అదృశ్య‌మైన ఒమిక్రాన్ పేషెంట్ ఆచూకీ లభ్యం

అదృశ్య‌మైన ఒమిక్రాన్ పేషెంట్  ఆచూకీ లభ్యం

హైదరాబాద్: ఒమిక్రాన్ పాజిటివ్ వ‌చ్చి మూడు రోజులుగా అదృశ్య‌మైన కెన్యా దేశ‌స్థుడిని బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఫిలింన‌గ‌ర్ ప్రాంతంలోని  గెస్ట్ హౌజ్‌లో పట్టుకున్నారు. ఈ నెల 14న కెన్యా దేశం నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా ఉన్న‌ట్లు ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. అప్ప‌టికే అత‌ను బ‌య‌ట‌కు రావ‌డం, ఒమిక్రాన్ ఉన్న‌ట్లు తేల‌డంతో టోలిచౌకి స‌మీపంలోని పారామౌంట్ కాల‌నీలోని అత‌డి ఇంటికి వెళ్ల‌కుండా అదృశ్య‌మ‌య్యాడు. దీంతో మెడిక‌ల్ డిపార్ట్‌మెంట్‌, బంజార‌హిల్స్ పోలీసులు మూడు రోజులుగా వెతుకుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఫిలింన‌గ‌ర్‌లోని ఒక గెస్ట్ హౌజ్‌లో ఉన్న‌ట్లు సమాచారం రావడంతో.. బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని గోల్కొండ ఎస్పీహెచ్ఓ అనురాధ‌కు స‌మాచారం అందించి అప్ప‌గించారు. గ‌దిలో అత‌నిపాటు ఉన్న స్నేహితుడైన నూర్‌ను అదుపులోకి తీసుకొని టిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు అనురాధ.