సీఎం జగన్ తో చిరంజీవి భేటీ: రాజకీయ వర్గాల్లో ఆసక్తి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 14న భేటీ అవుతున్నారు. వచ్చే సోమవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంట్లో ఈ ఇద్దరి మధ్య లంచ్ బేటీ జరగబోతోంది.

రాజకీయాలు మాట్లాడుతారా?!

ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉండబోతోందా? పొలిటికల్ విషయాలేమైనా చర్చకు వస్తాయా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

సినిమా చూపించేందుకే

2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఆ తర్వాత పరిణామాలతో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవి యూపీఏ సర్కార్ లో కేంద్ర మంత్రిగా చేశారు. 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

ఖైదీ నంబర్.150 సినిమాతో మళ్లీ వెండితెరపై వెలిగిపోతున్నారు. స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా సైరా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూడాలని సీఎం జగన్ ను కోరేందుకే చిరూ ఆయనతో సమావేశమవుతున్నారని, ఇది రాజకీయ భేటీ కాదని మెగా ఫ్యామిలీ వైపు నుంచి వినిపిస్తోంది. సీఎం ఓకే అంటే ప్రత్యేక షో వేసి సినిమా చూపించే ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారు.

వాస్తవానికి శుక్రవారమే జరగాల్సిన భేటీ కొన్ని కారణాల వల్ల సోమవారానికి వాయిదా పడింది.

సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి (పాత ఫొటో)

Latest Updates