‌ అన్నట్టుగా ఓ ఫుట్‌‌బాల్‌‌ మ్యాచ్​ను మరో వారానికి వాయిదా వేసినంత ఈజీ కాదు. చాలా అవరోధాలను దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐఓసీ, ఆతిథ్య జపాన్‌‌కు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో చూద్దాం.

షెడ్యూలింగ్‌‌

ఒలింపిక్స్‌‌ నిర్వహణ అంటే నాలుగేళ్ల నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో టోక్యో గేమ్స్‌‌ వచ్చే ఏడాది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, 2021 స్పోర్ట్స్‌‌ క్యాలెండర్‌‌ ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. దాంతో, మెగా ఈవెంట్‌‌ను రీషెడ్యూల్‌‌ చేయడం ఆర్గనైజర్లకు తలనొప్పి కానుంది. ముఖ్యంగా 2021 ఆగస్టులో అమెరికాలో షెడ్యూల్‌‌ చేసిన వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌తో క్లాష్‌‌ వచ్చే ప్రమాదం ఉంది. అదే ఏడాది జులై 16 నుంచి ఆగస్టు 1 వరకు జపాన్‌‌లోనే వరల్డ్‌‌ స్విమ్మింగ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌ ఉన్నాయి. యూరో కప్‌‌, కోపా అమెరికా కప్‌‌ను కూడా 2021కి వాయిదా వేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌‌ వచ్చే ఏడాదికి వాయిదా పడితే  బ్రాడ్‌‌ కాస్టర్లకు నష్టం వస్తుంది.

వేదికలు

ఒలింపిక్స్‌‌ కోసం దాదాపు 43 సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. గేమ్స్ పోస్ట్‌‌పోన్‌‌ అయితే వాటి నిర్వహణ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఐఓసీ దీనిపైనే ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గేమ్స్‌‌కు కీలకమైన కొన్ని వేదికలు ఇకపై అందుబాటులో ఉండకపోవచ్చని అంటోంది. ఉదాహరణకు 68 వేల సీటింగ్‌‌ కెపాసిటీ ఉన్న ఒలింపిక్‌‌ స్టేడియాన్ని గేమ్స్‌‌ ముగిసిన తర్వాత కల్చరల్‌‌, స్పోర్టింగ్‌‌ ఈవెంట్లకు వాడుకోవాలని నిర్ణయించారు. అయితే, ఒలింపిక్స్‌‌ వాయిదా పడితే మాత్రం ఆ స్టేడియంలో షెడ్యూల్‌‌ చేసిన ఇతర ఈవెంట్లను వేరే చోటుకు తరలించాల్సి ఉంటుంది. దానివల్ల నిర్వాహకులు ఆదాయం కోల్పోతారు.  అలాగే, విశ్వక్రీడల  కవరేజ్‌‌ కోసం వేల సంఖ్యలో వచ్చే జర్నలిస్టుల కోసం ఆర్గనైజర్లు.. ‘టోక్యో బిగ్‌‌ సైట్‌‌ ఎగ్జిబిషన్‌‌ సెంటర్‌‌’ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆసియా ఖండంలో ఉన్న భారీ వేదికల్లో ఇది ఒకటి. నెలల ముందే దీన్ని బుక్‌‌ చేసుకుంటారు. ఇప్పుడు గేమ్స్‌‌ లేట్‌‌ అయితే అలాంటి సౌకర్యాలు ఉన్న ఇతర వేదికలను అన్వేషించడం నిర్వాహకులకు కత్తిమీదసామే.

అథ్లెట్ల విలేజ్‌‌

గేమ్స్‌‌ వాయిదా పడితే టోక్యోలో నిర్మించిన అథ్లెట్ల విలేజ్‌‌ పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది. ఒలింపిక్స్‌‌ ముగిశాక వీటిని రియల్‌‌ ఎస్టేట్‌‌ కంపెనీలకు కేటాయించేందుకు నిర్వాహకులు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. సిటీలో ప్రధాన ప్రాంతంలో  14 నుంచి 18 అంతస్తుల మేర నిర్మించిన 21 టవర్లలో  ఒలింపిక్స్‌‌ సందర్భంగా మొత్తం 18,000 బెడ్లు, పారాలింపిక్స్‌‌కు 800 బెడ్లు సిద్ధం చేస్తున్నారు. గేమ్స్‌‌ పూర్తయిన వెంటనే విలేజ్‌‌ను పునరుద్ధరించి వేలాది లగ్జరీ అపార్ట్‌‌మెంట్లుగా మార్చాలని ప్లాన్‌‌ చేశారు. మొదటి బ్యాచ్‌‌లో 940 అపార్ట్‌‌మెంట్లలో చాలా మొత్తం అమ్ముడయ్యాయి. ఇప్పుడు గేమ్స్‌‌ వాయిదా వేస్తే పునరుద్ధరణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టులను ఉల్లంఘించినట్టు అవుతుంది.

హోటల్స్‌‌

ఒలింపిక్స్‌‌కు వచ్చే అతిథుల కోసం టోక్యోలో చాలా హోటళ్లను బుక్‌‌ చేశారు. అందుకు భారీగా అడ్వాన్స్‌‌ చెల్లించారు.  తీరా పోటీలు వాయిదా పడి ఆ బుకింగ్స్‌‌ను రద్దు చేస్తే చాలా డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. తిరిగి  పోటీలు జరిగే తేదీల్లో హోటళ్లు అందుబాటులో ఉంటాయో లేవో చెప్పలేని పరిస్థితి. కరోనా వైరస్‌‌కు ముందే టోక్యోలో హోటల్‌‌ గదుల కొరతపై ఆందో ళన వ్యక్తమైంది. సముద్రతీరంలో భారీ ఓడల్లో గదు లను వాడుకోవాలని నిర్వాహకులు భావించారు. ఇప్పుడు పోటీలు జరిగే అవకాశం లేకపోవడంతో హోటల్‌‌ ఇండస్ట్రీలోనూ అనిశ్చితి నెలకొంది.

ఏడాది చివర్లో జరిగితే కాస్త రిలీఫ్

టోక్యో ఒలింపిక్స్‌‌ను షెడ్యూల్‌‌ చేసిన జులై, ఆగస్టులో జపాన్‌‌లో విపరీతమైన ఎండ ఉంటుంది. దీనిపై ముందు నుంచే ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు పోటీలను ఈ ఏడాది చివరికి జరిపితే ఈ విషయంలో మాత్రం కాస్త రిలీఫ్ లభించనుంది. అప్పుడు వాయిదా పడ్డ  మారథాన్‌‌ను కూడా  తిరిగి టోక్యోలోనే నిర్వహించొచ్చు. వేసవిలో అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఈవెంట్‌‌ను టోక్యో నుంచి సపొరొ సిటీకి మార్చారు. అలాగే, ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వక్రీడలు వాయిదా పడితే క్వాలిఫయింగ్‌‌ ఈవెంట్లకు రెడీ అయ్యేందుకు స్పోర్ట్స్‌‌ ఫెడరేషన్లకు కొంత సమయం లభించనుంది. మెజారిటీ అథ్లెట్లు కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates